మంచి మాటల వాసన

27 Feb, 2018 00:18 IST|Sakshi

చెట్టు నీడ

అక్కడ ఒక సన్యాసి కూర్చునివున్నాడు. 
సన్యాసి మౌనంగా, ధ్యానంగా  ప్రార్థిస్తూవున్నాడు. ఆయన పెదవులు 
చిన్నగా కదులుతున్నాయి. 

పాతకాలంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన పచ్చి అబద్ధాలు ఆడేవాడు. అందువల్ల ఆయన్ని ఎవరూ నమ్మేవాళ్లు కాదు. పైగా పరమ కోపిష్టి. కుటుంబ సభ్యులపై, బంధువులపై రుసరుసలాడుతుంటాడు. ఊరివాళ్లతో గొడవపడుతుంటాడు. దాంతో ఎవరూ ఆత్మీయంగా ఉండేవారు కాదు. ఆయనను చూస్తూనే ఏదో దుర్గంధం వీచినట్టుగా జనం పక్కకు తొలగిపోయేవారు. దీనితో వ్యాపారిలో దిగులు మొదలైంది.ఒకరోజు వ్యాపారి వీధిలో నడుస్తుండగా, ఏదో పరిమళాన్ని ఆయన ముక్కు గుర్తించింది. సుగంధ ద్రవ్యాల దుకాణం గానీ, అత్తర్ల దుకాణం గానీ సమీపంలో లేవని ఆయనకు తెలుసు. మరెక్కడినుంచి ఇంత మంచి వాసన వస్తోంది? ఇంకా నడుస్తుండగా ఆ పరిమళం మరింత హాయిగా, మెత్తగా అతడిని తాకుతోంది.

చూస్తే వీధి చివర వున్న చింతచెట్టు కింద నుంచి వస్తోంది. అక్కడ ఒక సన్యాసి కూర్చునివున్నాడు. సన్యాసి మౌనంగా, ధ్యానంగా ప్రార్థిస్తూవున్నాడు. ఆయన పెదవులు చిన్నగా కదులుతున్నాయి. ఆ పరిమళం సన్యాసి నోట్లోంచి వస్తోందని వ్యాపారి తేలిగ్గానే గ్రహించాడు. కానీ అది అతడికి ఆశ్చర్యం కలిగించింది. దాంతో ప్రార్థన ముగించి, కళ్లు తెరిచేవరకూ ఓపిగ్గా వేచివుండి తన సందేహాన్ని సన్యాసి ముందుంచాడు.  ‘నా నోట్లోంచి పరిమళమా? నేను సత్యంగా ఉంటాను. మృదువుగా సంభాషిస్తాను. అంతకుమించి నాకేమీ తెలీదు’ అన్నాడు నిరాడంబరంగా సన్యాసి. ‘నాకు అర్థమైంది స్వామీ’ అన్నాడు సాధువుకు వ్యాపారి భక్తిగా నమస్కరిస్తూ.

మరిన్ని వార్తలు