సింగిల్ లెగ్ సాకులు

12 Sep, 2015 23:19 IST|Sakshi
సింగిల్ లెగ్ సాకులు

సోల్ / సాకులు
 
లోకులు పలు కాకులని పెద్దలు అన్నారు గానీ, లోకంలో పలు సాకులు ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. అయినా నష్టమేమీ లేదు. చాకులాంటి తెలివైన మహానుభావులు కొందరు ఈ రహస్య సత్యాన్ని గుర్తించారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి... ఎస్కేపై తిరుగువాడు ఎక్స్‌పర్ట్ సుమతీ అనే నీతిశతకంలోని అంతరార్థం ఇదేనని వారు గ్రహించారు. ఆత్మరక్షణ కోసం కొన్ని, అవసరార్థం ఇంకొన్ని, అనవసరాల నుంచి తప్పించుకోవడం కోసం మరికొన్ని... టోకున సాకులు చెప్పే విద్యలో ఆరితేరిన వీరులుగా, అసహాయ శూరులుగా... మొత్తానికి ఈ పాడు లోకంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూ వస్తున్నారు. ఇలాంటి పెద్దమనుషుల్లో కొందరు రాజకీయాల్లో సహజంగానే రాణిస్తున్నారు. లోకంలో ముక్కుసూటిగా పోయే అసమర్థులు, అప్రయోజకులు తప్ప వేరెవరూ సాకుల కోసం వెదుక్కోరనేది జగమెరిగిన లౌక్యసిద్ధాంతుల నిశ్చితాభిప్రాయం. అయితే, కొందరు అమాయకులు ఈ అభిప్రాయంతో విభేదిస్తారు. సాకులు చెప్పడాన్ని అవలక్షణంగా పరిగణిస్తారు. అయినదానికీ కానిదానికీ చెప్పే సాకులను ‘కుంటి’సాకులుగానూ అభివర్ణించి, తమ అక్కసును వెళ్లగక్కుతారు.
 
సాకులు సాహిత్యావలోకనం
తెలుగు సాహిత్యంలో సాకులు చెప్పే పాత్రలు చాలానే ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడి వంటి వికటకవి కూడా రాయలవారి సమక్షంలో అడపాదడపా సాకులు చెప్పి, వినోదాన్ని పంచిన దాఖలాలూ ఉన్నాయి. అయితే, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో పడితే వారితో ఎడాపెడా టోకున సాకులు చెప్పడంలో ‘కన్యాశుల్కం’లోని గిరీశాన్ని మించిన జాదూగాడు తెలుగు సాహిత్యంలోనే లేడు. పరీక్ష తప్పి ముఖం వేలాడేసుకు వచ్చిన తన ప్రియశిష్యుడు వెంకటేశం మీదే సాకులు సంధిస్తాడు. ‘మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టలు కాల్చడం ఒక్కటే. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ, ఒక మారయినా, ఒక ముక్క చెప్పిన పాపాన పోయినారూ?’ అని వెంకటేశం నిష్టూరమాడితే, గిరీశం తడుముకోకుండా సాకులు చెబుతాడు. ‘ఇలాటి మాటంటే నాకు కోపం వొస్తుంది. ఇది బేస్ ఇన్‌గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్... ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ?... మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్! చుట్ట నేర్పినందుకు థాంకు చెయ్యక, తప్పుపట్టుతున్నావ్? చుట్టకాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్పవాళ్లయినారు. చుట్టకాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదే స్టీముయంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు...’ అంటూ ఏకబిగిన చుట్ట మహిమ గురించి సాకులు చెప్పుకొస్తాడు.
 వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధాన్లు వంటి అపరదుర్వాసుడిని సైతం ఇలాంటి సాకులతోనే బుట్టలో పడేసుకుంటాడు.
 
