బుందేల్ టు బందర్

14 Jun, 2016 23:43 IST|Sakshi
బుందేల్ టు బందర్

సో స్వీట్

 

‘‘ష్‌ష్‌ష్ ... పెద్దగా అరవకండి. మా బందరమ్మాయి అంటే చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. లక్షణమైన పిల్ల అని అర్థమైపోతుంది. మీకు మరో సంగతి తెలుసా? మా బందరమ్మాయిలందరూ బందరులోనే పుడతారు’’  ... అంటూ మురిసిపోతూ నవ్వుతాడు కోట శ్రీనివాసరావు.. ‘ష్.. గప్‌చుప్’ సినిమాలో.

 
‘బందరులో పుట్టడం వల్లనే కదా బందరమ్మాయి అవుతుంది... ఇదో పెద్ద జోకు... హు...’ అనిపించినా సరే... కోట హావభావాలు నిజంగానే నవ్విస్తాయి. ఆ సినిమాలో ఆయన చాలా స్ట్రిక్టు పోలీస్ ఆఫీసర్. అయితే ఆయనకు బందరు బలహీనత ఎంతంటే... బందరు లడ్డు తియ్యదనమంత. మచిలీపట్నం వచ్చిన ప్రముఖులంతా తాతారావు స్వీట్ షాప్‌లో బందరు మిఠాయి రుచి చూడకుండా వెళ్లరనేది ప్రతీతి. అందుకు తగ్గట్లే ఆ షాపులో లడ్డు రుచి చూస్తున్న నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, వైఎస్‌ఆర్, రోశయ్య తదితరుల ఫొటోలున్నాయి.

 
ఎవరు నేర్పారీ విద్యను!

ఇదంతా బాగానే ఉంది... పూసను దంచి లడ్డు చేయడం అనే ప్రత్యేకమైన విధానం ఈ ఊరికి మాత్రమే ఎలా పరిమితమైంది? మచిలీపట్నంలోని వీధులను చూస్తూ ఈడేపల్లి సన్నని రోడ్డు వైపు  మళ్లగానే... ఆ వరుసలో ఒక స్వీట్ షాపు.  అధునాతనంగా కట్టిన ఆ దుకాణం ముందు వరండాలో ఓ తోపుడు బండి ఉంది, బండికి టైర్లు లేవు. దాని మీద ‘మల్లయ్య మిఠాయి బండి - 1958’ అని రాసి ఉంది. బండి మీద అద్దాల అరల్లో స్వీట్లు, చెగోడీలు, పకోడీలున్నాయి. బండి ముందు వెంకటేశ్వర్రావు. ‘రండి... రండి’ అంటూ పలకరించి, ‘ఇది మా నాన్న మల్లయ్య సొంతంగా మిఠాయి వ్యాపారం చేసినప్పటి బండి. ఆయన జ్ఞాపకంగా దీనినే కౌంటర్‌గా మార్చుకున్నాను’ అంటూ కిటికీలో ఉన్న ల్యామినేటెడ్ ఫొటో చూపించారు.

 
అందులో ఇనుప బాణలిలో నుంచి బూందీ తీస్తున్న పెద్దాయన, ఇంకా మరికొంత మంది ఫొటోలు ఉన్నాయి.  ‘‘ఈయనే మా నాన్న. బండి పెట్టక ముందు ఆయన వీరి స్వీట్ షాపుల్లో పని చేశారు. వీళ్లు ఆయనకు పని నేర్పిన గురువులు. వాళ్లకు పని నేర్పిన వాళ్లు బుందేల్ సింగులు. వాళ్లనే బొందిలీలు అంటారిక్కడ’’ అన్నారు వెంకటేశ్వర్రావు. హమ్మయ్య!! ఆధారం దొరికింది. ఇక వివరాలు తెలియాలి.

 
రాజపుత్రుల రుచులు!

