షీరోస్ కేఫ్ పక్కన తాజ్‌మహల్

12 Sep, 2015 00:06 IST|Sakshi
షీరోస్ కేఫ్ పక్కన తాజ్‌మహల్

తాజ్‌మహల్ యాసిడ్ రెయిన్ పొల్యూషన్‌కి
 గురవుతోందని దేశం ఆందోళన చెందుతోంది.
 మరి... మన చెల్లెళ్ల మీద పడ్డ యాసిడ్‌ని ఎలా కడిగేయాలి?
 కన్నీటితో చెంపలు కడుక్కోవచ్చునేమో...
 బాధనూ కొద్దిగా కడిగేయొచ్చేమో! కానీ యాసిడ్‌ను... ఎలా?
 బాధ వల్ల కన్నీళ్లు వస్తాయని మనం నమ్ముతాము.
 చాలా సందర్భాల్లో అది నిజం కాదు.
 కన్నీళ్లు సెల్ఫ్‌పిటీ నుంచే ఎక్కువగా వస్తాయి.
 మనపై మనకు జాలి పెరిగితే కన్నీళ్లు పెరుగుతాయి.
 ఈ బంగారు తల్లులకు జాలి నుంచి పుట్టే కన్నీరు అవసరం లేదు.
 ఈ సమాజం జాలి అంతకంటే అవసరం లేదు.
 మనోైధె ర్యం, ఆత్మవిశ్వాసం, సేవాతత్వాన్ని నూరి
 ఒక బ్యూటీ సోపును తయారు చేసుకున్నారు.
 ఈ సబ్బు చర్మసౌందర్యాన్ని దాటి ఆత్మసౌందర్యాన్ని ఉట్టిపడేలా చేస్తుంది.
 బికాజ్.. బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్.
 వీళ్లు నడిపే ‘షీరో కెఫే’ ప్రపంచానికి ఒక కొత్త వండర్.
 చూస్తూ ఉండండి... కొద్ది రోజుల్లో ఎక్కడున్నదని
 పర్యాటకులు అడిగితే... ‘షీరో కెఫే’ పక్కనుంది
 అని చెప్పుకునేంతగా ప్రసిద్ధి పొందుతుంది.
 దీనికి మీరే సాక్షి.

 
 
 మండిన హృదయాలను సేదతీర్చే వేదిక...

 స్టాప్ యాసిడ్ అటాక్ నెట్‌వర్క్‌తో కలిసి ఎన్జీవో చాన్వ్ ఈ కేఫ్‌ను  నెలకొల్పారు.  దాతల సహకారంతో దీనికి నిధులు సేకరించారు. యాసిడ్ దాడుల నుంచి కోలుకున్నవారి ధైర్యానికి సెల్యూట్ చేస్తూ రూపొందిన సూపర్‌హిట్ ప్లే పేరుతో ‘కేఫ్ షీరోస్ హ్యాంగౌట్’ గా ఏర్పాటైన ఈ ఔట్‌లెట్ విభిన్న కార్యక్రమాలకు కేంద్రం కూడా. ఈ కేఫ్‌కు దగ్గర్లోనే  21ఏళ్ల రూపా అనే యాసిడ్ దాడి బాధితురాలు రూపొందించిన డిజైనర్ వేర్ దుస్తుల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయి.  ఇక్కడ ఎన్జీవో కార్యకలపాల సమీక్ష కోసం వారం వారం, నెలవారీ సమావేశాలు నిర్వహించే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
 
చిన్న మచ్చ పడితేనే అద్దంలో చూసుకున్నప్పుడల్లా, ఎవరైనా ఏమిటని అడిగినప్పుడల్లా... చిన్న బుచ్చుకుంటాం. క్రీముల నుంచి సర్జరీల దాకా రకరకాల పరిష్కారాల గురించి ఆలోచన చేస్తుంటాం. అలాంటిది తమ తప్పేమీ లేకుండానే తనువంతా బొబ్బలతో, ముడుతలతో, మచ్చలతో నిండిపోతే... అద్దాన్ని చూసి కూడా భయపడేంతగా, తమని తాము గుర్తు పట్టలేనంతగా ... చూసినవాళ్లు చూపు
తిప్పుకునేంతగా  మారిపోతే ఆపై భవిష్యత్తు ఏమిటి? జీవితం ఏమిటి?
 
ఈ యాసిడ్ దాడి బాధితులు తమలో నుంచి నిన్నను తీసేస్తూ రేపును నిర్మించుకునే క్రమంలోనే అవతరించిందీ రెస్టారెంట్. అక్కడ తింటే కడుపు నిండుతుంది. అక్కడ కలిసిన కథలు వింటే అద్భుతమైన స్ఫూర్తి అణువణువూ నిండుతుంది.
 
కేఫ్ విత్ కేర్...

ఆగ్రాలోని ఫతేబాద్ రోడ్‌లోని తాజ్‌మహల్ గేట్‌వే ఎదురుగా ఉన్న ఆ కేఫ్‌లోకి  ఎంటరవ్వగానే... మహిళా సాధికారితకు సంబంధించిన గ్రాఫిటీ, పెయింటింగ్స్ గోడల మీద  ఫెమినిజం గురించిన పుస్తకాలు అక్కడి రీడింగ్ రూమ్‌లో మనకు దర్శనమిస్తాయి.. అక్కడి టీవీలో మహిళా సాధికారితకు సంబంధించిన డాక్యుమెంట్రీలు, ఫిల్మ్‌లు ప్రసారం అవుతుంటాయి. చూడడానికి అది రెస్టారెంట్ అనేది  నిజమే. అయితే దీన్ని ఏర్పాటు చేసింది ఏవో కొన్ని రూపాయలు కళ్ల చూడడం కోసం కాదు కొన్ని విధి వంచిత జీవితాలలో వెలుగులు చూడడం కోసం.

 రుచులెన్నో... వ్యథలన్ని...
 ఈ రెస్టారెంట్ రుచులను వడ్డించి ఊరుకోదు. యాసిడ్ దాడి వ్యథలను కళ్లకు కడుతుంది.  ‘‘నా ముఖాన్ని తాకిన ద్రవం చర్మాన్ని మండిస్తుంటే ఏదో ఆయిల్ అనుకున్నాను. కాని అది జారినంత మేరా చర్మం కూడా కరిగిపోతుంటే అర్థమైంది అది యాసిడ్ అని’’ అని గుర్తు చేసుకుంటుంది రీతూ. హర్యానాలోని మారుమూల గ్రామంలో రీతూపై ఆమె కజిన్ యాసిడ్ పోశాడు. అతనితో అనైతిక సంబంధానికి తిరస్కరించడమే అతనికి తప్పుగా తోచింది. ఈ సంఘటన రీతూ శరీరాన్నే కాదు, మనసుని కూడా కాల్చేసి ఆమెకు ఒక కన్నును దూరం చేసింది. అయినా ఆమె నిబ్బరం కోల్పోలేదు. తనలోని నిరాశను కాల్చేయాలనుకుంది. ఇప్పుడామె ఆ రెస్టారెంట్లో ఫ్లోర్ మేనేజర్. ‘‘నా ముఖాన్ని కప్పుకుని తిరిగేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని తిరగుతున్నాను. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు అంతేకాదు నేనెవరి మీదా ఆధారపడిలేను’’అంటూ సంతోషంగా చెబుతుంది రీతూ.  రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లను హాయ్ వెల్‌కమ్ అంటూ నవ్వుతూ విష్ చేసే నీతూ మాధుర్‌పై యాసిడ్ దాడి చేసింది కన్న తండ్రే. కారణం ఏదైనా ఆ దాడిలో ఆమె ముఖం కళ్లు కాలిపోయాయి. తల్లి సైతం గాయపడింది. ఇప్పుడు తల్లితో సహా నీతూ అదే రెస్టారెంట్లో విధులు నిర్వర్తిస్తోంది.

 కుప్పకూలిన కలలను తిరిగి నిర్మించుకునే దారిలో...
 అయినవాడో, కానివాడో ఎవడో మృగం... ఒక్క ‘చేత్తో’ జీవితాన్ని చిందరవందర చేశాడు. కలలను కుప్పకూల్చాడు. అయితేనేం వీరు ఆగిపోలేదు. తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ఏ అవకాశాన్నీ వదల్లేదు.  ఈ కేఫ్ ఒక్కటే కాదు... గత కొంతకాలంగా ఈ యాసిడ్ బాధితులు ప్రపంచానికి తమ ధీరత్వాన్ని చవిచూపుతూనే ఉన్నారు. లక్ష్మి, రూప, చంచల్, రీతూ, సోనమ్‌లు డిజైనర్ దుస్తులు ధరించి ఫొటో షూట్ నిర్వహించారు. రూప డిజైన్ చేసిన దుస్తులతో ర్యాంప్ వాక్ కూడా చేశారు. తమ జీవితాలపై ఒక డాక్యుమెంటరీని రూపొందించడానికి ఫొటోగ్రాఫర్ రాహుల్‌తో కలిసి కృషి చేస్తున్నారు. ఢిల్లీ, కాన్పూర్, లూధియానాలలో సైతం కేఫ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని తర్వాత వీరి లక్ష్యం ఏమిటంటే... కమ్యూనిటీ రేడియో. దీనిలో వీరంతా ఆర్జేలు కానున్నారు. ‘‘ప్రస్తుతం ఆధారపడుతున్న డొనేషన్ పద్ధతిని ఎక్కువ కాలం కొనసాగించకూడదని మేం అనుకుంటున్నాం. వీరి రోజువారీ జీవనం కోసం కేఫ్స్, బొటిక్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. వీరు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకూ సహకరించాలనేదే మా లక్ష్యం’’ అంటున్నారు ఎన్జీవోకి చెందిన ఆశిష్ శుక్లా.

 నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి మించిన అందం ఏముంది? ఈ కేఫ్‌కి వెళితే మనకు కనిపించేది, ఎందరినో కదిలించేది అదే. ఒక సమాధిపై కట్టిన అపురూప కట్టడానికి చేరువలోనే... సమాధిలాంటి జీవితంలో నుంచి తిరిగి జన్మనెత్తిన వారు కట్టిన కేఫ్ చెరిగిపోని ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. జీవితంపై మనిషికి ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఆగ్రా వెళితే తాజ్‌మహల్‌ని చూస్తే ఒక భర్త తన భార్యను ఎంత గొప్పగా ప్రేమించగలడో తెలుస్తుంది. ఈ కేఫ్‌ని చూస్తే ఒక మనిషి తన జీవితంపై కోల్పోకూడని ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది.
 - ఎస్.సత్యబాబు
 

మరిన్ని వార్తలు