ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!

21 Sep, 2014 01:01 IST|Sakshi

సింగీతం శ్రీనివాసరావు...
 మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్!
 క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్‌పరిమెంట్లూ... యానిమేషన్లూ...
 ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు.
 సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం!
 నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు
 స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!!

 
నా కెరీర్‌లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే.
 కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా...


సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’...

ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్‌స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్‌లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి.    
 
రాజ్‌కపూర్‌కైతే విపరీతంగా నచ్చేసింది!
 
సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్‌లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్‌లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్‌లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్‌లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్‌బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల.  హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్‌కపూర్‌కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్‌ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు.
 
మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం...
 
‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్‌పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం.
 
ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్‌ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్‌ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్‌లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్‌లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం.  ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్‌లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది.
 
విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు!
 
టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్‌లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది.
 
‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా!
 
కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్‌లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
 
- పులగం చిన్నారాయణ
 

మరిన్ని వార్తలు