మచిలీపట్నానికి ఈ లడ్డును పరిచయం చేసింది బుందేల్‌ఖండ్ రాజపుత్రులు. శత్రుదాడులతో రాజపుత్రుల రాజ్యాలు బలహీనమయ్యాయి. చిత్తోడ్‌లో ఉదయ్‌సింగ్ వంటి వారు అడవుల్లో తలదాచుకుని తిరిగి సైన్యాన్ని సమీకరించుకుని ముస్లిం పాలకుల మీద దాడి చేసి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది అందరికీ సాధ్యం కాలేదు. అలా రాజ్యాలు కోల్పోయి వచ్చిన వాళ్లే ఈ బుందేల్‌ఖండ్ రాజపుత్రులు కూడా. కుటుంబాలు, బంధుగణంతో ఉత్తరాది నుంచి పారిపోయి వింధ్య పర్వతాలు దాటి దక్కనులో స్థిరపడ్డారు. అలా ఒక్కొక్క సమూహం ఒక్కో చోట స్థిరపడిన క్రమంలో ఒక కుటుంబం బందరు చేరింది. వాళ్లు బుద్ధూసింగ్, నారాయణ్ సింగ్, నాథ్‌సింగ్, జగన్నాథ్ సింగ్, ఠాకూర్‌సింగ్... ఐదుగురు సోదరులు.

 
కత్తి- డాలు అన్నం పెట్టాయి!
వచ్చారు సరే... బతకడానికి ఏం చేయాలి? యుద్ధం చేయడం తప్ప సేద్యం చేయడం తెలియదు. సముద్రం మీదకెళ్లి చేపలు పట్టడమూ చేతరాదు. ఎక్కడ నివసించే వారికైనా సరే... తినడానికి తగినట్లు రుచిగా వండుకోవడం వచ్చి ఉంటుంది. అదే వారికి బతుకుతెరువైంది. అందరి దగ్గరా యుద్ధం చేసే కత్తి, డాలు ఉన్నాయి. వాటినే అన్నం పెట్టే సాధనాలుగా మార్చుకున్నారు. ఒక డాలును నెయ్యి కాచే బాణలిగా మార్చుకున్నారు. ఒక డాలుకు కత్తితో చిల్లులు పెట్టారు. శనగపిండిని జారుడుగా కలిపి ఆ డాలులో పోసి తిప్పితే పూస పడుతుంది. మరొక డాలుకు చిల్లులు పెట్టి పూస తీసే గిన్నె (గరిట)గా మార్చుకున్నారు. బెల్లం పాకంతో లడ్డు తయారు చేశారు. గోధుమపాల హల్వా, బెల్లం జిలేబి, మిఠాయి, గుల్ల పకోడి... అన్నీ వారి వంటకాలే.

 
మరి మిఠాయిలకు పేరు!

రాజపుత్రులు తమను ‘బుందేలులు’గా పరిచయం చేసుకున్నారు. అది బొందిలీలుగానూ, వారి లడ్డుకు బొందిలీల లడ్డు, బొందిలి మిఠాయిలు అనే పేరొచ్చింది. బయట ఊర్ల వాళ్లు మాత్రం బందరు లడ్డు అంటారు’’ అని చెప్పారు వెంకటేశ్వర్రావు.  బందరు లడ్డు మిస్టరీ వీడింది. అన్నట్లు స్వీట్ల చరిత్రలో బందరు లడ్డుకు మరో విశేషం కూడా ఉంది. 1998లో బందరులడ్డు డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేశారు వెంకటేశ్వర్రావు. స్వీట్ల కోసమే కేటాయిచిన తొలి వెబ్‌సైట్ అది. కంప్యూటర్ ఇల్లిటరేట్ అయిన వెంకటేశ్వర్రావు ఇందుకోసం మద్రాసుకెళ్లి రెండు లక్షలు ఖర్చు పెట్టి వెబ్‌సైట్ తెరిచారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (మచిలీపట్నం నుంచి)

 

 
లడ్డు తయారీకి 12 గంటలు

బందరు మిఠాయిలన్నీ బెల్లంతోనే చేస్తారు. చక్కెర వాడరు. లడ్డు కోసం... శనగపిండిని జారుడుగా కలిపి నేతిలో పూసను దోరగా కాల్చి చల్లార్చాలి. చల్లారిన పూసను రోట్లో వేసి దంచాలి. ఆ దంచిన పొడిని బెల్లం పాకంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టి మళ్లీ దంచాలి. ఆ తర్వాత ఉండకట్టాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి పన్నెండు గంటలు పడుతుంది. పాళ్లు మాత్రం రహస్యం.

 - వెంకటేశ్వర్రావు, మల్లయ్య స్వీట్ షాప్, మచిలీపట్నం

 

 

మరిన్ని వార్తలు