అమ్మా నాకు జాబ్ వచ్చింది!!

7 Nov, 2016 00:00 IST|Sakshi
అమ్మా నాకు జాబ్ వచ్చింది!!

పెద్ద పెద్ద సెలబ్రిటీలు... చిన్న చిన్న ఉద్యోగాలు!
పూర్వాశ్రమం
 

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి
రాకముందు బెంగుళూరులో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేసిన విషయం బహుశా ఈ తరం ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటుంది. అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. కచేరీలలో సంగీత వాద్యాలను అందించే సహాయకుడిగా పనిచేశారని తెలిస్తే ‘అవునా?’ అనిపిస్తుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా ఉన్నవారు ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ‘అమ్మా నాకు జాబ్ వచ్చింది’ అని ఇంట్లో చెప్పుకుని పొంగిపోయారు. అందుకేవాళ్ల తొలి ఉద్యోగాలేమిటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
 
దేవానంద్

దేవానంద్ అంటే అమ్మాయిలు పడి చచ్చేవారు. ఆ స్టయిల్, ఆ యాక్టింగ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకునేవి.  సినిమాల్లోకి రాకముందు ఆయన ముంబై చర్చిగేట్ ప్రాంతంలోని మిలటరీ సెన్సార్ ఆఫీసులో గుమస్తాగా పని చేశారు. ఆయన నెల జీతం రూ.165.
 
అమితాబ్ బచ్చన్
షా వాలెస్ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు బిగ్ బి. ఆ తర్వాత ‘బర్డ్ అండ్ కో’ కంపెనీలో (అది కూడా షిప్పింగే) రవాణా బ్రోకర్‌గా నాలుగు రాళ్లు సంపాదించుకున్నారు.
 
అమ్రిష్ పురి
మదన్ పురి, చమన్ పురి. వీళ్లిద్దరూ అమ్రి పురి అన్నయ్యలు. బాలీవుడ్‌లో పేరున్న విలనయ్యలు. వీళ్లిద్దరి అడుగుజాడల్లో నడిచేందుకు అమ్రేష్ పురి కూడా సినీ రంగ ప్రవేశం చేయబోయారు. అయితే స్క్రీన్ టెస్ట్‌లో పాస్ కాలేదు. ఇక సినిమాలకు పనికి రాననుకుని డిసైడ్ అయ్యి ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’లో ఉద్యోగం సంపాదించుకున్నారు. తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు.
 
అక్షయ్ కుమార్
బ్యాంకాక్‌లోని నో హోటల్‌లో వెయిటర్‌గా, చెఫ్‌గా పని చేశారు అక్షయ్ కుమార్. అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. బ్యాంకాక్ నుంచి బాలీవుడ్‌కి వచ్చాక అతడి పేరు అక్షయ్ కుమార్ అయింది. ఖిలాడీ కుమార్ కూడా అతడే.
 
రణవీర్ సింగ్
సినిమాల్లోకి రాకముందు రణవీర్ ఓ అడ్వర్‌టైజింగ్ కంపెనీలో కాపీ రైటర్. ప్రముఖ యాడ్ ఏజెన్సీలు ఓ అండ్ ఎం, జె.వాల్టర్ థాంప్సన్‌లకు  ఆయన పనిచేశారు.

నవాజుద్దీన్ సిద్ధిక్కీ
రైతు కుటుంబం నుంచి వచ్చారు. యు.పి.కుర్రాడు. కెమిస్టుగా పనిచేసేవారు. నటన మీద ఉన్న ఇంట్రెస్టు కొద్దీ ఢిల్లీ వెళ్లి నాటకాలలో వేషాల కోసం ప్రయత్నించారు. కొన్నాళ్లు అక్కడే వాచ్‌మన్‌గా చేశారు. చివరికి బాలీవుడ్ తీరానికి చేరారు.
 
దిలీప్ కుమార్
అసలు పేరు యూసఫ్ ఖాన్. క్యాంటీన్ ఓనర్. పండ్లు కూడా అమ్మారు. బాలీవుడ్‌కి వచ్చి ట్రాజెడీ కింగ్ అయ్యారు. దిలీప్ కుమార్‌గా ప్రసిద్ధులయ్యారు.
 
పరిణీతి చోప్రా
ఈమె యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో మార్కెటింగ్ ఇంటెర్నీ. మెల్లిగా అక్కడే యాక్టింగ్‌లో తన ఆసక్తిని బయటపెట్టి సినిమాల్లోకి వచ్చేశారు.
 
మెహమూద్

ఈ బాలీవుడ్ అగ్రశ్రేణి కమెడియన్ మొదట్లో ట్రక్కు డ్రైవర్. కోళ్లు, కోడిగుడ్లు కూడా అమ్మారు. టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొన్నాళ్లు ఉన్నారు.  తర్వాత సినిమాల్లోకి వచ్చారు.
 
మణిరత్నం
మణిరత్నం ఎం.బి.ఎ. పట్టభద్రులు. చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పని చేశారు. తర్వాత సినిమా డెరైక్షన్‌లోకి వచ్చారు.
 
గుల్జార్
అసలు పేరు సంపూరణ్ సింగ్ కర్లా. గుల్జార్ అనే పేరుతో బాలీవుడ్ రైటర్‌గా ప్రసిద్ధులయ్యారు. సినిమాలకు రాయక ముందు కార్ల గ్యారేజీలో పనిచేశారు. కార్లకు పెయింట్ వేసేవారు. అవును. ఆక్సిడెంట్ అయిన కార్లకు రంగులు వేశారు. కవితలు రాస్తూ, సినిమా పాటల్లోకి, సినిమా మాటల్లోకి వచ్చారు.
 
 అర్షాద్ వార్సీ
మొదట డోర్-టు-డోర్ కాస్మటిక్స్ సేల్స్‌మాన్! తర్వాత ఫొటో ల్యాబ్‌లో చేశారు. అక్కడి నుంచి బాలీవుడ్‌కి వచ్చారు.
 
 బొమన్ ఇరానీ
‘త్రీ ఇడియట్స్’ సినిమాలో వైరస్‌గా విఖ్యాతుడైన బొమన్ ఇరానీ ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్. ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో రూమ్ సర్వీస్ అటెండెంట్. అక్కడి నుంచి యాక్టింగ్‌లోకి వచ్చారు.
 
సోనాక్షీ సిన్హా
సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’తో సినీ రంగ ప్రవేశం చేసేనాటికి సోనాక్షీ కాస్ట్యూమ్స్ డిజైనర్. 2005లో ‘మేరా దిల్ లేకే దేఖో’ చిత్రంలో స్క్రీన్ పైన కనిపించిన కాస్ట్యూమ్స్ సోనాక్షి వే. ఆ తర్వాత తనే స్క్రీన్ పైకి వచ్చేశారు.
 
రణదీప్ హుడా
మెల్‌మోర్న్‌లో చదివారు. ఎం.బి.ఎ. చేశారు. అక్కడ ఉన్నప్పుడే ఒక చైనీస్ రెస్టారెంట్‌లో పని చేశాడు. కార్లు తుడిచాడు. వెయిటర్‌గా పని చేశాడు. కొన్నాళ్లు కారు డ్రైవర్‌గా ఉన్నాడు. 2000లో ఇండియా వచ్చాక ఒక ఎయిర్ లైన్స్‌లో మార్కెటింగ్ విభాగంలో పనికి కుదిరాడు. తర్వాత బాలీవుడ్‌లోకి వచ్చాడు.
 
షివాజీ సతమ్
ఇండియన్ టీవీ లెజండ్రీ ఎ.సి.పి. ప్రద్యుమ్న్ అసలు పేరు షివాజీ సతమ్. బ్యాంక్‌లో క్యాషియర్‌గా చేశారు. తర్వాత యాక్టింగ్‌లోకి వచ్చారు.
 
రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా
బాలీవుడ్‌లోకి రాకముందు మెహ్రా యాడ్ ఫిల్మ్ మేకర్. అంతకన్నా ముందు వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్‌మన్. నిజమే. ఈ ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు యురేకా ఫోర్బ్స్ వారి వాక్యూమ్ క్లీనర్‌లను అమ్మారు!

మరిన్ని వార్తలు