మూడో నిపుణుడు

18 Jul, 2018 00:25 IST|Sakshi

చెట్టు నీడ

రాజుగారు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. లేవగానే తన నోట్లో దంతాలున్నాయో లేవోనని చూసుకోసాగారు. అంతా సరిగానే ఉందని భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి రాజదర్బారు కొలువయ్యాక తన మంత్రి వర్గంతో ‘‘రాత్రి కలలో నా దంతాలన్నీ విరిగిపోయాయనే కల వచ్చింది. దీని నిగూడార్థం చెప్పే నిపుణుడిని హాజరుపరచండి’’ అని హుకుం జారీ చేశారు. రాజుగారు చెప్పినట్లుగానే హుటాహుటిన స్వప్న ఫలితాలను వివరించే ఒక నిపుణుడిని హాజరుపర్చారు. ‘నా పళ్లన్నీ ఊడిపోయినట్లుగా నేను కలగన్నాను’ అని చెప్పి కలను వివరించారు. రాజుగారు. దానికి ఆ నిపుణుడు ‘‘అపచారం అపచారం.. రాజుగారూ మీకు వచ్చిన కల ఏమి చెబుతోందంటే... మీ కళ్లముందే మీ ఇంటిలోని వారంతా చనిపోతారు’’ అని అర్థం చెప్పాడు. రాజుగారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే అతన్ని కారాగారంలో వేసి నిర్బంధించవలసిందిగా భటులను ఆదేశించి, మరో నిపుణుడిని పిలవాలని ఆజ్ఞాపించారు. మరో నిపుణుడు వచ్చాడు. రాజుగారు చెప్పిన కలను విన్న అతనూ మొదటి నిపుణుడు చెప్పినట్లుగానే చెప్పడంతో అతన్నీ చెరసాలలో వేసి, మూడో నిపుణుడిని పిలవాలని మళ్లీ రాజుగారు హుకుం జారీచేశారు. మూడో నిపుణుడు హాజరయ్యాడు. రాజుగారు తనకొచ్చిన కలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇది విన్న ఆ నిపుణుడు రాజుగారూ ‘మీకు నిజంగానే ఈ కల వచ్చిందా?’ అని మళ్లీ రెట్టించాడు. రాజుగారు ఎంతో ఆతృతతో అవునని తలూపారు. దానికా నిపుణుడు ‘‘రాజుగారూ మీకు శుభాకాంక్షలు’’ చెప్పగానే.. రాజుగారు ‘‘దేనికి శుభాకాంక్షలు:’’ అని ఎంతో ఆతృతతో అడిగారు. 

దానికా నిపుణుడు ‘‘మీ ఆయుష్షు సుదీర్ఘమైనది. మీ కుటుంబంలో అందరికంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు’’ అని కల అర్థాన్ని వివరించాడు. రాజుగారు అతను చెప్పిన జోస్యానికి ఎంతో మెచ్చుకున్నారు. ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. నిజానికి మిగతా ఇద్దరు జ్యోతిష్యులు చెప్పింది కూడా ఇదే అయినప్పటికీ చెప్పే తీరులో వ్యత్యాసముంది. కొందరి మాటలతో మనస్సుకు గాయాలవుతాయి. మరికొందరి మాటలు ప్రేమను పంచి హృదయాలను గెలుచుకుంటాయి. 
– ముజాహిద్‌
 

మరిన్ని వార్తలు