బుల్లి పరికరం.. గొప్ప ప్రయోజనం

27 Sep, 2018 00:31 IST|Sakshi

గుండెజబ్బులతోపాటు కేన్సర్లను కూడా చిటికెలో గుర్తించేందుకు యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్‌గౌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమై పరికరాన్ని అభివద్ధి చేశారు. మల్టీకార్డర్‌ అని పిలుస్తున్న ఈ పరికరం అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నది కూడా. మన కెమరాల్లో ఉండే సీమాస్‌ సెన్సర్‌ లాంటిది ఒకటి దీంట్లో ఉంటుంది. నాలుగు భాగాలుగా విభజించిన ఈ సెన్సర్‌ నాలుగు ప్రత్యేక రసాయనాలను గుర్తించగలదు. మూత్రం, రక్తనమూనాల్లో ఈ నాలుగు రసాయనాల మోతాదును బట్టి వ్యాధి ఉందో లేదో.. ఉంటే ఎలా విస్తరిస్తోంది? లేదా ఎంతమేరకు నయమైంది? అన్నది తెలుసుకోవచ్చు. మైక్రోయూఎస్‌బీ సాయంతో దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు తగిలించుకుని పనిచేయించవచ్చునని, అతి చౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉండటం దీని ప్రత్యేకత అని అంటారు ఈ పరికరాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన సమాధాన్‌ పాటిల్‌.

ప్రస్తుతం దీన్ని గుండెజబ్బులతోపాటు ప్రొస్టేట్‌ కేన్సర్‌ నిర్ధారణకు ఉపయోగించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ఏమూలన ఉన్న వారి వివరాలనైనా డాక్టర్లు ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చునని వివరించారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పటికే బోలెడన్ని అప్లికేషన్లు, గాడ్జెట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మరిన్ని వినూత్నమైన పరికరాల తయారీ కోసం మైక్రోప్రాసెసర్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ భారీ నగదు బహుమతితో ఓ పోటీ కూడా నిర్వహిస్తోంది.  
 

మరిన్ని వార్తలు