సారం ఉంది... సినిమా వస్తే బాగుంటుంది

3 Sep, 2016 23:12 IST|Sakshi
సారం ఉంది... సినిమా వస్తే బాగుంటుంది

బయోపిక్స్...నేటి సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్. బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ సంప్రదాయం మొదలైంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్, మహానటి సావిత్రి జీవిత చరితల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా సాలా ఖడూస్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బయోపిక్‌లుగా తెరకెక్కించే అవకాశం ఉన్న మరి కొంత మంది మహిళల జీవిత గాథలు చూద్దాం.

ఇరోం షర్మిల
మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోం షర్మిల ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 16 ఏళ్లపాటు నిరాహార దీక్షచేశారు. ఆమె జీవితగాథ నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం. దీక్ష విరమించే వరకు మాటకు కట్టుబడి తన పోరాటాన్ని కొనసాగించారు. సాటి మనుషుల కోసం ఆమె చేసిన త్యాగం, పోరాట పటిమను వెండితెర మీద ఆవిష్కరించగలిగితే సినిమా చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది.

సావిత్రి బాయి ఫూలే
ఈమె ఎవరో కాదు పేదల పాలిట పెన్నిధిగా పేరొందిన మహాత్మ జ్యోతీరావు ఫూలే సతీమణి. మహిళల సంపూర్ణ వికాసం కోసం నడుం బిగించిన వీర వనిత. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, తెరచాటున మగ్గిపోతున్న వితంతువుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మరాఠీలో రెండు మూడు సినిమాలు వచ్చినా అవి జనాదరణ పొందలేకపోయాయి. మిగిలిన వాళ్లెవరైనా అనుకుంటే ఆ త్యాగమూర్తి జీవితాన్ని స్ఫూర్తిమంతంగా మలచవచ్చు.

జ్యోతి రెడ్డి
అనాథ కాకపోయినా అనాథ శరణాలయం ఆమె ఇల్లయ్యింది. తల్లిదండ్రులున్నా కటిక పేదరికం ఆమెను అనాథనని చెప్పేలా చేసింది. అదే పేదరికం పదోతరగతి పాసవ్వగానే తనకంటే పదేళ్లు పెద్దవాడైన వ్యక్తికి భార్యని చేసింది. అదే పేదరికం కొంతకాలం వ్యవసాయ కూలీగా బతికేలా చేసింది. సేల్స్ గర్ల్‌గా, హౌస్ కీపర్‌గా, సాఫ్ట్‌వేర్ రిక్రూటర్‌గా మార్చింది. చివరకు ఓ మల్టీమిలియనీర్‌గా తీర్చిదిద్దింది...జ్యోతి రెడ్డి జీవితాన్ని పదిమందికి స్ఫూర్తిమంతంగా మలిచింది.

కెప్టెన్ లక్ష్మీ సెహగల్
స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మహిళా విభాగానికి అధిపతిగా పనిచేశారు. త్యాగం, దేశభక్తి, ధృడసంకల్పం నిండుగా మెండుగా ఉన్న ఈమె జీవితమంతా సాహసాలమయం. నేతాజీతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తెల్లదొరల అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

శ్వేత కత్తి
ముంబై రెడ్‌లైట్ ఏరియాలో శ్వేత కూడా  దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన యువతే. ఆ వ్యభిచార కూపం నుంచి ఎలాగో బయపడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సీఏ చదివాలన్న ఆమె ఆశయానికి రాబిన్ చౌరాసియా అనే వ్యక్తి  సాయం అందించడంతో ఆమె ప్రయాణం ముంబై రెడ్‌లైట్ ఏరియా నుంచి న్యూయార్క్‌లోని బార్డ్ కాలేజీ వరకు సాగింది. బయోపిక్‌కి ఇంతకంటే మంచి కథ ఏముంటుంది..?

కల్పనా సరోజ్
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి అడుగడుగునా అవమానాలు, చీదరింపులు ఎదుర్కొని వ్యాపార సామ్రాజ్యంలో మహారాణిలా వెలుగొందుతున్న ఈమె జీవితగాథ నేటి యువతకు ఓ సందేశాత్మక పాఠం. పిడికెడు కూటి కోసం ఆరాటపడే స్థాయి నుంచి వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ఆమె జీవితగాథను తెరకెక్కించాలని హాలీవుడ్ దర్శకులు ప్రయత్నించినా  అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు.  - కిశోర్‌రెడ్డి, సాక్షి ‘భవిత’

మరిన్ని వార్తలు