ఫ్యామిలీ ఆల్బమ్‌

11 Jun, 2018 00:42 IST|Sakshi

సందర్భం

సోషల్‌ మీడియా ఒక తక్షణ ‘షేరింగ్‌’ సాధనం అయ్యాక.. వ్యక్తిగతమైన భావోద్వేగాలు బహిరంగ ప్రదర్శనలు అవుతున్నాయి.  క్షణాల్లో సగటులు సెలబ్రిటీల్లా, సెలబ్రిటీలు సగటుల్లా మారిపోతున్నారు.

నాన్న ప్రేమను చూపించడు. అమ్మ ప్రేమను దాచుకోదు. ఇది మన సంస్కృతి. మన పద్ధతి. మన పెద్దరికం. నాన్నకు ప్రేమ లేకుండా ఉంటుందా! ఉంటుంది. లోపలెక్కడో ఉంటుంది. బయటికి రాదు. బుగ్గ గిల్లదు. ముద్దు పెట్టుకోదు. హగ్‌ చేసుకోదు. గొంతెక్కి తొక్కనివ్వదు. ఈ గోములు, గారాలు మనకు ఊహ తెలియనప్పుడేమైనా చేసి ఉంటాడేమో నాన్న! పెద్దవుతున్నప్పుడు లిమిట్స్‌లో పెట్టేస్తాడు. లిమిట్స్‌లో పెడతాడా? లిమిట్స్‌లో ఉంటాడా? రెండూ కాదు. ప్రేమను లిమిట్‌ చేసేస్తాడు. ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ లవ్‌’ ఉండదు. ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ అఫెక్షన్‌’ ఉండదు. ముద్దూ మురిపాలకు రేషన్‌. రేషనైనా  నెలనెలా దొరుకుతుంది. నాన్న.. తన దగ్గరకు రానివ్వడమే మహద్భాగ్యం. నాన్న తన భుజాన్ని ఎక్కనివ్వడమే ఎవరెస్టు విజయం. డెబ్బయ్యా రేళ్లకోసారి మాత్రమే సంభవించే విశ్వాంతరాళ అద్భుతాల్లాంటివివి! దూరం నుంచి ‘ఊ’ అని గంభీరంగా అనే మాటొక్కటే ఆయన కనబరిచే ప్రేమ! ‘నాన్నా.. మా స్కూల్లో’.. ‘ఊ’; నాన్నా క్లాస్‌లో.. ‘ఊ’; ‘నాన్నా.. క్రికెట్‌లో నేను’.. ‘ఊ’! 

నాన్నెందుకు ఇంత సీరియస్‌? సీరియస్‌ కాదు. అమ్మలా బయట పడడు. అమ్మలా ఆకాశానికి ఎత్తేయడు. అమ్మలా ముద్ద కలిపి నోట్లో పెట్టడు. అమ్మలా వీపు మీద ఎక్కించుకోడు. జ్వరం వస్తే అమ్మలా రాత్రంతా దగ్గరే కూర్చోడు. అన్నీ దూరం నుంచే చేస్తుంటాడు! పేపర్‌ చదువుతూనో, ఇంటికి తెచ్చుకున్న ఆఫీస్‌ వర్క్‌ చేసుకుంటూనో అన్నీ గమనిస్తూనే ఉంటాడు. అమ్మ ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఆకాశం తలకు తగలదు కదా అని చూస్తుంటాడు. అమ్మ ముద్ద కలిపి పెడుతున్నప్పుడు మూతి, ముఖం తిప్పుకుంటున్న బిడ్డ ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకుంటాడు. అమ్మ వీపు మీద నుంచి కిందికి దూకేటప్పుడు ఏ టీపాయ్‌ ఎడ్జికైనా కొట్టుకుంటాడేమోనని ఓ కన్నేసి ఉంచుతాడు. జ్వరం వస్తే ఎందుకొచ్చిందీ, ఏం తిన్నదీ, ఎక్కడ నీళ్లు తాగిందీ ఆలోచిస్తాడు. పాత ప్రిస్క్రిప్షన్‌లు, మెడికల్‌ రిపోర్టులు తీసి చూస్తుంటాడు. ఇంతవరకే! ఇవి దాటి నాన్న ప్రేమ బయటికి వచ్చేయదు. అమ్మయినా, ఇంత ముద్దు చేస్తుంది కదా.. బయటివాళ్ల ముందు మాత్రం నాన్నలాగే మారిపోతుంది. నాన్న.. మనసులో అమ్మయిపోయినట్లే, అమ్మ నలుగురిలో నాన్నయిపోతుంది! మహాస్ట్రిక్ట్‌. గంభీరం. ఇది మన సంప్రదాయం. ఇదే అమ్మానాన్నలు మనల్ని పెంచిన విధానం.

ఇప్పుడు మరీ అంత స్ట్రిక్ట్‌ యాక్షన్‌ ఏం లేదు. అమ్మైనా, నాన్నైనా బాహాటంగా పిల్లలపై ప్రేమను చూపించడం, ప్రేమను చూపించుకోవడం మామూలు విషయమైపోయింది. ముద్దుల్నైనా, మురిపాల గుద్దుల్నైనా పదిమందితో ‘షేర్‌’ చేసుకుంటున్నారు. ఎవరికీ తెలియని సామాన్యులు షేర్‌ చేసుకుంటున్నట్లే.. అందరికీ తెలిసిన సెలబ్రిటీలూ పిల్లలపై తమ ప్రేమ విశ్వవీక్షితం కావాలనుకుంటున్నారు. ఫ్యామిలీ అఫెక్షన్‌ని విశ్వవ్యాప్తం చెయ్యాలనుకుంటున్నారు. తప్పేం లేదు. అందరం మనుషులమే. అన్నీ హ్యూమన్‌ ఎమోషన్సే. అయితే ఈ పర్సనల్‌ అఫెక్షన్‌ కొన్నిసార్లు పబ్లిక్‌ డిస్కషన్‌ అవుతోంది. సెలబ్రిటీల విషయంలోనైతే ‘ట్రోలింగ్‌’ కూడా జరుగుతోంది. సోషల్‌ మీడియా.. షేరింగ్‌కి ఒక తక్షణ సాధనం అయ్యాక.. క్షణాల్లో సగటులు సెలబ్రిటీల్లా, సెలబ్రిటీలు సగటుల్లా మారిపోతున్నారు. ఎవరెలా మారినా పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. అది మారకుండా ఉండాలి. హద్దు అనేది ఒకటి ఉంటుంది. అది మీరకుండా ఉండాలి. అది ఎంతో స్వచ్ఛమైన తల్లిదండ్రుల ప్రేమే అయినా. ఆ ప్రేమపై నెట్‌లో మనం చేసే కామెంట్‌లైనా.  
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు