జీవగడియారం గుట్టు తెలిపే రక్తపరీక్ష

11 Sep, 2018 12:57 IST|Sakshi

లండన్‌ : మనం ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను ఎప్పటికప్పుడు నిర్ధేశించే జీవగడియారం ఆనుపానులు తెలిసే ఆవిష్కరణకు బీజం పడింది. శరీరం లోపలి గడియారాన్ని 90 నిమిషాల్లో కొలిచే సులువైన రక్తపరీక్షను రూపొందించామని నార్త్‌వెస్ర్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. భవిష్యత్తులో వ్యక్తుల వారీగా వైద్య చికిత్సలు అందించేందుకు ఇది దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని సమస్త కణాలను నిర్ధేశించే సర్కాడియన్‌ రిథం ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలకు కేంద్రంగా మారింది. 

మనం నిద్రించే సమయంలో, ఆకలి వేసే సమయంలో, వ్యాది నిరోధక వ్యవస్ధ చురుకుగా ఉన్నప్పుడు, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు..ఇలా మన శరీరంలో అన్ని జీవ ప్రక్రియల్లోనూ జీవగడియారం శరీర విధులను నియంత్రిస్తుందని నార్త్‌వెస్ర్టన్‌ యూనివర్సిటీ బయోస్టాటిస్టిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రోస్‌మేరీ బ్రాన్‌ పేర్కొన్నారు.

జీవగడియారం శరీర విధులను సరిగ్గా నియంత్రించలేని సమయంలో అల్జీమర్స్‌, గుండెసమస్యలు, మధుమేహం వంటి వ్యాధులకు దీనితో నేరుగా సంబంధం ఉందని గుర్తించామన్నారు. ఈ అథ్యయనం కోసం తాము 73 మంది నుంచి 1100 రక్తనమూనాలను సేకరించామని, ప్రతి రెండు గంటలకు శాంపిల్స్‌ తీసుకుని రోజు మొత్తంలో జన్యువుల కదలికల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది పరిశీలించామని పరిశోధకులు తెలిపారు. ఈ రక్తపరీక్షలో వ్యక్తి శరీర గడియారం రోజులో సమయాన్ని కచ్చితంగా నిర్ధారించగలిగామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు