కట్టుబాట్లు

16 Sep, 2019 01:23 IST|Sakshi

కుర్తీ మోకాళ్ల కింది దాకా ఉండాలి.. మోచేతుల దాకా స్లీవ్స్‌ ఉండాలి..చున్నీ వేసుకోవాలి..జీన్స్‌ మీదకి టీ షర్ట్‌ కూడదు..చున్నీ ఏది?ఆడవాళ్ల వస్త్రధారణ మీద ఎందుకంత పట్టు?ఏం వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి?అనే ఆంక్షలు వాళ్ల మీదే ఎందుకు?సంస్కృతీసంప్రదాయ పరిరక్షణ భారం వాళ్ల నెత్తి మీదే ఎందుకు?ఏ అవమానం ఎదురైనా.. ప్రమాదంజరిగినా వాళ్ల దుస్తులకే ఎందుకు శిక్ష?కట్టూబొట్టూ తీరు నుంచి లైంగికేచ్ఛదాకా స్త్రీల స్వేచ్ఛ, హక్కుల కోసంపోరాడుతున్న కొంతమంది కళాకారుల గురించి...

అవతలి వ్యక్తి  క్రమశిక్షణారాహిత్యాన్ని, అహంకారాన్ని, మానసిక చపలత్వాన్ని  అమ్మాయిలు తాము వేసుకునే బట్టలతోనే  అడ్డుకోవాలి.. వీలైతే ఆ డ్రెస్‌కోడ్‌తోనే వాళ్లను సంస్కరించాలి.. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా?’’అంటారు కొందరు సామాజిక విశ్లేషకులు. ‘ఆడపిల్లలకు డ్రెస్‌ కోడ్‌ పెట్టినట్టు.. మగవాళ్లకు ప్రవర్తనా నియమావళి ఎందుకు ఉండదు?’ అని ప్రశ్నిస్తోంది ఇంజనీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థిని.  ‘‘అమ్మాయిల కట్టు, బొట్టు, మాట, నడక.. అన్నిటి మీద రిస్ట్రిక్షన్సే.. వాటిని కాదని నచ్చినట్టు ఉంటే క్యారెక్టర్‌ లేదని.. ఫలానా అని.. లేబుల్స్‌ వేస్తారు’’ ఇంకో అమ్మాయి అసహనం.కరెక్ట్‌ పాయింట్‌ దగ్గరే అసహనం వెలిబుచ్చిందీ అమ్మాయి.. లేబ్లింగ్‌! ‘‘ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు టాపిక్‌ను? డ్రెస్‌ కోడ్‌కి లేబ్లింగ్‌కు లింక్‌ ఏంటి? మంచి బట్టలు వేసుకుని రండి అనడం కూడా తప్పేనా’’ అని విరుచుకు పడొద్దు.

‘‘మంచి అమ్మాయి’కి పురాణాలు, కావ్యాలు, కథలు, సినిమాలు ఇప్పుడైతే సీరియల్స్‌ ఇచ్చే నిర్వచనం..  నిండుగా బట్టలు వేసుకొని, వంచిన తల ఎత్తకుండా, నవ్వును పెదవులు దాటనివ్వకుండా, దుఃఖాన్ని మాత్రం పొంగి పొర్లిస్తూ, ఆత్మవిశ్వాసం అనే పదం తెలియకుండా, వెన్ను మీద పరాధీనతను మోస్తూ జీవితాంతం వంగి ఉండడం! దీనికి భిన్నంగా ఏ ఆడపిల్ల కనిపించినా ‘లేబుల్‌’ వేయడమే! ఆడవాళ్లు తమ చట్రంలోనే ఉండాలంటే ‘లేబుల్‌’ బూచీ చూపించాల్సిందే. దానికి డ్రెస్‌ కోడ్‌ మంచి ఊతం. తమ శరీరం, తమ అభిరుచి అనే  స్వేచ్ఛను హరించాల్సిందే! వీటికి పైన చెప్పిన  ‘కళ’లన్నీ వంత పాడినవే! చట్రాన్ని మరింత బిగించినవే. అసలు ఆ లేబుల్‌కు రూపమిచ్చినవే అవి. ఆ కళలతోనే ఆ సంప్రదాయాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది కళాకారిణులు. ఈ సందర్భంగా వాళ్ల పరిచయం..

హాటీ  కాదు స్మార్ట్‌  
‘‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్, చోళీ కే పీచే క్యా హై’’ అంటూ ఆడవాళ్లను వస్తువులుగా, సెక్స్‌ సింబల్స్‌గా చేసి పాటలు రాయడం.. స్టెప్పులు వేయించి.. కాసులు కురిపించుకోవడం భారతీయ సినిమా అలవోక వ్యవహారం. ఇలాంటి వాటికి తన ర్యాప్‌తో ఝలక్‌ ఇచ్చింది లిల్లీ సింగ్‌. ఆడవాళ్ల శరీరాకృతిని కాదు ఆమె ఆత్మవిశ్వాసాన్ని వర్ణించమని.. ఆబ్జెక్ట్‌లా కాదు మనిషిలా చూడమని.. కట్టూబొట్టూ తీరుతో జడ్జ్‌ చేయొద్దని.. లేబుల్‌ వేయొద్దని.. మగవాళ్ల నిగ్రహలేమికి ఆడవాళ్ల కట్టూబొట్టూ తీరుని కారణంగా చూపొద్దని.. రంగు, కొలతలతో బేరీజు వేయొద్దని.. ఎలా ఉన్నా ఆమె ఇష్టాన్ని అభిరుచిని, వ్యక్తిత్వాన్ని గౌరవించమని  చాలా ఘాటుగా జవాబిచ్చింది.

లిల్లీ సింగ్‌. ‘సూపర్‌ ఉమన్‌’ అనే పేరున్న యూట్యూబర్‌ ఆమె. కెనడాలో పుట్టి పెరిగిన భారతీయురాలు. తన రచనలు, షోలతో ఫోర్బ్స్‌ ప్రతిభావంతుల జాబితాలో పేరు సంపాదించుకుంది.  బై సెక్సువల్‌నని తన సెక్సువాలిటీని బాహటంగా  ప్రకటించుకున్న ధీశాలి. ఎన్‌బీసీ (నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ) నైట్‌ షోకి హోస్ట్‌గా ఎంపిక చేసింది ఆమెను. ఎన్‌బీసీ నైట్‌ షోను నిర్వహించబోతున్న తొలి మహిళ  లిల్లీ సింగ్‌. ఇందాక చెప్పుకున్న తాజా ర్యాప్‌ ‘‘కాల్‌  మీ స్మార్ట్‌ బిఫోర్‌ యు కాల్‌ మీ హాటీ’’ అనే వీడియోతో వార్తా విశేషంగా మారింది. స్టీరియోటైప్‌ భావాలు, భావనలు, అభిప్రాయాలను బ్రేక్‌ చేస్తోంది.

బ్రేక్‌ ది సైలెన్స్‌
అంటోంది ఝీల్‌ గొరాడియా. పాతికేళ్ల ఈ ఆర్టిస్ట్‌.. స్త్రీల పట్ల వివక్షను, జరుగుతున్న అన్యాయాన్ని తన పెయింటింగ్స్‌ ద్వారా ఎత్తి చూపుతోంది. ముంబైలోని వీధులనే కాన్వాస్‌గా చేసుకొని నిరసన రంగులను అద్దుతూ ‘‘బ్రేక్‌ ది సైలెన్స్‌’ అనే పేరుతో క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. సామాన్య జనాలకు తేలిగ్గా అర్థమయ్యేందుకు బాలీవుడ్‌ చిత్రీకరిస్తున్న స్త్రీ పాత్రలనే తన కళకు థీమ్‌గా మలచుకుంటోంది. ‘‘మహిళలు తమ హక్కుల గురించి మాట్లాడకుండా వాళ్ల నోరు నొక్కేస్తుంది సమాజం. ‘‘అందుకే నా క్యాంపెయిన్‌ పేరు ‘బ్రేక్‌ ది సైలెన్స్‌’ అని పెట్టా.  సోషల్‌ జస్టిస్‌కోసం గళమెత్తాల్సిందే’’ అంటుందీ ముంబై వాసి.

రైట్‌ టు ప్లెజర్‌
‘‘స్త్రీ  శరీరం గుడి కాదు. పవిత్రం, అపవిత్రాలకు చోటు లేదు. లైంగికేచ్ఛను బయటకు చెప్పుకునే హక్కు వాళ్లకూ ఉంది. సంతోషం, ఆనందం వాళ్లకూ కావాలి. అవి వాళ్లకు చెందనీయకుండా  ‘‘బరితెగింపు’ అనే లేబుల్‌తో భయపెడుతోందీ సమాజం’’  అంటుంది ప్రియా మాలిక్‌. డెహ్రాడూన్‌లో పుట్టి పెరిగిన ప్రియా ఆస్ట్రేలియాలో ఉంటారు. టీచర్,  స్లామ్‌ పొయెట్, స్టాండప్‌ కమెడియన్‌ కూడా. 2014లో ఆస్ట్రేలియా ‘బిగ్‌ బ్రదర్‌’ షోలో పాల్గొని ఫైనల్‌ వరకూ ఉన్నారు. అలాగే మన దగ్గర ‘‘బిగ్‌బాస్‌ సీజన్‌ 9’లోనూ పాల్గొన్నారు. ‘‘రైట్‌ టు ప్లెజర్‌’’ పేరుతో ఆమె చదివిన కవిత సంచలనం సృష్టించింది. అంతేకాదు ‘‘మై బాడీ ఈజ్‌ నాట్‌ ఎ టెంపుల్‌’’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఉద్యమాన్నీ నిర్వహిస్తున్నారు.కట్టూ, బొట్టూ తీరు చెప్పి గడపకే కట్టిపడేయాలనే తలపులను, చేతలను ఎప్పటికప్పుడు అచేతనం చేస్తూ సమానత్వం కోసం పోరాడాలనే  చేతన కలగచేస్తున్న ఇలాంటి కళాకారులు ఇంకెందరో!

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా