సమస్యల సుడిగుండం నుంచి బయట పడటానికి...

26 Nov, 2017 00:48 IST|Sakshi

లౌకిక జీవితంలో ఎన్నో ఈతిబాధలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కోరకం సమస్యలు ఉంటాయి. గ్రహబలం, దైవానుగ్రహం తోడైతే సమస్యలు కొంతకాలం ఇబ్బందిపెట్టినా తేలికగానే అవి సమసిపోతాయి. గ్రహబలం బాగులేకున్నా, దైవానుగ్రహానికి దూరమైనా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లే అనిపిస్తుంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వీటిని అధిగమించడానికి...
ఆత్మీయులతో విభేదాలు తొలగిపోవాలంటే, ఇంట్లో చదరంగం బల్లలు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చదరంగం ఆడే అలవాటు ఉంటే, ఆట ఆడే సమయంలో తప్ప మిగిలిన సమయంలో చదరంగం బల్ల బయటకు కనిపించకుండా దాచేయండి.
 ఇంట్లో ఎదిగిన పిల్లలు పనీపాటా లేకుండా వృథా కాలక్షేపం చేస్తుంటే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుపై ఆందోళన చెందుతారు. పిల్లలపై ప్రతికూల శక్తుల ప్రభావం తొలగి, వారు క్రియాశీలంగా మారాలంటే... ఉడికించిన రాజ్‌మాలు, అన్నం ఆవులకు తినిపించాలి. మూడు గురువారాలు ఇలా చేయాలి. ఆ రోజుల్లో పరిహారం పాటించేవారు కూడా రాజ్మాలు, అన్నం మాత్రమే తినాలి.
ఉద్యోగయత్నాలు వరుసగా విఫలమవుతున్నట్లయితే ఎంతో నిరుత్సాహంగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే, చవితి, నవమి, చతుర్దశి తిథులలో వచ్చే శనివారం రోజున ఉదయం రావిచెట్టు నుంచి చిన్న కొమ్మను సేకరించాలి. ఇలా సేకరించేటప్పుడు చంద్రబలం బాగుండేలా చూసుకోవాలి. ఇష్టదేవతా విగ్రహం ముందు ఆ కొమ్మను ఉంచి పంచోపచారాలతో పూజించాలి. తర్వాత దానిని ఎర్రని వస్త్రంలో చుట్టి మెడలో గాని, కుడిచేతి భుజానికి గాని ధరించాలి.

– పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు