చిన్నారులనూ కుంగదీస్తుంది..

27 Dec, 2019 13:04 IST|Sakshi

న్యూయార్క్‌ : చిన్నారుల్లోనూ డిప్రెషన్‌ వేధిస్తుందని, ఏడేళ్ల వయసు నుంచే కుంగుబాటు సంకేతాలు కనిపిస్తాయని తాజా పరిశోధన హెచ్చరించింది. కుంగుబాటుతో బాధపడేవారిలో చాలా మందిలో టీనేజ్‌ వరకూ ఆదుర్ధా, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపించవని చెబుతారు. అయితే వందమంది చిన్నారులను పరిశీలించిన అమెరికన్‌ శాస్త్రవేత్తలు కుంగుబాటు లక్షణాలు ఏడేళ్ల నుంచే కనిపిస్తాయని వెల్లడించారు. ఎంఆర్‌ఐ యంత్రంపై చిన్నారులను పరీక్షించగా వారి మెదడులో నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, మూడ్‌కు సంబంధించిన రెండు భాగాల మధ్య కనెక్షన్‌ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండు మెదడు భాగాల మధ్య రక్త సరఫరా అధికంగా ఉంటే ఆ పిల్లలు తమ ఎమోషన్స్‌ను సమర్ధంగా బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతారని, రక్త సరఫరా తక్కువగా ఉంటే ఆ చిన్నారులు నాలుగేళ్ల తర్వాత కుంగుబాటు తరహా మనస్తత్వానికి చేరుకుంటారని పరిశోధనలో వెల్లడైంది. బోస్టన్‌లోని నార్త్‌ఈస్ర్టన్‌ యూనివర్సిటీ చిన్నారుల తల్లితండ్రులతోనూ మాట్లాడి ఈ అవగాహనకు వచ్చింది. ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరికి నాలుగేళ్ల తర్వాత కుంగుబాటు లక్షణాలు కనిపించాయని జామా సైకియాట్రీలో ప్రచురితమైన ఈ అథ్యయనం వెల్లడించింది.

మరిన్ని వార్తలు