సంస్కృతికి కళ

24 Feb, 2020 07:51 IST|Sakshi
శశికళ, సామాజిక, సాంస్కృతిక కార్యకర్త

పరిచయం శశికళ, సామాజిక, సాంస్కృతిక కార్యకర్త

సంస్కృతిని మనం బతికిస్తున్నాం అనుకుంటాం. కానీ సంస్కృతే మనిషికి బతుకునిస్తుంది. మానవ జీవితంలో కొరవడిన ఉల్లాసాన్ని కళల ద్వారా తిరిగి తీసుకొచ్చి, జీవితేచ్ఛను కలిగించేందుకు ‘గుడి సంబరాల’ పేరుతో సంగీత నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు శశికళ, ఆమె స్నేహితురాలు శ్రీనగి.

రోష్నీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ వ్యవస్థాపక సభ్యురాలు శశికళ. జీవితం ఏ పట్టాలెక్కాలో నిర్ణయించేది ఇరవైలలో ఉండే ఉత్సాహమే. ఆ వయసులోనే సోషల్‌ లైఫ్‌లోకొచ్చారు శశికళ. ‘సహాయ్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా పని చేశారు. అదే సంస్థలో పూనమ్‌ సింగ్‌ కూడా ఉండేవారు. కొన్నాళ్లకు సహాయ్‌ సంస్థ... కార్యకలాపాలను ఆపి వేసింది. అప్పుడు శశికళ, పూనమ్‌.. మరో సేవా సంస్థలో చేరడం కంటే సొంతంగా ఒక సంస్థను స్థాపించడమే కరెక్ట్‌ అనుకున్నారు. అలా ఏర్పాటైనదే ‘రోష్నీ’. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడే వారికి జీవితేచ్ఛను కలిగించడమే రోష్నీ ప్రధాన లక్ష్యం. ఆ సర్వీస్‌లో పాతికేళ్లు గడిచాయి. ఏడెనిమిదేళ్ల కిందట శశికళకు మరో ఆలోచన వచ్చింది. మనిషి మానసిక ఉల్లాసం కోసం కూడా ఏదైనా చేయాలనిపించింది. అలా రూపొందిన మరో ఫౌండేషన్‌ ‘పరంపర’. ఈ సంస్థ యేటా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రదేశాలలో ‘గుడి సంబరాలు’ నిర్వహిస్తుంటుంది.

గ్రామీణుల కోసమే
‘‘మనిషి ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ అవుతూ ఉంటే జీవితం మీద నిరాసక్తతలు తలెత్తవు. నాగరక జీవితం కోసం ఎవరైనా పట్టణాల పట్టాల్సిందే. యువత ఉద్యోగాల కోసం గ్రామాలను వదిలి నగరాలకు వలసపోకా తప్పడం లేదు. దాంతో మానసిక ఉల్లాసాన్నిచ్చే కళాప్రదర్శనలూ నగరాలకే పరిమితం అవుతున్నాయి. కళాకారులు కూడా అవకాశాల కోసం నగరాలను ఆశ్రయిస్తున్నారు. కళాప్రదర్శనలన్నీ నగరాల్లోని ఏసీ ఆడిటోరియాల్లోనే జరగుతుంటే.. గ్రామాలనే నమ్ముకుని, దుక్కి దున్ని, భూమిని సాగు చేసి పంట పండించే రైతులు, ఆ వ్యవసాయరంగంలో పని చేస్తున్న వాళ్లు... ఒక కూచిపూడి నాట్యాన్ని కానీ ఒడిస్సీ నృత్యాన్ని కానీ చూడాలంటే కుదిరే పని కాదు. అందుకే మన సంప్రదాయ కళలను వాళ్ల దగ్గరకు తీసుకెళ్లడమే మా ప్రయత్నం. కథక్, మణిపురి, మయూర్‌ భంజ్, చావ్‌ వంటి ఒరిస్సా జానపద నృత్యాలను కూడా మన గ్రామాల్లో ప్రదర్శిస్తున్నాం’’ అని చెప్పారు శశికళ, పరంపర కో ఫౌండర్‌ డాక్టర్‌ శ్రీనగి.

