ఇప్పుడే కాదు...భవిష్యత్తులోనూ చేయను!

9 Feb, 2014 23:09 IST|Sakshi

సునీత... అందంగా ఉంటారు!
 అందంగా పాడతారు... అందంగా డబ్బింగ్ చెబుతారు!
 ఇవన్నీ పాత విషయాలే... మరి కొత్త సంగతి ఏంటంటే...
 సునీత ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు! శేఖర్ కమ్ముల తీస్తున్న ‘అనామిక’ కోసం ఆమె మేకప్ వేసుకున్నారు...

 
 కంగ్రాట్స్... ఆర్టిస్ట్‌గా కొత్త అవతారం ఎత్తారుగా!
 సునీత: ఆగండాగండి. నేను జస్ట్ ‘అనామిక’ ప్రమోషనల్ సాంగ్‌లో యాక్ట్ చేశానంతే. క్యారెక్టర్ చేయలేదు!
     
 సాంగ్‌లో కనబడడం కూడా యాక్టింగే కదా?
 సునీత: కరెక్టే కానీ, ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్.
     
 ఈ సాంగ్ మీతో చేయాలన్న ఆలోచన శేఖర్‌దేనా?
 సునీత: అవును... ఆయనదే. ‘అనామిక’ కోసం కీరవాణి స్వరసారథ్యంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ‘ఎవ్వరితో చెప్పను... ఎక్కడని వెతకను’ పాట పాడాను. ఈ పాటనే వీడియోగా షూట్ చేస్తామని శేఖర్ నన్ను అడిగారు. వినూత్నమైన ఆలోచన కాబట్టి, వెంటనే అంగీకరించాను. ఇలాంటి మ్యూజిక్ వీడియోల ట్రెండ్ బాలీవుడ్‌లో ఎక్కువ. ఆయా సినిమాల ప్రచారానికి ఈ మ్యూజిక్ వీడియోలను అక్కడ బాగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది.
     
 సరే... ఇంతకూ ఫస్ట్ డే షూటింగ్ ఎలా అనిపించింది?
 సునీత: కొంచెం నెర్వస్‌గానే అనిపించింది. బుల్లితెరపై అనేక మ్యూజిక్ షోస్ చేశాను. కానీ, సినిమా షూటింగ్ దానికి పూర్తి భిన్నం కదా! కెమెరాను చూస్తూ నటించగలగడం ఓ కొత్త అనుభవం. ఈ పాట కోసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. ఎలా కనిపిస్తానా అని కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఫెంటాస్టిక్‌గా యాక్ట్ చేశానని చెప్పను కానీ, ఏదో చేసేశానులెండి.
 
 ఓసారి ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. అప్పట్లో ఎవరూ మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని అడగలేదా?
 సునీత: ఎస్వీ కృష్ణారెడ్డిగారు ఫస్ట్ అడిగారు. ఏ సినిమాకనేది తెలీదు. తర్వాత రామ్‌గోపాల్‌వర్మ కూడా అడిగారు. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. హీరోయిన్ అనేకాదు. స్పెషల్ క్యారెక్టర్లూ చేయమని అడిగారు.
 
 మరి ఎందుకు చేయలేదు?
 సునీత: నాకు పాడటమే ఇష్టం. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం ఇష్టం. నాకు మానసిక సంతృప్తినిచ్చే ఈ రెండూ వదిలేసి, ఆర్టిస్ట్‌గా వెళ్లాలని ఏనాడూ అనుకోలేదు. కలలో కూడా ఆలోచించలేదు. మంచి యాక్టింగ్ ఆఫర్స్ వదిలేసుకున్నానని ఏనాడూ చింతించలేదు కూడా.
 
 యాక్ట్ చేస్తూ కూడా పాటలు పాడొచ్చుగా?
 సునీత: సినిమా పుట్టిన కొత్తల్లో ఆ ప్రక్రియే నడిచేది. ఈ ట్రెండ్‌లో అలా కష్టం. యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా పాడతానంటే ఎవరూ ఒప్పుకోరేమో! అయినా నటించాలనే ఆలోచనే లేనప్పుడు ఇదంతా ఎందుకు ఆలోచిస్తాను.
     
 భవిష్యత్తులో కూడా యాక్ట్ చేయరా?
 సునీత: ఏమోనండీ... ఇప్పుడే ఏం చెప్పగలం. అసలు మ్యూజిక్ వీడియోలో నటిస్తాననే అనుకోలేదు కదా. నా కెరీర్ మొదలై 18 ఏళ్లయింది. ఇప్పటికి 3000 పాటలు పాడాను,750 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను చాలా చాలా హ్యాపీ.
     
 సంగీత దర్శకత్వం చేస్తారా?
 సునీత: అస్సలు చేయను. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా చేయను.
     
 మీ లక్ష్యం?
 సునీత: మొదటి నుంచీ నా గోల్ ఒకటే, జాతీయ అవార్డు అందుకోవాలి. అలాగే అన్ని భాషల్లోనూ పాటలు పాడాలని ఉంది. ఇప్పటికి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనే పాడాను. ఇక్కడ బిజీ కారణంగా మిగతా భాషలవైపు దృష్టి సారించలేకపోతున్నాను. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
 

మరిన్ని వార్తలు