చిన్న తప్పులతో పెద్ద తిప్పలు!

29 Dec, 2016 23:33 IST|Sakshi
చిన్న తప్పులతో పెద్ద తిప్పలు!

ఉమెన్స్‌ హెల్త్‌

‘నొప్పి అనివార్యం. కానీ బాధపడుతూనే ఉండాలా అన్నది మన చేతుల్లో, చేతల్లో ఉంది!’ ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఆలోచింపజేసే మాట ఇది. నిజం చెప్పాలంటే, ఇవాళ మన దేశంలో చాలామంది మహిళలం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ, ఇంటి పని, కుటుంబం బాగోగులలో మునిగి తేలుతున్నాం. బాధను అనుభవిస్తూ ఉండిపోతున్నామే తప్ప, దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం లేదు. నిజం చెప్పాలంటే, చాలా చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం కూడా మన గృహలక్ష్ముల ఆరోగ్యానికి ఇబ్బందిగా మారుతోంది. తెలిసి తెలిసీ... మనమందరం తరచూ చేసే కొన్ని తప్పల్ని, నివారిస్తే రానున్న 2017 ఆనందంగానే కాదు... ఆరోగ్యంగానూ ఉంటుంది. నివారించాల్సిన ఆ తప్పులు ఏమిటంటే...

తగినంత మంచినీళ్ళు తాగకపోవడం!
ఏ ఇల్లాలినైనా కదిలించి చూడండి... రోజూ ఏడెనిమిది గ్లాసుల మంచినీళ్ళు తాగాలని తెలుసు. కానీ, చాలామంది మహిళలం ఆ నియమాన్ని పాటించం. చిన్న విషయంలా కనిపించినా, ఇది చాలా పెద్ద తప్పు. మంచి నీళ్ళు తక్కువగా తాగడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గి, బలహీనంగా అనిపిస్తుంది. అదే సమయంలో, దీని వల్ల ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అలాగే, యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ (యు.టి.ఐ) రావచ్చు. కాబట్టి, మహిళలందరం రోజు వారీ ఆహారంలో భాగంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే, వీలైనంత ఎక్కువ మంచినీళ్ళు తాగాలి.

భోజనం చేయకపోవడం!
పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పనిలో మునిగితేలడంతో గృహిణుల్లో చాలామందిమి సరిగ్గా తిండి తినం. పొద్దున్న తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌కి మంగళం పాడేస్తుంటాం. అదేమంటే, కాస్తంత భారీగా మధ్యాహ్నం భోజనం లాగించవచ్చని అనుకుంటాం. కొన్నిసార్లు పనిలో లంచ్‌ మానేసి, కడుపు నిండా రాత్రి భోజనం చేయచ్చని అనుకుంటూ ఉంటాం. ఇది కూడా కరెక్ట్‌ కాదు. భోజనం మానేయడం వల్ల బాడీ మెటబాలిజమ్‌ నెమ్మదిస్తుంది. దాని వల్ల అతిగా తింటాం. ఫలితంగా బరువు పెరుగుతుంది. తద్వారా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు సరేసరి. కాబట్టి, ఎంత పనిలో ఉన్నా సరే వేళకు తినడం మానకూడదు. వీలైనంత వరకు పండ్లు, కాయగూరలు, బీన్స్, మొలకెత్తిన విత్తనాలు కూడా తింటూ ఉంటే మెటబాలిజమ్‌ బాగుంటుంది.

తగినంత నిద్ర పోకపోవడం!
మన దేశంలోని గృహిణుల్లో చాలామందికి కనీసం సరైన నిద్ర కూడా కరవే! రకరకాల ఇంటి పనులు, బాధ్యతలతో కలత నిద్రతో సరిపుచ్చుకుంటున్నాం. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా, పెద్దగా వయసు లేకుండానే ముసలితనం లక్షణాలు వచ్చేస్తున్నాయి. తొందరగా మీద పడే ఈ వార్ధక్యాన్ని తప్పించుకోవాలంటే, ఆడవాళ్ళమే కాదు... మగవాళ్ళు కూడా రోజూ ఏడు గంటల పాటు సుఖంగా నిద్ర పోవాలి.

క్యాల్షియమ్‌ తీసుకోకపోవడం!
మనం రోజూ తినే ఆహారంలో తగినంత క్యాల్షియమ్‌ ఉండాలి. లేదంటే, చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారి, ఆస్టియో పోరోసిస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో పిల్లలకు రోజూ పాలు, పండ్లు పెట్టే మహిళలం మనం కూడా తప్పనిసరిగా పాలు తాగాలి. క్యాల్షియమ్‌ ఉంటుంది కాబట్టి, పాల ఉత్పత్తులు తీసుకోవడం మానేయకూడదు.  35 ఏళ్ళు దాటాయంటే, గృహిణులందరూ క్యాల్షియమ్‌ తీసుకోవాల్సిందే!

మనం చేసే ఈ చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకుంటే, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇల్లాలి ఆరోగ్యం బాగుంటేనే కదా... కుటుంబ ఆరోగ్యం బాగుండేది! కొత్త ఏడాది 2017 నుంచి అయినా ఇవన్నీ పాటిద్దాం. – ప్రణతి
తగినన్ని ప్రొటీన్లు తీసుకోకపోవడం!
ఇవాళ చాలా మంది ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువుండడం చూస్తుంటాం. దీనికి సర్వసాధారణమైన కారణం ఏమిటంటే – తీసుకోవాల్సినంతగా ప్రొటీన్లు తీసుకోకపోవడం! సన్నగా ఉండాలనో, బరువు తగ్గాలనో ఆదుర్దాలో ప్రొటీన్లున్న ఆహారం తీసుకోవడం మానేస్తుంటాం. దీని వల్ల కండరాలు క్షీణించి, మరింత బరువెక్కుతాం. పైగా, ప్రొటీన్లు తినకపోతే, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా బ్లడ్‌ షుగర్‌ ఉన్నట్టుండి పెరుగుతుంది. రోజంతా మరింత ఆకలి వేస్తుంది. కాబట్టి, తినే ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తపడాలి.

మరిన్ని వార్తలు