ఊరొచ్చిన స్కైప్

11 Mar, 2014 23:44 IST|Sakshi
ఊరొచ్చిన స్కైప్

సౌదీలో ఉన్న భర్త మొహం చూడాలంటే మూడేళ్లు..ఒక్కోసారి ఐదేళ్ల వరకూ ఎదురుచూడాలి. బంగ్లాదేశ్‌లోని పల్లెటూళ్ల మహిళలు పడుతున్న కష్టాల్లో ఇదొకటి. ఇప్పుడా కష్టం తీరిపోయింది. డీనెట్ కంపెనీవారు చేసిన ఓ సరికొత్త ప్రయోగంతో పల్లెమహిళల కళ్లలో మెరుపులు మెరుస్తున్నాయి.

పొద్దునే పదకొండుగంటలకల్లా స్కూటీలపై అమ్మాయిలు లాప్‌టాప్‌లు పట్టుకుని పల్లెటూళ్లకు వెళతారు. వీళ్లని ‘ఇన్‌ఫో లేడీస్’ అని పిలుస్తున్నారు. కూలిపనులు, వ్యవసాయ పనులు చేసుకునే మహిళలు కనిపించగానే బండి ఆపి లాప్‌టాప్ ఓపెన్ చేస్తారు. దాంతో ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భర్తను స్కైప్‌లో చూసుకుని ఆనందపడిపోతారు పల్లె మహిళలు. స్కైప్‌ని వాడుకున్న మహిళ  దగ్గర గంటకు వంద రూపాయలచొప్పున తీసుకుంటున్నారు. వారానికి రెండుసార్లు చొప్పున ఒకో పల్లెకి తిరుగుతున్న డీనెట్ ఉద్యోగినులను కంపెనీ మాత్రమే కాదు ప్రతి పల్లె మహిళా మెచ్చుకుంటోంది.

అవును మరి...ఐటి ఉద్యోగం అంటే ఎంచక్కా ఏసీ రూముల్లో కూర్చుని పనిచేయడం అనుకుంటారు కాని ఇలా ఎండనకా, వాననకా స్కూటీలపై పల్లెటూళ్లలో తిరగడం కాదు కదా! కాని డీనెట్ ఉద్యోగినులు మాత్రం తమ సేవల్ని పల్లెమహిళలకు అందుబాటులోకి తేవడంలో ఉండే ఆనందం వేరంటారు. ఇక్కడ లాప్‌టాప్‌లో తన భర్తతో మాట్లాడుతున్న 45 ఏళ్ల మహిళ జరబర్షా మాటల్లో చెప్పాలంటే..‘నా భర్తను చూసి ఆరేళ్లు దాటింది. ఈ కంప్యూటర్ అమ్మాయి పుణ్యాననా భర్తను కళ్లతో చూసుకోగలిగాను. కంప్యూటర్ వాడకం ఎక్కడో పట్టణంలో ఉన్నవారికే సొంతమనుకునేవాళ్లం. ఇప్పుడు మాకు కూడా తెలిసినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అంటోందామె. ఈ ఇన్‌ఫో లేడీస్ ఒక్క స్కైప్ మాత్రమే కాదు ప్రభుత్వ పథకాల గురించి కూడా పల్లె మహిళలకు వివరంగా చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు