పోలిక తేవద్దు

2 Mar, 2018 00:29 IST|Sakshi
డాక్టర్‌ వి.శాంత

స్ట్రాంగ్‌ డోస్‌

డాక్టర్‌ వి.శాంత క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌. చెన్నైలోని ‘అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌’ చైర్‌పర్సన్‌. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, మెగసెసె అవార్డుల గ్రహీత. ఇవన్నీ కాదు కానీ.. వృత్తిని ఆమె ఎంత నిబద్ధతతో స్వీకరించారో వెల్లడించే ఒక చిన్న సంఘటన ఈ మధ్యే బయటికి వచ్చింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ని నీరవ్‌ మోదీ అనే ఆభరణాల వ్యాపారి వేల కోట్ల రూపాయలకు మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆ బ్యాంకు ఎండీ సునీల్‌ మెహ్‌తా ఫిబ్రవరి 15న ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టారు. ‘‘ఇలాంటి మోసాలను ఇక జరగనివ్వం. సర్జరీ చేసి ఈ అవినీతి క్యాన్సర్‌ని నిర్మూలిస్తాం’’ అని అన్నారు. దీనిపై డాక్టర్‌ శాంతి మండిపడుతూ ఆయనకో ఉత్తరం రాశారు. ‘‘అవినీతి అనేది ఒక నేరం. సిగ్గు పడాల్సిన తప్పుడు పని. హీనమైన ఆ నేరాన్ని క్యాన్సర్‌తో ఎలా పోలుస్తారు?’’ అని ఆ ఉత్తరంలో డాక్టర్‌ శాంత ప్రశ్నించారు! మనసా వాచా కర్మణా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేవారు తప్ప ఇంకొకరు ఈ మాట అనలేరు. డాక్టర్‌ శాంత వయసిప్పుడు 90 ఏళ్లు. నేటికీ ఎంతో ఉత్సాహంగా రోగులకు సేవలు అందిస్తూ ఉన్నారు.

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఓ సందర్భంలో క్యాన్సర్‌కు లేనిపోని పోలికలు తెచ్చారు అప్పుడు కూడా డాక్టర్‌ శాంత చెన్నైలోని యు.ఎస్‌.కాన్సులేట్‌కు ఘాటుగా లేఖ రాశారు. నిరాశను, నిస్పృహను, అవినీతిని, ఇంకా.. సమాజంలోని నానా రుగ్మతల్ని క్యాన్సర్‌తో పోల్చడం మామూలైపోయింది. ఇది సరి కాదు’’ అని అందులో ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా వృత్తిని ఇంతగా ప్రేమించడంవల్లనే అంతగా కోపం వస్తుందేమో!  శాంత 1927 మార్చి 11న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు. అయ్యర్ల కుటుంబం. నోబెల్‌ గ్రహీతలు సీవీ రామన్, ఎస్‌.చంద్రశేఖర్‌లు వీళ్ల వంశవృక్షంలోని వారే. సీవీరామన్‌ శాంతకు నాన్నవైపు వారు. చంద్రశేఖర్‌.. అమ్మవైపు వారు. 

‘‘అవినీతి అనేది ఒక నేరం.  హీనమైన ఆ నేరాన్ని క్యాన్సర్‌తో  ఎలా పోలుస్తారు?’’ – డాక్టర్‌ వి.శాంత 

>
మరిన్ని వార్తలు