వినేవాళ్లకు  చీకాకులు

వినేవాళ్లను వెర్రిమాలోకాలుగా ఎంచే ధీమంతులే అలవోకగా సాకులు చెప్పగలరు. మొదట్లో హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లలు టీచర్లకు సాకులు చెప్పడం మొదలుపెడతారు. మొదట్లో వాళ్లు కాస్త భయంభయంగా సాకులు చెబుతారు. రాత్రి జ్వరం వచ్చిందనో, కడుపు నొప్పిగా ఉందనో పిల్లలు అమాయకపు మొహాలతో చెప్పే సాకులు వినే టీచర్లు కాస్త మానవత్వంతో ఆలోచించి, పోన్లే పాపం అని క్షమించేస్తారు. ఒకటికి రెండుసార్లు ఇలా జరగొచ్చు. పదే పదే పిల్లలు చెప్పే సాకులు వింటుంటే ఎంతటి సహనవంతులైన టీచర్లకైనా కోపం వేసవితాపంలా పెరుగుతుంది. అలాంటప్పుడు వారు దండోపాయాన్నే తరుణోపాయంగా ఎంచుకుంటారు. మొండిఘటాలైన పిల్లలు టీచర్ల దండనను కూడా తప్పించుకునే తరుణోపాయాలను తక్షణమే ఆలోచించగలరు. మొదట్లో తేలికపాటి సాకులు చెప్పేవారు కాస్తా దెబ్బలు తప్పవనే పరిస్థితి ఎదురైనప్పుడు మరింత పెద్దపెద్ద సాకులు చెప్పి, ఆ ఆపదనూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. స్కూళ్లలో సాకులు చెప్పే పిల్లలు కాలేజీకి చేరేలోగానే చాలా ఢక్కామొక్కీలు తిని ఉంటారు. సాకులు చెప్పే విద్యలోనూ కొంచెం రాటుదేలి ఉంటారు. కాలేజీ నుంచి బయటపడి ఉద్యోగపర్వంలో కాలుపెట్టే నాటికి పూర్తిగా ఆరితేరిన సాకువీరులుగా తయారవుతారు. పని ఎగ్గొట్టడానికి ఆఫీసుల్లో బాసులకు సాకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ పురోగతి అక్కడితోనే ఆగిపోదు. ఎదుటివాళ్ల బలహీనతలను పసిగట్టి, వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెప్పడంలో నిరంతర సాధన కొనసాగుతూనే ఉంటుంది. పెళ్లిళ్లయి కుటుంబరావులుగా మారిన తర్వాత కూడా బలాదూర్ మందుపార్టీల్లో మునిగితేలి, ఆలస్యంగా కొంపలకు చేరినప్పుడు ఇల్లాళ్లకూ రకరకాల సాకులు చెబుతారు. సాకువీరుల్లోనూ కొందరు మరీ ముదుర్లుంటారు. అదృష్టం బాగుంటే ఇలాంటి వాళ్లు రాజకీయ పార్టీల్లో సలహాదారులుగా సెటిలైపోతారు.
 
ఎవరు   చెబుతారంటే..?
జీవితాన్ని కులాసాగా ధిలాసాగా చీకూచింతా లేకుండా నిష్పూచీగా గడిపేయాలనుకునే నిక్షేపరాయుళ్లే ఎక్కువగా సాకులు చెబుతారట! కించిత్ కష్టమైనా వీరి ఒంటికి పడదు. ఇష్టంలేని పనులను తప్పించుకోవాలనుకునే వాళ్లు కూడా సాకులు చెబుతారట! అయిష్టమైన పనులు అనివార్యమైతే ఎటూ తప్పదు. ఈలోగా వాటిని సాధ్యమైనంత నివారించుకునేందుకు శాయశక్తులా చేసే ప్రయత్నంలో భాగంగానే చాలామంది సాకులు చెబుతారట! కొద్ది మంది అమాయకులను మినహాయిస్తే మనుషులందరిలోనూ కొద్దో గొప్పో సుఖాలకు దగ్గరగా, కష్టాలకు దూరంగా ఉండాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏ మేరకు బలంగా ఉంటే, ఆ మేరకు సాకులు చెప్పడంలో ప్రావీణ్యం అబ్బుతుంది. ఇవన్నీ ఏ కాలజ్ఞానం చెప్పిన విశేషాలో కావు, ఆధునిక మానసిక శాస్త్రం చెబుతున్న కారణాలు.
 

మరిన్ని వార్తలు