ఒక్కోసారి రాత కూడా మారొచ్చు

2 Mar, 2018 00:34 IST|Sakshi

చెట్టు నీడ

సైనికులు అంగీకారంగా  తలూపారు. నొబునాగ  ఆలయంలోకి వెళ్లి ప్రార్థన చేసి  వచ్చాడు. సైనికులు ఉత్కంఠగా  ఎదురు చూస్తున్నారు. 

పదహారవ శతాబ్దంలో జపాన్‌లో ఒక యుద్ధవీరుడు ఉండేవాడు. ఆయన పేరు నొబునాగ. ఒకసారి అనుకోని విధంగా యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. తీరాచూస్తే శత్రువు దగ్గర వున్న సైన్యంలో తన దగ్గరున్నది పదో వంతు మాత్రమే అని గ్రహించాడు. అయినప్పటికీ ఆ పోరులో గెలుస్తాననే ఆయన విశ్వసించాడు. కానీ సైనికులకు నమ్మకం లేదు. వాళ్లు అధైర్యపడ్డారు.  రణరంగానికి తరలి వెళ్తుండగా, మార్గ మధ్యంలో వాళ్లకో ఆలయం కనబడింది. ‘అయితే ఒక పనిచేస్తాను’ అన్నాడు నొబునాగ. ‘నేను ముందు వెళ్లి ప్రార్థన చేసివస్తాను. వచ్చాక ఒక నాణేన్ని ఎగరవేస్తాను. బొమ్మ పడిందంటే మనం ఈ పోరాటంలో గెలిచినట్టే. బొరుసు పడిందా ఓడినట్టు. మన రాతను విధే నిర్ణయిస్తుంది’.

సైనికులు అంగీకారంగా తలూపారు. నొబునాగ ఆలయంలోకి వెళ్లి ప్రార్థన చేసి వచ్చాడు. సైనికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నొబునాగ నాణేన్ని ఎగరవేశాడు. బొమ్మ పడింది. సైనికుల ముఖాలు వెలిగిపోయాయి. ఉత్సాహంతో ముందుకు సాగారు. అలవోకగా శత్రువును మట్టి కరిపించి, విజయోత్సాహంతో తిరిగొచ్చారు.వస్తుండగా దారిలో, నొబునాగ వ్యక్తిగత సేవకుడు ‘విధిరాతను మార్చడం ఎవరికి మాత్రం తరమవుతుంది?’ అన్నాడు, తమ గెలుపునకు విధే కారణమన్నట్టుగా. ‘అవున్నిజమే’ అన్నాడు నొబునాగ, రెండువైపులా బొమ్మ ఉండేలా చేయించిన ఆ ప్రత్యేక నాణేన్ని నవ్వుతూ చూపిస్తూ.

మరిన్ని వార్తలు