స్వచ్ఛమైన మనసులకు ఆలంబన

3 Dec, 2013 02:18 IST|Sakshi

‘చదివిన చదువుకు సార్థ్ధకత చేకూరాలి. అలాగే చేసే పని మనసుకు సంతృప్తినివ్వాలి. మానసికంగా ఎదగని పిల్లలకు పాఠాలు చెబుతూ అందులోనే సంతృప్తిని వెదుక్కుంటున్నాను’ అంటున్నారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన 35 ఏళ్ల బబిత. మానసికంగా ఎదగని, అలాగే చదువులో వెనకబడిన పిల్లల కోసం ‘శ్రేయా ఇన్‌స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్’ పేరుతో స్కూల్‌ను నడుపుతున్నారు బబిత. అదీ తన ఇంటి లోగిలిలోనే! ఫీజులతో నిమిత్తం లేకుండా సేవే పరమావధిగా సామాజిక వెలుగుకోసం నేనూ ఓ చిరుదివ్వెను వెలిగిస్తాను’ అంటున్న 35 ఏళ్ల బబిత ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే...  
 
 ఇంటింటికి వెళ్లి...

 ‘‘చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే ఆలోచన అమితంగా ఉండేది. అయితే ‘అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకంటే బతికినన్నాళ్లూ కుటుంబసభ్యులపై ఆధారపడే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుంది’అనుకునేదాన్ని. అందుకు కారణం మా మేనమామ. ఆయన మెంటల్లీ హ్యాండికాప్డ్. శారీరకంగా ఎదిగినా, మానసికంగా రెండేళ్ల పిల్లవాడిలా ఉండేవాడు. కుటుంబసభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూనే ఆయనకి సేవలు చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరగడం వల్లనేమో ఈ తరహా ఆలోచన నాతోపాటు వృద్ధి చెందింది. అందుకే స్పెషల్ చిల్డ్రన్ కోసం 2007లో ప్రత్యేక కోర్సు చేశాను. అప్పటికే నాకు పెళ్లై, ఓ పాప కూడా ఉంది. పాప బాగోగులు చూసుకుంటూనే మానసికంగా ఎదగని పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి క్లాసులు తీసుకునేదాన్ని. మా వారు డా.కులశేఖర్, ఇఎస్‌ఐ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్! తనకీ సమాజసేవ అంటే చాలా ఇష్టం. వారాంతంలో స్లమ్ ఏరియాలో హెల్త్‌క్యాంపులు నడుపుతుంటారు. ఆయనలో ఆ దృక్పథం ఉండటం వల్లేనేమో నా ఆలోచనకు ఊతం ఇస్తుంటారు.
 
ఇద్దరు ముగ్గురి నుంచి ఇరవై మంది వరకు....

మానసికంగా ఎదగని ఒకరిద్దరు పిల్లలకే ఇస్తున్న ఈ శిక్షణ మరికొంత మంది పిల్లలకు కూడా అందితే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం శ్రేయ పేరుతో ఇంట్లోనే స్పెషల్ స్కూల్‌ను మొదలుపెట్టాను. మొదట ఇద్దరు, ముగ్గురు పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 20 మంది వరకు ఉన్నారు. వారికై వారు శుభ్రంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న పనులు తమకు తామే ఎలా పూర్తి చేసుకోవాలి? వారి వస్తువులు వారే ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తూనే ఆ తర్వాత వృత్తివిద్యాకోర్సులకు అనుబంధిత సంస్థలతో కలిసి శిక్షణ ఇప్పిస్తుంటాను. వీరిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పదిమంది పిల్లలు, సాయంత్రం 5-7 వరకు మరో పదిమంది పిల్లలు వస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మరొక టీచర్ సాయం కూడా తీసుకున్నాను.
 
ఆటపాటలతో...

మానసికంగా ఎదగని చిన్నారులను బుద్ధిగా కూర్చోబెట్టాలంటే వారి కళ్లకు అంతా కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకోసం ఇంట్లోనే ఓ రెండు గదులను రంగురంగులుగా తీర్చిదిద్దాను. అలాగే వారికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం వారికి ఆటపాటలను నిర్వహిస్తుంటాను. వారి పుట్టినరోజులు, ఇతర ముఖ్యమైన తేదీలు వేడుకగా జరుపుతాను. స్వచ్ఛమైన మనసులు ఉన్న చోట ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ చిన్నారులతో ఎంత సేపు ఉన్నా సమయమే తెలియదు’’ అని తెలిపారు ఆమె. సమాజసేవలో పాలుపంచుకోవాలంటే పోగేసుకున్న డబ్బులే అవసరం లేదు. మనసులో ఓ మంచి ఆలోచన, చేయగలను అనే సంకల్పం ఉంటే చాలు ఇంటి నుంచే సేవను మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తున్నారు బబిత.
 
- నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు