పదహారు కళల పురుషుడు!

28 May, 2016 23:39 IST|Sakshi
పదహారు కళల పురుషుడు!

  ప్రశ్నోపనిషత్
పిప్పలాద మహర్షికి శుశ్రూష చేసి ఆయన అనుగ్రహంతో బ్రహ్మజ్ఞానాన్ని క్రమంగా, సమగ్రంగా, త్రికరణ శుద్ధితో తెలుసుకోవాలని భక్తిశ్రద్ధలతో వచ్చిన ఆరుగురు ఋషులలో చివరివాడు భరద్వాజ గోత్రుడైన సుకేశుడు అడగబోయే ప్రశ్న వింతగా, విచిత్రంగా కనిపిస్తుంది. కాని మొదటి ప్రశ్న నుండి ఆరవ ప్రశ్నలో ఒక క్రమవికాసం గోచరిస్తుంది. ప్రాణిపుట్టుక ఎలా జరిగింది? జీవులను ఎందరు దేవతలు పోషిస్తున్నారు? శరీరంలోకి ప్రాణం ఎలా వస్తోంది? ఎలా పోతోంది? మెలకువ, నిద్ర, కలలు, గాఢనిద్ర ఇవన్నీ అనుభవించేది ఎవరు? ఓంకార ధ్యానక్రమం, ప్రయోజనాలు..?

పదహారు అంగాలతో ఉండే పురుషుడు ఎవరు? అనే ప్రశ్నల సమాధానాలలో నిరాకార పరబ్రహ్మం సాకారత ఎనభై నాలుగు లక్షల జీవరాశిగా గోచరించటం, బ్రహ్మపదార్థపు రాకపోకలు, నిద్ర, స్వప్నాది అవస్థలను అనుకరిస్తూ ధ్యానమార్గంలో తానే నిరాకార పరబ్రహ్మమనే జ్ఞానాన్ని, అద్వైత స్థితిని పొందటంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

 భరద్వాజ గోత్రుడైన సుకేశుడు పిప్పలాద మహర్షికి నమస్కరించాడు. దేవర్షీ! ఒకప్పుడు కోసలదేశపు యువరాజు హిర ణ్యనాభుడు నా దగ్గరకు వచ్చాడు. సుకేశా! పదహారు కళలతో ఉండే పురుషుడు ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు. యువరాజా! అతను ఎవరో నాకు తెలియదు. తెలిస్తే ఎందుకు చెప్పను? తెలియకుండా అబద్ధం చెప్పేవాడు సమూలంగా నశించిపోతాడు. కనుక నేను అబద్ధం చెప్పను అన్నాను. యువరాజు మౌనంగా రథమెక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పదహారు కళలతో ఉన్న పురుషుడు ఎవరు?

 అప్పుడు పిప్పలాద మహర్షి ఇలా అన్నాడు. సుకేశా! నీవడిగిన మహాపురుషుడు ఎవరో కాదు. ఆత్మయే. ఆత్మ మన శరీరంలోనే ఉంటుంది. దానిలోనుంచే పదహారు కళలు, అంగాలు ఆవిర్భవించాయి.

  ఒకప్పుడు ఆత్మ ‘ఎవరు బైటికి వెళితే నేను బైటికి వెళ్లినవాణ్ణి అవుతాను? ఎవరు లోపల ఉంటే నేను లోపల ఉండగలుగుతాను?’ అని తనలో తాను ప్రశ్నించుకుంది. భరద్వాజా! ఆత్మయే ప్రాణాన్ని సృష్టించింది. ఆ ప్రాణం నుంచి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, అన్నం నుంచి వీర్యం, తపస్సు, మంత్రాలు, కర్మలోకాలు, అలోకాలు అన్నీ ఏర్పడ్డాయి. కర్మలను బట్టి ఆయా లోకాలకు పేర్లు ఏర్పడ్డాయి. వీటిని అన్నిటినీ లెక్కిస్తే పదహారు కళలు అవుతాయి. కనుక పదహారు కళలు లేదా అంగాలు కల పురుషుడు ఆత్మయే.

 నదులన్నీ సముద్రం వైపు ప్రవహిస్తాయి. సముద్రాయణంలో వేర్వేరు పేర్లు కలిగిన నదులు సముద్రంలోకి చేరగానే భిన్నభిన్న నామరూపాలను కోల్పోతున్నాయి. అన్నిటినీ కలిసి సముద్రం అని పిలుస్తున్నాం. అదేవిధంగా వేర్వేరుగా కనపడుతున్న పంచభూతాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ ఆత్మ సృష్టించిన ప్రాణంలో నుంచి ఏర్పడినవే. ఈ పదహారు ఆత్మ వైపు ప్రయాణం చేసి ఆత్మలో కలిసిపోతాయి. ఇదే పురుషాయణం. ఆత్మ పురుషునిలో లీనం కాగానే వీటి పేర్లు, రూపాలు అన్నీ పోతున్నాయి. మొత్తానికి ‘పురుషుడు’ అనే ఒక్క పేరు మిగులుతోంది.

ఈ పురుష శబ్దం స్త్రీ పురుష లింగభేదాల్లోనిది కాదు. రూపరహితం, నామ రహితం, లింగరహితమూ అయిన ఆత్మను పురుష శబ్దంతో వేదం పేర్కొంటోంది. పురుష సూక్తం ఈ ఆత్మస్వరూపాన్ని విశ్వాత్మ సమగ్ర దర్శనాన్ని చెబుతోంది. పురుష శబ్దంతో చెప్పబడే ఆత్మకు ఎటువంటి కళలు, అంగాలు, చావు పుట్టుకలు, మార్పులు, చేర్పులు ఏవీ ఉండవు. అది అమరం. అది శాశ్వతం. ఆ ఆత్మ బహిర్ముఖం అయినప్పుడు పదహారు కళలతో ఉంటోంది. కనుక పదహారు కళలు గల పురుషుడు ఆత్మయే.

‘అరా ఇవ రథనాభౌ కలా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం
పురుషం వేద యథా మా వో మృత్యుః పరివ్యథా ఇతి’

 నాయనా! రథచక్రంలోని ఆకులు (చువ్వలు)లాగా పదహారు కళలు ఎవరిలోనుండి వెలుపలికి వస్తూ ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ పురుషుణ్ణి గురించి తెలుసుకోండి. అనగా పరమాత్మను గురించి తెలుసుకోండి. అప్పుడు మృత్యువు ఇక మిమ్మల్ని బాధపెట్టదు.

 మీ ఆరుగురు నా దగ్గర తెలుసుకోవడానికి వచ్చిన బ్రహ్మజ్ఞానంలో నాకు తెలిసింది ఇంతే. ఇది తెలిస్తే అంతా తెలిసినట్టే అని ఆశీర్వదించాడు.

 వారంతా ఎంతో ఆనందంతో ‘‘మహర్షీ! అజ్ఞాన సాగరాన్ని దాటించి అవతల తీరానికి చేర్చిన మీరే మాకు తండ్రి. మీకు శత సహస్ర వందనాలు’’ అంటూ పాదాభివందనం చేశారు.

 మూలాధారం నుంచి సహస్రారానికి చేరుకునే కుండలినీ శక్తికి, ఆరుచక్రాల ప్రయాణంలాగా సాగిన ప్రశ్నోపనిషత్తుకు అభివందనం.
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

మరిన్ని వార్తలు