‘స్మార్ట్’ ఉంటే ...బ్యాంక్ మీ వెంటే

16 May, 2014 23:04 IST|Sakshi
‘స్మార్ట్’ ఉంటే ...బ్యాంక్ మీ వెంటే

బిజినెస్ పని మీద చెన్నై వెళ్లాడు కార్తీక్. పని ముగించుకుని బైల్దేరేటప్పుడు చూసుకుంటే పర్సు ఖాళీగా ఉంది. సరే ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చులే అని అక్కడికి వెళ్లిన తర్వాత చూసుకుంటే అకౌంట్లో బ్యాలెన్స్ లేదంటూ వెక్కిరించింది ఏటీఎం మెషీన్. డబ్బులున్న ఎక్స్‌వైజడ్ అకౌంట్ కార్డు కాకుండా వేరే కార్డు తీసుకెళ్లినట్లు అప్పుడర్థమైంది అతనికి. రాత్రివేళ ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి అనుకుంటుంటే ఠక్కున ఆలోచన వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా తన బ్యాంకు వెబ్‌సైట్లోకి వెళ్లాడు. అందులోకి లాగిన్ అయి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ కింద తనకు కావల్సిన మొత్తాన్ని ఎక్స్‌వైజడ్ అకౌంటులోకి బదలాయించాడు. కొన్ని నిమిషాలాగి ఏటీఎంలో నుంచి డ్రా చేసుకుని, వెనక్కి బైల్దేరాడు. మర్నాడు ఇంటికొస్తూ దారిలోనే ఎల్‌ఐసీ ప్రీమియంలు, ఇతరత్రా కట్టాల్సిన బిల్లులు కూడా ఫోన్ ద్వారానే కట్టేశాడు. ఇలా .. బ్యాంకింగ్ పనివేళలతో సంబంధం లేకుండా స్మార్ట్‌ఫోన్లు అరచేతిలోనే సర్వీసులు అందుబాటులోకి తెచ్చేస్తున్న వైనంపై ఈ వారం ధనం కథనం.
 
ఎక్కడికైనా.. ఎప్పుడైనా వెంట తీసుకెళ్లగలిగే సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం పర్సనల్ కంప్యూటర్ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. పోటీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికే నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందిస్తున్న బ్యాంకులు తాజాగా స్మార్ట్‌ఫోన్లను కూడా ఆశ్రయిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లు పరిమాణంలో చిన్నగా ఉంటాయి కనుక సాధారణ వెబ్‌సైట్లను చూడటానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే.. స్మార్ట్‌ఫోన్లలోనూ పనిచేసే విధంగా  ప్రత్యేక వెబ్‌సైట్లను (యాప్స్) రూపొందిస్తున్నాయి.  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఫ్రీడమ్ ప్లస్ పేరుతోనూ, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. ఐసేఫ్ పేరిట, యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ మొబైల్ పేరుతోను మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌ని అందిస్తున్నాయి. వీటి ద్వారా బ్యాంకు ఖాతాలో బ్యాలెన్సులు తెలుసుకోవడం మొదలు బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జీలు, సినిమా టికెట్ల కొనుగోలు దాకా అన్ని రకాల సర్వీసులను ఈ యాప్స్ ద్వారా ఎంచక్కా చుట్టబెట్టేయొచ్చు.
 
ఆండ్రాయిడ్.. విండోస్ యాప్స్ ..

స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్, విండోస్, యాపిల్ ఐవోఎస్ అని వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేస్తున్నాయి. ఆయా ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుగుణమైన యాప్స్‌ని బ్యాంకులు తయారుచేసుకుంటున్నాయి. వీటిని ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ ఫోన్ అయితే ఐస్టోర్ నుంచి ఫోన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు పొందేందుకు సదరు బ్యాంకులో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ మాధ్యమంతో గానీ ఎస్‌ఎంఎస్‌ల రూపంలో గానీ లేదా ఏటీఎం సెంటర్ ద్వారా గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈమెయిల్ తరహాలోనే యాప్ లాగిన్ పేజీలో మీ ఐడీ, పాస్‌వర్డ్ టైప్ చేసి లాగిన్ అయి బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు.
 
 అందిస్తున్న సేవలు..

మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మన ఖాతాల వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు. అలాగే చెక్కు బుక్ లాంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ వంటి వ్యవస్థల ద్వారా మన ఖాతాలో ఉన్న డబ్బును ఇతర ఖాతాల్లోకి, ఇతరుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎన్‌ఈఎఫ్‌టీ మార్గంలో ట్రాన్స్‌ఫర్‌కి కొంత సమయం పట్టేస్తుంది కనుక.. తక్షణమే ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఐఎంపీఎస్ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు విధానాల్లోనూ బ్యాంకులు స్వల్ప రుసుములు వసూలు చేస్తాయి. ఇవే కాకుండా కరెంటు, నీటి బిల్లులు, క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు మొదలైనవి కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఇందుకోసం ఆయా సంస్థలను ముందుగా మన ఖాతాలకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మొబైల్ ఫోన్, డీటీహెచ్ రీచార్జ్‌లను కూడా నేరుగా ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.
 
సాధారణంగా ఈ సర్వీసులకు ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. ఇంటర్నెట్ మాధ్యమం కాకుండా ఎస్‌ఎంఎస్‌లు పంపడం ద్వారా కూడా ఎంక్వైరీ సేవలు, రీచార్జ్‌లు, ఐఎంపీఎస్ వంటి సేవలు బ్యాంకులు అందిస్తున్నాయి. ఒకవేళ నగదు విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిన పక్షంలో మనకు దగ్గర్లో ఏటీఎం సెంటర్లు ఎక్కడున్నాయో కూడా ఈ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.
 
 భద్రత ముఖ్యం..

మొబైల్ ద్వారా సులభంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసేసినా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా వైరస్‌లు కూడా ఫోన్లో ప్రవేశిస్తుంటాయి. సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగిలించే అవకాశాలూ ఉన్నాయి. అందుకే, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.
 
 1.వివిధ థర్డ్ పార్టీలు కూడా బ్యాంకుల పేరిట యాప్స్‌ని రూపొందిస్తుంటాయి. ఇలాంటివి కాకుండా  మీ బ్యాంకు స్వయంగా రూపొందించిన యాప్‌ని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 
 2. ఒకవేళ మీ బ్యాంకుకి సంబంధించిన యాప్ గానీ లేకపోతే.. మొబైల్ యాంటీవైరస్ లేకుండా స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకు వెబ్‌సైటును ఉపయోగించకుండా ఉండటం మంచిది.
 
 3. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్తపడాలి.
 
 4.ఎప్పటికప్పుడు యాప్స్‌ని, ఆపరేటింగ్ సిస్టం మొదలైన వాటిని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.
 
 5. మెరుగైన మొబైల్ యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
 

>
మరిన్ని వార్తలు