మౌనం మంచిదే... కానీ?

8 Sep, 2017 00:03 IST|Sakshi
మౌనం మంచిదే... కానీ?

ఆత్మీయం

మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఆంగ్లంలో ఓ సామెత ఉంది. బంగారానికి నానాటికీ విలువ పెరిగినట్టుగానే మౌనానికి కూడా విలువ పెరుగుతుందే కాని తరగదు. మౌనం వల్ల శరీరక్రియ క్రమబద్ధమై ముఖం తేజోవంతమయ్యి, చుట్టూ కాంతి వలయం కనపడుతుంది. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం మానవుని ఆయుష్షును పెంచడమే కాక ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే మునులు అందరి మన్ననలు పొందారు. మృతులకు ఆత్మశాంతి కలిగించేందుకు రెండు నిమిషాలు మౌనం పాటించడం మనకు తెలిసిందే! పుస్తకం పెదవి విప్పకుండా మౌనంగానే పుటలకొద్దీ విలువైన సమాచారాన్ని బోధిస్తుంది.

అయితే... మాట్లాడటం ఒక అందమైన కళ. మౌనం అంతకన్న అద్భుతమైన కళ అని గాంధీ మహాత్ముడంటే, మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చునని స్వామి వివేకానంద బోధించారు. ఎందుకంటే మనస్సుని భౌతిక ప్రపంచం వైపు వెళ్లకుండా పరమాత్మలో లీనం చేసేదే నిజమైన మౌనం. మౌనం వల్ల అజ్ఞానం నశిస్తుంది. అంతఃకరణ శుద్ధి అవుతుంది. ధనాత్మక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యోగా తరగతులు బోధించేటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఒనగూరే లాభాలను కూడా తప్పనిసరిగా చెబుతారు.

ప్రకృతిని గమనిస్తే వృక్షాలు, పశు, పక్షి, జంతుజాలాదులన్నీ మౌనంగానే పుడతాయి, పెరుగుతాయి, ఫలదీకరణ చెందుతాయి. లోకాలను చుట్టి వచ్చే ఆదిత్యుడు, తారాచంద్రులు మౌనంగానే సంచరిస్తూ, మౌనంగానే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఆత్మదర్శనానికి మౌనదీక్ష తప్పనిసరి! అలాగని అన్ని వేళల్లోనూ మౌనాన్నే ఆశ్రయించడం సరికాదు. ముఖ్యంగా నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించరాదు.

నేరనిర్థారణ  సందర్భాల్లో  నేరస్థుడు మౌనం వహిస్తే నేరం  అంగీకరించిన  భావం వస్తుంది.

మరిన్ని వార్తలు