‘సంబరాలకు’ ప్రేరణ
శశికళది నిజామాబాద్, శ్రీనగిది వరంగల్‌. ఇద్దరివీ వ్యవసాయ కుటుంబాలే. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకూడదు, సమాజం కోసం కూడా పని చేయాల్సిన అవసరం ఉందని నమ్మే కుటుంబాలే ఇద్దరివీ. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీనగి మెడ్విన్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌. శశికళ సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్‌ నిర్వహణతోపాటు ఇతర కుటుంబ వ్యాపారాలనూ చూసుకుంటారు.
‘‘ఓసారి హంపి ఉత్సవాలు చూడడానికి వెళ్లినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉత్సవాలు జరగడం లేదనిపించింది. కర్నాటకలో హంపి ఉత్సవాలే కాదు, హొయసల మహోత్సవాలు కూడా ఉంటాయి. ఖరజురహో ఉత్సవాలు, కోణార్క్‌ డాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ అయితే దేశవిదేశాల్లో కూడా ప్రసిద్ధి. ఇక కేరళ, తమిళనాడు కూడా ఏ మాత్రం తీసిపోవు. మన దగ్గర కళలు లేవని కాదు, ఆదరణ తక్కువని చెబుతున్నాను. ఎవరైనా ముందుకు వచ్చి కళల కోసం ఏదైనా చేస్తే బావుణ్నని అనిపించింది. హైదరాబాద్‌ వచ్చాక నా ఫ్రెండ్స్, బంధువులు... అందరితో షేర్‌ చేసుకున్నాను. వాళ్లను ప్రభావితం చేయాలన్నంత పట్టుదలతో చెప్పాను. వాళ్లందరిలో ముందుకు వచ్చింది ఒక్క శ్రీనగి మాత్రమే. తను డాక్టర్‌ కాబట్టి పూర్తి సమయాన్ని కేటాయించడం కష్టం. దాంతో ‘ఇద్దరం కలిసి చేద్దాం’ అన్నది శ్రీనగి. అలా 2015, ఆగస్టు 15వ తేదీన పరంపర ఫౌండేషన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి’’ అని వివరించారు శశికళ.

ప్రదేశాల ఎంపిక
గుడి సంబరాలు ఏటా సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు జరిగేవి. ఏడాదికి ఎనిమిది నుంచి పన్నెండు ప్రదర్శనలే ఉండేవి. ఈ ఏడాది పదిహేడు ప్రదర్శనలు ఉండడంతో సంక్రాంతికి ముందే మొదలు పెట్టి శ్రీరామనవమితో పూర్తి చేస్తున్నాం. ఇవి పూర్తి అయిన తర్వాత పూర్తి సమయం రోష్నీ సేవలకే. మిగిలిన టైమ్‌లో వచ్చే ఏడాది గుడి సంబరాల కోసం ప్రదేశాల ఎంపిక కోసం ఫీల్డ్‌ టూర్‌లుంటాయి. ఏడాదంతా పనిలోనే ఉంటాను. ఏదో ఒక పనిలో నిమగ్నం కాకపోతే రోజును వృథా చేశామనిపిస్తుంది’’.– శశికళ,రోష్నీ, పరంపర సంస్థల వ్యవస్థాపక సభ్యురాలు

సంబరాల వేదికలు
నలభై ఏళ్లకే పన్నెండు జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, మానస సరోవరం, అమర్‌నాథ్‌ యాత్రలు పూర్తి చేశాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలోనూ చిన్న చిన్న గుళ్లు కూడా చూసేశాను. ఆ యాత్రల అనుభవం ఇప్పుడు గుడి సంబరాల వేదికల ఏర్పాటులో బాగా ఉపయోగపడుతోంది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పురాతన కట్టడాలే మాకు వేదికలు.– శ్రీనగి, గుడి సంబరాలు నిర్వహకురాలు

పేరు కోసం పరిశోధన
‘‘మేము చేపట్టినది తెరమరుగవుతున్న మన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అందుకోసం సంస్కృతం నుంచి తెలుగు నుడికారాల వరకు మాకు తెలిసిన ఎన్నో పేర్లు అనుకున్నాం. చివరికి ‘పరంపర – గుడి సంబరాలు’ అని నిర్ధారించుకున్నాం. నిజానికి గుడి పెద్ద సామాజిక క్షేత్రం. ఆలయాల ప్రాంగణంలో సామూహిక కార్యక్రమాల కోసం వేదిక ఉంటుంది. ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు సమావేశాలకు వేదిక కూడా ఆలయ మండపమే. నగరాల్లోని ఆడిటోరియాలకు పరిమితమవుతున్న కళలను గ్రామాలకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఇవి టిక్కెట్ల ప్రదర్శనలు కావు, పూర్తిగా ఉచితం. పూర్వం కళలను పోషించడానికి రాజులుండేవాళ్లు. ఇప్పుడు కళల ఆదరణకు పూనుకోవాల్సిన బాధ్యత అందరిదీ. అందుకే ఇష్టంగా మొదలు పెట్టాం. మాకు చేతనైనట్లు, చేయగలిగినంత చేయగలుగుతున్నాం. శంషాబాద్‌ దగ్గర అమ్మపల్లిలో ఉన్న స్టెప్‌వెల్‌లో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మన దగ్గర అలాంటి బావులున్నాయనే సంగతిని తెలియచేయగలిగాం. కొండపల్లి కోటలో నాట్య ప్రదర్శనను పదిహేను వందల మంది చూశారు. అంటే అంతమందికీ మన చారిత్రక కట్టడాన్ని కూడా దగ్గర చేయగలిగామనే అర్థం. ఇలాంటివి ఇంకా చేస్తాం’’ అన్నారు శశికళ, శ్రీనగి.– వాకా మంజులారెడ్డిఫొటోలు: జి. అమర్‌

>
మరిన్ని వార్తలు