టిక్‌టాక్‌ సూపర్‌స్టార్‌

16 Nov, 2019 03:41 IST|Sakshi

అతనికి టిక్‌టాక్‌లో 20 లక్షల మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అతని ఒక్క ఫోన్‌ కాలం వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. అతనిలా టిక్‌టాక్‌ చేసే వీరాభిమానులూ ఉన్నారు. ఆ టిక్‌ టాక్‌ సూపర్‌స్టార్‌ పేరు ఇస్రాయిల్‌ అన్సారి.

‘నేను ఇక మీదట నా అభిమానులతో మాట్లాడాలనుకుంటున్నాను. దానికి ఒక్కొక్కరికీ 400 రూపాయలు చార్జ్‌ చేస్తాను’ అని అతడు పోస్ట్‌ పెట్టగానే ఆ రోజున 2000 కాల్స్‌ వచ్చాయతనికి. ముంబై నుంచి ఒక అభిమాని లక్నోకు వెళ్లి, అక్కడి నుంచి అతడి స్వగ్రామం కబీర్‌పూర్‌కు వెళ్లి, వీడియో దిగి ఆ సంగతి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నా జన్మ ధన్యమైంది అని రాసుకొచ్చాడు. ఆ అతడి పేరు ఇస్రాయిల్‌ అన్సారీ. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిరుపేద కుర్రవాడు. ఐదో క్లాసు వరకు చదువుకున్నాడు. ఇనుప సామాన్ల అంగడిలో చిరుద్యోగి. కాని ఇప్పుడతడు దేశవిదేశాల్లో తెలిసిన సూపర్‌స్టార్‌. తరచూ ముంబైలో జరిగే ఈవెంట్స్‌లో పాల్గొంటుంటాడు. ముంబైలో అతడు వీధిలో నడుస్తుంటే ప్రతి పది గజాలకు ఒకరు ఆపి అతడితో సెల్ఫీ దిగుతుంటారు.

అంత ఫేమస్‌ అతడు. ఇంతకూ ఇతను టిక్‌టాక్‌లో ఏం చేస్తాడు అనంటే హిందీ సినిమా పాటలకు గెంతులు వేస్తుంటాడు. ఆ గెంతులు అమాయకంగా ఉంటాయి. నిజానికి ఇస్రాయిల్‌ అన్సారీకి డాన్స్‌ రాదు. వేగంగా, పిచ్చి గంతులు వేస్తూ పాటకు అక్షరాభినయం చేస్తాడు. అంటే ‘కళ్లు’ అని వస్తే కళ్లు చూపించడం, కాళ్లు అని వస్తే కాళ్లు చూపించడం. కొంచెం మెల్లకన్ను, భిన్నమైన గెంతులు, అమాయకత్వం, చిత్రమైన తల కట్టు, పసుపు ఎరుపు రంగు చొక్కాలు ఇవన్నీ కలిసి ఇస్రాయిల్‌ను జనం అభిమానించేలా చేశాయి. ‘ఒక పెళ్లికి వెళితే ఎవరో ఫోన్‌లో టిక్‌టాక్‌ చూపించారు. అప్పటికి నా దగ్గర స్మార్ట్‌ ఫోన్‌లేదు. సూరత్‌లో పని చేసే మా అన్నయ్యను అడిగి తెప్పించుకున్నాను’ అంటాడు ఇస్రాయిల్‌. తండ్రికి స్వగ్రామంలో చిన్న కిరాణా షాపు ఉంది.

పది మంది సంతానంలో ఇస్రాయిల్‌ ఒకడు. జీవితంలో ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్న ఇస్రాయిల్‌ స్మార్ట్‌ఫోన్‌ రాగానే దాపున ఉన్న పొలాలకు వెళ్లి షారుక్‌ ఖాన్‌ పాటకు పిచ్చి గెంతులు గెంతి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశాడు. గంటలో 33 వేల లైకులు వచ్చాయి. అలా ఆ స్టార్‌ ఉద్భవించాడు. ఇప్పుడు ఇస్రాయిల్‌ అన్సారీ ఏ పని చేయడు. రోజుకు మూడు నాలుగు వీడియోలు తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేయడమే. దీని వల్ల వచ్చిన క్రేజ్‌తో అతడికి అభిమానుల నుంచి డబ్బులు వస్తున్నాయి. కుర్రవాళ్లు ఇతని భక్తబృందంగా మారి ఇతనిలా టిక్‌టాక్‌లు చేయడం మొదలుపెట్టారు. అయితే టిక్‌టాక్‌ను బేన్‌ చేశారని తెలిసినప్పుడు ఇస్రాయిల్‌ నడుము విరిగినట్టు అయ్యింది.

కాని దానిని ఎత్తేయడంతో సంతోషపడ్డాడు. అతడికి ఈ తాత్కాలిక ఖ్యాతి ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ‘కాని ఎంతకాలం అయినా నేను స్టార్‌గానే ఉంటాను’ అంటాడు అమాయకంగా. ఇస్రాయిల్‌ అన్సారి తిక్క డాన్సులను చూసి అతడిని ట్రోల్‌చేసేవారున్నారు. కాని వారిని చూసి ఇస్రాయిల్‌ నవ్వి ఊరుకుంటాడు. టిక్‌టాక్‌ మంచిది కాదని అభ్యంతరాలు ఉండొచ్చు. కాని లక్నో సమీపంలోని పల్లెటూరి కుర్రవాడు దాని వల్ల లబ్ధి పొందాడు. లక్షల మందిలో ఏ కొద్దిమందికే ఈ యోగం దక్కుతుంది. ఆ ఒక్కరు ఈ పేదవాడు కావడం సంతోషించాల్సిన సంగతి. యూ ట్యూబ్‌లో ఇస్రాయిల్‌ అన్సారీ టిక్‌టాక్‌ వీడియోలు చూసి ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని వార్తలు