యుద్ధ చరిత్రలో చివరి విలుకాడు

18 Oct, 2015 03:22 IST|Sakshi
యుద్ధ చరిత్రలో చివరి విలుకాడు

పీఛేముడ్
రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరఫున జాన్ మాల్కమ్ థోర్పే ఫ్లెమింగ్ జాక్ చర్చిల్ అనే అధికారి లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసేవాడు. ఆ కాలానికి మెషిన్‌గన్లు, రివాల్వర్లు వంటి అధునాతన ఆయుధాలెన్నో అందుబాటులోకి వచ్చినా, ఇతగాడు మాత్రం సంప్రదాయబద్ధమైన స్కాటిష్ ఖడ్గాన్ని, విల్లంబులను ధరించి రణరంగంలో పోరాడేవాడు. ఆధునిక యుద్ధ చరిత్రలో చిట్టచివరి విలుకాడు ఇతడే. ధనుర్విద్యలో ఇతగాడికి అపార నైపుణ్యం ఉండేది. అంతే స్థాయిలో తలతిక్కా ఉండేది.

తన ఎదుటికి వచ్చే సైనికులు ఖడ్గాన్ని ధరించకుంటే, అగ్గిరాముడయ్యేవాడు. అప్పటికప్పుడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాడు. శత్రుబలగాలు తుపాకుల మోత మోగిస్తున్నా, విల్లంబులు ధరించి, రణరంగానికేగిన ఈ వెర్రి సేనాని, జర్మనీలోని నాజీ బలగాలకు చిక్కాడు. ఇతగాడి ఇంటిపేరు చర్చిల్ కావడంతో బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌కు చుట్టం కావచ్చనే భ్రమలో తొలుత నాజీ నేతలు ఇతగాడిని చంపే ఆలోచనను విరమించుకున్నారు.

విన్‌స్టన్ చర్చిల్‌తో ఇతగాడికి ఎలాంటి బంధుత్వం లేదని తేలిన మరుక్షణమే హిట్లర్ ఇతగాడిని చంపేయాలంటూ హుకుం జారీ చేశాడు. అయితే, ఆ ఆదేశాన్ని నాజీ కెప్టెన్ హాన్స్ థార్నర్ అమలు చేయకపోవడంతో జాక్ చర్చిల్ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.

మరిన్ని వార్తలు