‘సైగల’తో సంఘీభావం

21 Apr, 2016 23:23 IST|Sakshi
‘సైగల’తో సంఘీభావం

బధిరుడైన క్లాస్‌మేట్‌కు సంఘీభావం తెలపాలనుకున్నారు ఆ పిల్లలు. దీనికోసం వాళ్లు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కొద్ది నెలల్లోనే పట్టుదలతో సైగల భాష నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లందరూ బధిరుడైన తమ క్లాస్‌మేట్‌తో ఇంచక్కా సైగల భాషతో రోజూ తెగ కబుర్లాడేసుకుంటున్నారు. బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా రాజధాని సారాజెవోలోని నకాస్ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరేళ్ల జెజ్ద్ ఒకటో తరగతిలో చేరాడు. అతడు పుట్టుకతోనే బధిరుడు. అలాగని ఆ పాఠశాల మూగ బధిరుల కోసం ప్రత్యేకించినదేమీ కాదు. మామూలు విద్యార్థులు చదువుకునే పాఠశాలే. దగ్గర్లో మరే పాఠశాల లేకపోవడంతో జెజ్ద్‌ను అతడి తల్లి ఆ పాఠశాలలో చేర్చడానికి తీసుకొచ్చింది. టీచర్లకు అతడి పరిస్థితిని వివరించింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, అతడిని చేర్చుకున్నారు. కొత్తగా వచ్చిన జెజ్ద్‌తో స్నేహంగా ఉండాలంటూ మిగిలిన పిల్లలకు చెప్పారు.


మిగిలిన పిల్లలు కూడా అతడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ల మాటలేవీ అతడికి వినిపించకపోవడంతో మొదట్లో కాస్త నిరుత్సాహం చెందారు. అతడి సైగల భాష వాళ్లకు అర్థం కాకపోవడంతో కొన్నాళ్లు వాళ్లు అయోమయం చెందేవాళ్లు. పిల్లల ఇబ్బందిని గమనించిన వాళ్ల టీచర్ సనేలాకు ఒక ఐడియా వచ్చింది. జెజ్ద్‌కు ఎలాగూ మాటలు వినిపించవు కదా, అందుకే తాను సైగల భాష నేర్చుకోవడానికి సిద్ధపడింది. మిగిలిన పిల్లలను కూడా సైగల భాష నేర్చుకునేలా ప్రోత్సహించింది. కొద్ది నెలల్లోనే వాళ్లు సైగల భాషను నేర్చేసుకున్నారు. తన కోసం తన క్లాస్‌మేట్స్ అందరూ సైగల భాష నేర్చుకోవడంతో జెజ్ద్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక అప్పటి నుంచి క్లాస్‌లో సందడే సందడి.

 

మరిన్ని వార్తలు