వండిన కథలు కావు

25 Feb, 2019 01:10 IST|Sakshi

వండుకోవడానికి సరుకులే లేవు..ఇక ఆకలి కడుపున మెదడేం వండుద్ది?కాదు.. విషయం అది కాదు!నిజానికి కడుపు నిండితే.. మెదడు ఖాళీగా ఉంటుంది!కడుపు ఖాళీగా ఉంటే మెదడు నిండుగా ఉంటుంది!భారతి రచయిత్రి కాదు.. కథా వస్తువు!ఇంకా గట్టిగా చెప్పాలంటే కథా దినుసు!ఎంత బాగా వండుతుందో.. కానీ వండినట్టే ఉండదు!ఊర్లో నిలువెత్తు అద్దం తీసుకుని తిరిగినట్టు ఉంటుంది!అవును.. ఇవి వండిన కథలు కాదు..రోమాంచిత వాస్తవాలు!

మట్టి పాత్రలే ఉన్న ఇళ్లలో ఇత్తడి బిందె.. బంగారపు బిందె కన్నా గొప్పది. ఆ బిందెను కొనుక్కోవడం వాళ్ల జీవన కల. రెక్కల కష్టం పెట్టుబడిగా సంపాదించుకున్న ఆస్తి. ఇలాంటి అపురూపాలకు, జీవనసారానికి అక్షరాలతో విలువగడ్తుంది ఎండపల్లి భారతి. చదువు అయిదవ తరగతే. అయితేనేం.. ఆమె రచనకు ప్రమాణం.. వందేళ్ల జీవిత అనుభవం.. అంతే లోతైన పరిశీలన. అందుకే ఆమె కథల్లో మనుషులు కదులుతారు.  భావోద్వేగాలు కనపడ్తాయి. 

ఆమె పరిచయం
ఎండపల్లి భారతి.. పుట్టింది, పెరిగింది.. చిత్తూరు జిల్లా, నిమ్మనపల్లి మండలంలోని దిగువ బురుజు. తండ్రి వెంకటరమణ, తల్లి ఎల్లమ్మ. వాళ్లకు భారతి ఏకైక సంతానం. ఆమెకు అయిదేళ్లున్నప్పుడే భారతి తల్లి టీబీతో చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తండ్రీ పోయాడు. అమ్మమ్మ, తాత ఇంట్లో  ఆశ్రయం పొందాల్సి వచ్చింది. దాంతో చదువు ముందుకు సాగలేదు. అమ్మమ్మ, తాతకు తోడుగా పొలంలో  పని చేసేది భారతి. ఆమెకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఉన్న ఊళ్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేసింది పెద్దమ్మ. భర్త శ్రీనివాసులు.  మెట్టినింటికీ  కూలి పనే ఆర్థిక ఆధారం. భర్తతోపాటు తనూ కూలీకి వెళ్లేది.

కుటుంబ బాధ్యతల బరువు ఆమె భుజాల మీదున్నా.. చదువు పట్ల ఆసక్తి ఆవిరి కానివ్వలేదు. తన పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లాడు. ఆడపిల్లలకు ధైర్యం, అబ్బాయికి ఆపోజిట్‌ జెండర్‌ను గౌరవించడం నేర్పింది.  పెద్దమ్మాయి విజయ కుమారి ఎమ్మే బీఈడీ. ప్రస్తుతం డిఎస్సీకి ప్రిపేర్‌ అవుతోంది. రెండో అమ్మాయి స్వరూప డిగ్రీ ఫైనలియర్‌. అబ్బాయి సోమశేఖర్‌ డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. 

కథలు రాయి 
‘‘ఏం రాయాలి?’’ ‘‘ఇప్పటి దాకా నువ్వు చూసిన జీవితం రాయి భారతీ’’ అన్నారు కిరణ్‌ కుమారి, సావెం రమేశ్‌. రాసింది. ‘సావు బియ్యం’ అనే పేరుతో. స్పష్టమైన వ్యక్తీకరణ. అద్భుతమైన మాండలీకం. చక్కటి పద సంపద. అబ్బుర పడ్డారు వాళ్లు. అక్షర దోషాలను సరిచేసి.. మరిన్ని  రాయమని ప్రోత్సహించారు. రాస్తోంది భారతి..  ఏ ఒక్కరి జీవితాన్నో కాదు.. మొత్తం సమాజ సరళినే. ఆమె రాసిన కథలన్నిటినీ టైప్‌ చేసి పలు పత్రికలకు పంపించింది కిరణ్‌ కుమారి. అలా  పత్రికల్లో అచ్చయిన కథలన్నిటితో ఓ సంకలం తెస్తే కూడా బాగుంటుందని భారతికి సలహా ఇచ్చింది ఆమె. పుస్తకం అంటే మాటలా? కనీసం యాభై వేలన్నా కావాలి. రెక్కలు ముక్కలు చేసుకున్నది కూటికి, పిల్లల చదువులకే చాలడం లేదనే చింత తొలుస్తున్నా.. పుస్తకం తేవాలనే కాంక్షా బలంగానే నాటుకుంది భారతిలో.

అనుకున్నది సాధించేదాకా నిద్రపోని పట్టుదల ఆమెది. ఆ ఉత్సాహానికి ఊతంలా పదిహేను వేల రూపాయలు సహాయం చేసింది కిరణ్‌ కుమారి. చిత్రకారిణి కూడా అయిన ఆమె.. భారతి కథలకు చక్కటి బొమ్మలనూ గీసింది. మిగిలిన డబ్బును అప్పుగా తెచ్చి ‘ఎదారి బతుకులు’ అనే కథా సంకలనాన్ని ముద్రించింది భారతి. వెయ్యి కాపీలు చేతుల మీదే అమ్ముడు పోయాయి. రెండునెల్లకే మొదటి ముద్రణ ఖాళీ అయిపోయింది. ఈ సంకలనం అమెరికాకూ చేరింది. తానా సభల్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ పుస్తకం రెండో ముద్రణ బాధ్యతను హెచ్‌బీటీ చేపట్టింది ఎంతో ఇష్టంగా. త్వరలోనే లాంచ్‌ కానుంది.
 
నవోదయం
భారతిలోని రచయిత్రిని ప్రపంచానికి చూపించిన కిరణ్‌ కుమారి, సావెం రమేశ్‌.. ఇద్దరూ వెలుగు ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు. డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో  కాస్త చదవగలిగిన, రాయగలిగిన పన్నెండు మంది మహిళలతో ‘నవోదయం’ అనే ఓ మాస పత్రికను మొదలుపెట్టించారు. వాళ్లలో ఒకరే ఎండపల్లి భారతి. తనకు వచ్చిన ఈ కొత్త గుర్తింపు ఘనతను ఆ ఇద్దరికే ఇస్తుంది భారతి. ‘‘ ముఖ్యంగా కిరణ్‌ కుమారి మేడమ్‌.. నాకు ఫ్రెండ్, గైడ్‌.. అన్నీ’’ అంటుంది.  నవోదయం.. భారతికే కాదు మిగిలిన పదకొండు మంది మహిళలకూ కొత్త గుర్తింపును ఇచ్చింది. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచింది. ‘‘ఏదో రాస్తారట.. ’’ అని పెదవి విరిచిన వాళ్లే  ఈ గ్రామీణ మహిళా విలేకర్లు రాస్తున్న వార్తలను కుతూహలంగా చదువుతున్నారు. బైక్, కారు నడుపుతున్న భారతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. 

పేపర్, పెన్నుతోనే కొంగుముడి
ఆవులు.. సేద్యం.. అక్షరం.. ఇవే భారతి పనులు.. వ్యాపకాలూ. పేపర్, పెన్నూ ఆమె కొంగుతో ముడిపడే ఉంటాయి. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు పేపర్‌ తీసి రాస్తుంది.. ఆవులు మేపేందుకు వెళ్లినా.. పొలం పనులు చేస్తున్నా! అలాంటి తలపోతకే ఆ తర్వాత కథా రూపం ఇస్తుంది. ‘‘డబ్బు కూడబెట్టే కంటే అక్షరం కూడబెడితే ముందు తరాల వాళ్లకు ఎంతోకొంత లాభం. జీవితం తెలుసుకుంటారు. నేను చూసింది.. విన్నది.. అనుభవించిందే రాస్తాను. ఊహించి రాయలేను. మనుషులే నాకు ఇన్‌స్పిరేషన్‌. తాతా, అవ్వ వయసున్న వాళ్లతో ఎక్కువగా మాట్లాడ్తాను. వాళ్ల అనుభవాలే నా కథా వస్తువులు.  నా కథలను చదివి ఫస్ట్‌ మా పిల్లలు నవ్వారు.. ఇట్లా మన మాండలికంలో రాస్తే.. ఎవరు చదువుతారు? అని. పుస్తకంగా వచ్చి.. అమ్ముడు పోయేసరికి ఇప్పుడు గొప్పగానే చూస్తున్నారు (నవ్వుతూ).  డెబ్బై కథలు రాశా. వ్యవసాయదారుల సాదక బాధకాలనూ కథలుగా రాసి పుస్తకంగా తేవాలనుంది. ఇప్పటికే ఓ పది రైతు కథలు రాశా’’ అని చెప్పింది భారతి. 

భవిష్యత్‌ కన్నా వర్తమానంలో బతకడమే ఇష్టపడే భారతి షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ కూడా. ఇప్పటివరకు అయిదు షార్ట్‌ ఫిల్ములు తీసింది. జాతీయ స్థాయి సమావేశాల్లో వాటిని ప్రదర్శించింది కూడా. ‘‘సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్లెందరో సమాజానికి తెలియకుండానే పోయారు. నేనేం చేశానని నాకు ఈ గుర్తింపు? అనిపిస్తుంటుంది’’ అని అంటుంది భారతి.  మహిళల మీద జరుగుతున్న దాడులపై స్పందిస్తూ ‘‘చుట్టూ నిప్పు పెట్టి జాగ్రత్తలు చెబితే ఎలా కుదురుతుంది? ఆ నిప్పును ఆర్పే పనే కాదు.. ఇంకెప్పుడూ ఎవరు నిప్పు పెట్టకుండా చూసే బాధ్యతను మనం తీసుకోవాలి. అప్పుడే ఆడవాళ్లు క్షేమంగా ఉంటారు’’ అంటుంది భారతి. 


– సరస్వతి రమ

మరిన్ని వార్తలు