స్మార్ట్‌ ఫోన్స్‌ వాడే మహిళలు బీ కేర్‌ఫుల్‌..

19 Dec, 2017 10:13 IST|Sakshi

వాషింగ్టన్‌: ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్స్‌ వాడే మహిళలు తమ ఆరోగ్య విషయంలో ఇక నుంచి జాగ్రత్త వహించాలి. స్మార్ట్‌ఫోన్లు, వైఫై రౌటర్లు, మైక్రోవేవ్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌తో మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పరికరాల్లోని అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే అయనీకరణం చెందని రేడియేషన్‌ వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని కైజర్‌ పర్మనెంట్‌ డివిజన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

సరికొత్త రక్త పరీక్ష
కేన్సర్‌ వ్యాధులను నిర్థారించే సరికొత్త రక్త పరీక్ష ను జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లింపోమియా (తెల్లరక్త కణాల కేన్సర్‌), మెలనోమా (ఒక రకమైన చర్మ కేన్సర్‌)ను ఇన్‌ఫ్రారెడ్‌ స్పెకోŠట్రస్కోపితో రక్త పరీక్షలు చేసి నిర్ధారించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఎలుకలు, కేన్సర్‌ వ్యాధి ఉన్న ఎలుకల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇన్‌ఫ్రారెడ్‌ స్పెకోట్రస్కోపితో పరీక్షలు చేయగా.. లింపోమియా, మెలనోమా కేన్సర్లను గుర్తించగలిగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మధుమేహం ముప్పు
మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం, తదితర ఇబ్బందులుండే వారికి మధుమేహం వచ్చే ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం యూరియాతో సంబంధమేనని వెల్లడైంది. ఇప్పటిదాకా మధుమేహం వల్ల కిడ్నీ పాడవుతుందని మాత్రమే తెలుసునని, కిడ్నీల వల్ల కూడా మధుమేహం వస్తుందని తమ తాజా పరిశోధనల్లో తేలిందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా మూత్రపిండాలు రక్తం నుంచి యూరియాను తొలగిస్తాయని, ఒకవేళ మూత్రపిండాలు పనిచేయడం తగ్గిపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహానికి దారితీస్తాయని వివరించారు.

మరిన్ని వార్తలు