ఎండ వేళ మేనికి మేలు

30 Mar, 2018 00:43 IST|Sakshi

వేసవిలో చర్మం ఎండవేడికి త్వరగా అలసిపోతుంది. ఇలాంటప్పుడు బ్లీచింగ్, క్లెన్సింగ్, స్క్రబ్బింగ్‌ అవసరం అవుతుంటాయి. అయితే ఇందుకు రసాయనాలు గల ఉత్పత్తులకు బదులు సహజసిద్ధమైన ఉత్పాదనలు ఎంచుకోవాలి.

జిడ్డు చర్మం గలవారు
వేసవి జిడ్డుచర్మం గలవారికి మరింత పరీక్ష పెడుతుంది. చెమట అధికమై దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. జిడ్డు నుంచి పరిష్కారానికి..

పాలతో బ్లీచ్‌
పాలు 4 టేబుల్‌ స్పూన్లు, తేనె టేబుల్‌ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్‌స్పూన్లు కలిపి చర్మం నల్లబడిన చోట రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.

పెరుగుతో క్లెన్సర్‌
పెరుగు 4 టేబుల్‌ స్పూన్లు, తే¯ð  2 టేబుల్‌ స్పూన్లు , నిమ్మరసం 3 టేబుల్‌ స్పూన్లు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.

నారింజ రసం
టీ స్పూన్‌ నారింజ రసం, 3 టీ స్పూన్ల ఓట్స్, టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు కలిపి ముఖానికి పట్టించి, వలయాకారంగా 5 నిమిషాల సేపు స్క్రబ్‌ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి.

బియ్యప్పిండి
మూడు టీ స్పూన్ల బియ్యప్పిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్‌ తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ప్యాక్‌.

అలోవెరా
అలోవెరా ఆకును మధ్యకు విరిచి, దాన్నుంచి వచ్చిన జ్యూస్‌కు సమపాళ్లలో రోజ్‌వాటర్‌ కలిపి తరచూ మేనికి మసాజ్‌ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మం సహజకాంతికి వస్తుంది. చర్మం మండడం, దురద, దద్దుర్లు.. వంటివి తగ్గుతాయి.

పొడిచర్మం గలవారు
ఎండ నుంచి రక్షణగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ను తప్పక రాసుకోవాలి. అలాగే, పెదాలకు ఎస్‌.పి.ఎఫ్‌ 30శాతం ఉన్న లిప్‌బామ్‌ను వాడాలి. విటమిన్‌ ‘ఇ’ మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండుసార్లు మేనికి వాడాలి. ఎ.సి, కూలర్లు ఉత్పత్తి చేసే చల్లని గాలులు గాలిలో తేమను తగ్గించి చర్మాన్ని ఇంకా పొడిబారేలా చేస్తాయి. గాలిలో తేమ తగ్గకుండా వారానికి ఒకసారి ఇంట్లో నీటిని స్ప్రే చేయడం, ఎ.సి ఫిల్టర్‌లో  దుమ్మును తొలగించడం వంటి జాగ్రత్తలు అవసరం.

మరిన్ని వార్తలు