విజయ దీపావళి...విజయాలకు ఆవళి

2 Nov, 2013 00:31 IST|Sakshi

వెలుగంటే ఇష్టం ఉండనిదెవరికి? అందులోనూ వెలుగును ఆనందించే జాతి మనది. భా అంటే వెలుగు. రతి అంటే ఆనందించగల ఇష్టం. అందుకే ఈ వెలుగును వాంఛించే జాతి ఉండే భూమిని భరత వర్షం, భరత ఖండం అని పేర్కొన్నారు ప్రాచీనులు. ఇటువంటి భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట. అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు.
 
 చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని, కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రాని వాటిని, హాని కలిగించేవాటిని చీకటిగానూ చెబుతుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఃఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశానిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగానూ, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడేవన్నీ వెలుగుగానూ సంకేతించారు. అందువల్లనే అన్ని విధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారత జాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము, పూజిస్తాము.
 దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ
 దీపం సర్వ తమోపహమ్
 దీపేన సాధ్యతే సర్వం
 సంధ్యాదీపం నమోస్తు తే

 అని దీపాన్ని ప్రార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించడానికి ఎంతటి సంతోషం ఉప్పొంగి ఉండాలో కదా!   అటువంటి సందర్భం ద్వాపరయుగం చివరలో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది.
 
యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే మహా బలవంతుడు, లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు విష్ణుమూర్తికి.
 
లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదునారు సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్రహ్మపుత్రా నదీపరీవాహక ప్రాంతంలో ప్రాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు.

ఆ మాటను అనుసరించి చాలాకాలం భుజబలంతో తనకెవ్వరూ ఎదురులేని విధంగా ధర్మబద్ధంగానే పాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసుర లక్షణాలు బహిర్గతమయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రిక సాధన సత్వర ఫలవంతమని అనుసరించడం మొదలు పెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారువేలమంది రాజకుమార్తెలను చెరబట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయసాగాడు.
 
 ఇంద్రుడు కోరిన మీదట శ్రీకృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే సత్యభామ తానూ వెంటవస్తానని ముచ్చటపడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న శ్రీకృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు అంటే అమావాస్యనాడు ప్రజలందరూ దీపాలు వెలిగించుకుని సంబరాలు చేసుకున్నారు.
 
 ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని ఈ సందర్భంలో ఒకరు చనిపోతే చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయింది?
 
నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకుకునికి వాటన్నింటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ప్రాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ప్రాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట.

నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి కూడా భయం. వద్దామన్నా వెలుగులేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి భయమనే చీకట్లో మగ్గారు ప్రజలందరూ. భయకారణం పోగానే ఇన్నాళ్ల దీపాలు కరువుతీరా వెలిగించుకుని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభసంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఇది చీకటిపై వెలుగు. గెలుపుకి సంకేతం. స్వంత కొడుకైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే ఉత్తమురాలైన మాతృహృదయానికి సంకేతం.
 
అమావాస్య అంత శుభప్రదమైంది కాదనే విశ్వాసం చాలామందికి ఉన్నా, ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు ఎన్నో శుభసంఘటనలు జరిగాయని చరిత్ర చెబుతోంది. ఈ రోజే విక్రమాదిత్య చక్రవ ర్తి 30 లక్షలమంది శకులను, హూణులను భరత ఖండం నుండి తరిమికొట్టి, సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టించాడు. విక్రమశకం ఈనాటినుండే మొదలయింది. ఇది వేదధర్మ విజయ సంకేతం.
 
 శిక్కుల గురువు గురు గోవిందసింగ్‌ని పరివారంతోపాటు జహంగీర్ చక్రవర్తి గ్వాలియర్ కోటలో బంధించాడు. కొంతకాలానికి ఆయన ఒక్కడిని విడుదల చేస్తానంటే తన పరివారాన్నంతటినీ విడుదల చేయాలని పట్టుబట్టాడు. చివరికి జహంగీర్ అందుకు సమ్మతించి అందరినీ విడుదల చేశాడు. అది కూడా దీపావళినాడే. అందువల్ల శిక్కులు దీపావళిని త్యాగానికి సంకేతంగా జరుపుకుంటారు.
 
 ఆశ్వయుజ బహుశ అమావాస్యనాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించింది. విష్ణువుని వివాహమాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు దీపావళిని నష్టరాజ్య లాభానికి సంకేతంగా జరుపుకుంటారు.
 
 ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనసులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేటట్టు చేయడం దీపం వెలిగించడంలోని ప్రధాన ఉద్దేశ్యం.
 
 ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతులవారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండుగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా!
 
 ప్రతిమనిషి గుండెలోని, సమాజంలోని అన్ని విధాలైన చీకట్లను పోగొట్టి, సకల శుభాలను, సుఖసంతోషాలను, ఆనందోత్సాహాలను విజయ దీపావళి నింపాలనుకుంటూ దీపాలను వెలిగిద్దాం. మన ఇంట్లో వెలిగించిన ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది మన ఆశంస.
 
 సాజ్యం త్రివర్తి సంయుక్తం... వహ్నినా యోజితం మయా
 గృహాణ మంగళం దీపం... త్రైలోక్య తిమిరాపహం

 - డా. ఎన్. అనంతలక్ష్మి
 

మరిన్ని వార్తలు