ఊరు వెలుగుతోంది!

5 Oct, 2014 23:57 IST|Sakshi
ఊరు వెలుగుతోంది!

వికాసం
కంప్యూటర్లు, వైఫైలు అంటూ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక అభివృద్ధి పరుగులు తీస్తుంటే... కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ విద్యుత్ వెలుగులు కూడా లేక చీకట్లో అల్లాడుతున్నాయి. బీహార్‌లోని ధర్నాయ్ గ్రామానిది కూడా మొన్నమొన్నటి వరకూ అదే పరిస్థితి. కానీ ఇప్పుడా ఊరు మారిపోయింది. దీపకాంతితో వెలిగిపోతోంది. ఆ ఆనందం కోసం ముప్ఫయ్యేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది!
 
ఒకప్పుడు ధర్నాయ్ గ్రామంలో సాయంత్రమవుతుంటే చాలు... చీకటితో పాటు నిశ్శబ్దం కూడా కమ్ముకునేది. సూర్యుడు కాస్త చల్లబడగానే పిల్లలు ఆటలాపి ఇళ్లకు పరుగులుదీసేవారు. పురుషులు పనులు ముగించుకుని బయలుదేరేవారు. ఇల్లాళ్లు వంటలు ముగించి దీపపు చిమ్నీలను శుభ్రం చేసుకుంటూ కూర్చునేవారు. ఎందుకంటే... సూర్యుడు ఒక్కసారి ముఖం చాటేశాక ఆ ఊరిలో అంధకారం అలముకునేది. కరెంటు లేదు. దీపపు కాంతితో పనులు చేసుకోవడం అంత తేలికా కాదు. అందుకే సూర్యుడు అస్తమించకముందే అన్ని పనులూ ముగించుకునేవారు. కానీ ఇప్పుడా బాధ తప్పింది. ఆ ఊరు వెలుగుతోంది. నిజానికి ధర్నాయ్‌లో ఇంతవరకూ కరెంటు లేదని కాదు. ఒకప్పుడు ఉండేది. అయితే నక్సల్ ప్రభావిత గ్రామం కావడంతో, 1981లో మావోయిస్టులు సృష్టించిన హింసాపాతానికి అక్కడి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది.

ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. కేబుళ్లు కాలిపోయాయి. ఊరంతా చీకటైపోయింది. కానీ ప్రభుత్వం ఆ చీకటిని పారద్రోలే ప్రయత్నం చేయలేదు. దాంతో ముప్ఫయ్యేళ్ల పాటు వాళ్లు అలా అవస్థ పడుతూనే ఉన్నారు. వారి కష్టాలను చూసిన గ్రీన్‌పీస్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ... ఇటీవలే వంద కిలోవాట్ల సోలార్ పవర్ మైక్రో గ్రిడ్‌ను వేయడంతో, ఆ గ్రామంలోకీ వారి జీవితాల్లోకీ కూడా వెలుగు వచ్చింది.
 
గ్రీన్‌పీస్ సంస్థ పుణ్యమా అని 450 ఇళ్లు, 50 దుకాణాలు, రెండు స్కూళ్లు, ఓ ఆసుపత్రి, ఓ రైతుశిక్షణా కేంద్రం, అరవై వీధి దీపాలు నిరాటంకంగా వెలుగుతున్నాయి. దాంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అర్ధరాత్రి వరకూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. గృహిణులు ప్రశాంతంగా ఇంటి పనులు చక్కబెట్టుకుంటున్నారు. పిల్లలు రాత్రికి భయపడటం మానేసి పొద్దుగుంకేవరకూ ఆడుకుంటున్నారు. అందరూ కలిసి గ్రీన్‌పీస్ సంస్థకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు!
 
 నిజానికి సోలార్ విద్యుత్ ద్వారా తమ జీవితాలు బాగుపడినా, తమకు అసలైన విద్యుత్ కావాలంటూ గ్రామస్థులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. భవిష్యత్తు అంతా సోలార్ మీదే ఆధారపడి ఉందని, దేశమంతా సోలార్ పవర్‌ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు, నాయకులు నచ్చజెప్పినా వారు తృప్తి చెందలేదు.  దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే ధర్నాయ్‌లో మామూలు విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు.

మరిన్ని వార్తలు