వేసవిలోనూ సైనసైటిస్ సమస్య..!

6 May, 2016 00:13 IST|Sakshi
వేసవిలోనూ సైనసైటిస్ సమస్య..!

కిడ్నీ కౌన్సెలింగ్

 నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగరీత్యా చాలా దూర ప్రయాణాలు చేస్తుంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. అలాగే మూత్రం నురగగా వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సమస్యపై ఏ డాక్టర్‌నూ కలవలేదు. దయచేసి నా అనుమానాలను నివృత్తి చేయండి. - గోపాల్, హైదరాబాద్

 మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు.

వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చేస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి.

మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది.

న్యూరో కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నేను గత మూడు నెలలుగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. పదిరోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. ఎటూ కదలలేకుండా అవుతోంది. నడుము నుంచి పాదాల వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. మూడు రోజులుగా మూత్రం కూడా ఆగి, ఆగి వస్తోంది. ఎమ్మారై స్కానింగ్ చేయించాను. కొంతమంది సర్జరీ అవసరమని, మరి కొంతమంది వద్దంటున్నారు. సర్జరీ చేయించుకుంటే కాలు పడిపోవచ్చని మా కొలీగ్స్ భయపడుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు.  - నరేంద్రనాథ్, రాజమండ్రి

 మీరు ఎల్5 /ఎస్ 1 ర్యాడికులోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నొప్పి మాత్రమే ఉన్నవారిలో, నముడుకు బెల్ట్ వేసుకోవడం, మందులు తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడంతో ఈ సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. దాదాపు 80 శాతం మందిలో ఇలా తగ్గించడం సాధ్యమవుతుంది. మిగతా వారిలో సర్జరీ అవసరం పడవచ్చు. కాళ్లకి సంబంధించిన నరాలు, మలవిసర్జన, మూత్ర విసర్జనకు అవసరమైన నరాలు అన్నీ నడుము నుంచే కిందికి వెళ్తాయి.

అయితే నడుము ఎముకలు అరిగినప్పుడు డిస్క్‌లు జారి, నరాలు ఒత్తుకోవడం వల్ల నడుము నొప్పి, తిమ్మిర్లు, మూత్రంలో ఇబ్బంది రావచ్చు. ఒక్కోసారి కాళ్లలో బలం తగ్గిపోయినా, మూత్రవిసర్జనలో ఇబ్బంది ఎదురైనా  వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. సమయం గడుస్తున్నకొద్దీ పరిస్థితి మరింత జటిలం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇప్పుడు మైక్రోస్కోప్ ద్వారా కేవలం గంట కంటే తక్కువ సమయంలోనే సర్జరీ చేయించుకోవచ్చు. మూడు రోజులలో నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. అయితే అన్ని వసతులు, వైద్య సౌకర్యాలు ఉన్న హాస్పిటల్‌లోనూ, నిపుణులు, అనుభవజ్ఞులైన న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు.

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో కూలర్ వాడుతున్నాం. శీతల పానియాలూ ఎక్కువగానే తాగాను. దాంతో జలుబు వచ్చింది. తల అంతా భారంగా ఉంది. ఎంతకీ తగ్గడం లేదు. హోమియోలో చికిత్స ఉందా? - సురేశ్‌కుమార్, ఖమ్మం

 కొన్ని రకాల వ్యాధులు సాధారణంగా కొన్ని కాలాలలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో సైనసైటిస్ ఒకటి. గతంలో వానాకాలం, చలికాలంలో ఉద్ధృతమయ్యే ఈ సమస్య కొందరిలో వేసవిలోనూ కనిపిస్తోంది. ఇందుకు వాతావరణంతో పాటు జీవనశైలిలోని మార్పులూ కారణమవుతున్నాయి.

 మన తలలో ముక్కు పక్కన, నుదుటి దగ్గర ఉండే నాలుగు జతల గదులను ై‘సెనస్’లు అంటారు. ముఖంలోని గాలి గదుల్లో వచ్చే వాపునే వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లలో ‘అక్యూట్ సైనసైటిస్’, ‘క్రానిక్ సైనసైటిస్’ అనే రెండు రకాలు ఉంటాయి. రెండో రకంలో సమస్య దీర్ఘకాలంపాటు ఉంటుంది.  సాధారణంగా ఎవరికైనా జలుబు చేసినప్పుడు మందులు వాడి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు జలుబు మందులతో తగ్గిపోవచ్చు లేదా తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టవచ్చు. ఇలా పదే పదే జలుబు వేధిస్తుంటే సైనసైటిస్ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం వేసవిలో కూడా సైనసైటిస్ ఎక్కువగానే బాధిస్తున్న కేసులు వస్తున్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ వంటి అంశాలతో ఇది వేసవి సీజన్‌లోనూ కనిపిస్తోంది.

 వేసవిలో సైనసైటిస్‌కు కారణాలు : అలర్జిక్ తత్వం ఉన్నవారు వేసవిలో కూల్‌డ్రింక్స్, చల్లటి ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్‌కు గురయ్యే అవకాశం ఉంది.

  వేసవిలో వర్షాలు కురిసినప్పుడు ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకునే విపరీతమైన మార్పుల వల్ల కూడా సైనస్‌లు ప్రభావితమవుతాయి  వేసవి సీజన్‌లో ఈతకొలనులలో ఎక్కువసేపు గడపడం  జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో (సినిమా థియేటర్లు, కళ్యాణమండపాలు) ఎక్కువగా గడపడం కూడా సైనసైటిస్ వ్యాప్తికి కారణమే  వేసవిలో ఎయిర్‌కూలర్స్ వాడటం, వాటిలోని నీళ్లను మార్చకపోవడం, నిల్వ నీటినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. అలాగే కూలర్స్‌లోని మ్యాట్స్‌లో ఉండే ఫంగస్ చేరి ఫంగల్ సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

 లక్షణాలు : కనురెప్పల వాపు  వాసనలు తెలియకపోవడం  తరచూ వచ్చే జ్వరం  తలనొప్పి  ముక్కుదిబ్బడ  చిక్కటి పసుపుపచ్చ / ఆకుపచ్చ రంగులో ముక్కుస్రావాలు  నోటి దుర్వాసన

 వ్యాధి నిర్ధారణ :  సైనస్ ఎండోస్కోపీ, నోటి పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, ఎక్స్-రే, సీటీ స్కాన్, సైనస్ కల్చర్ వంటి పరీక్షలు సమస్య నిర్ధారణకు తోడ్పడతాయి.

 చికిత్స : సైనసైటిస్‌కు హోమియోలో అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉంది. మందుల ద్వారా నివారణ మాత్రమే గాక... వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా చేయవచ్చు. సైనసైటిస్‌కు హోమియోలో కాలి సల్ఫ్, హెపార్ సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్యునేరియా, లెమ్నా మైనర్, స్పైజీలియా వంటి మందులు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

>
మరిన్ని వార్తలు