-

ఆనందానికి అడ్రెస్‌ ఇవ్వండి

11 Dec, 2019 05:19 IST|Sakshi

చారిటీ కాలం

ఈ కాలం ధరించడానికి సరైన దుస్తులు లేక చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేక కొంత మంది కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడే కొందరు దాతలు ముందుకువచ్చి తాము వాడని దుస్తులను అవసరమైన వారికి ఇస్తుంటారు. మీరు దానంగా ఇచ్చే దుస్తులను తీసుకున్నవారి ముఖంలో చిరునవ్వులు వెలిగే విధంగా ఉండాలి. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

ఎంపిక అవసరం
మీ దుస్తుల అల్మారాను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. కొన్నాళ్లుగా పక్కన పెట్టేసినవి, మీకు నచ్చనివి, మరోసారి అవి మీకు తగిన విధంగా ఉన్నాయా అనేది సరిచూసుకోండి. వాటిలో కుటుంబసభ్యులకు ఏవైనా ఉపయోగించవచ్చా అని ఆలోచించి, ఎంపిక చేసి పక్కన పెట్టండి.. చిరిగిన, మరకలు పడిన, ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా పనికిరావు అనుకున్న దుస్తులను దానంగా ఇవ్వాలనుకోవద్దు.

దారాల బంధం

కొన్ని డ్రెస్సులు కొద్దిగా చిరిగినవో, కుట్లు ఊడిపోయినవో ఉంటాయి. ఇలాంటప్పుడు సూది, దారం తీసుకొని ఆ డ్రెస్సులు తిరిగి వాడేలా కుట్లు వేయాలి. మీరు చేసే పని మానవత్వానికి సంబంధించింది కాబట్టి ఆ దయ, ప్రేమ ఆ దుస్తుల ద్వారా వాటిని అందుకున్నవారికి చేరుతుంది. ఇది మీలో ఓ గొప్ప పాజిటివ్‌ శక్తిని నింపుతుంది. బట్టలన్నీ సేకరించడమే కాదు, వాటిని ఉపయోగించే విధంగా బాగుచేసి ఇవ్వడంలోనే మన గొప్పదనం దాగుంటుంది. ఉదాహరణకు పాత జీన్స్, పాత మోడల్‌ అనిపించిన ఫుల్‌ హ్యాండ్‌ షర్ట్స్, వాడని స్కార్ఫ్స్, స్వెటర్స్‌.. వంటివి ఇవ్వచ్చు.

స్వచ్ఛమైన మనసు
‘దానంగా ఇచ్చే బట్టలే కదా మళ్లీ వాటిని శుభ్రం చేయడం ఎందుకు’ అనే ఆలోచనతో వాటిని అలాగే ఇవ్వకూడదు. సరిచేసిన దుస్తులను, శుభ్రం చేసి, చక్కగా మడతవేసి ఇస్తే వాటిని అందుకున్నవారి మనసు కూడా అంతే ఆనందంగా ఉంటుంది.

కాలానికి తగినవి
ఏ కాలంలో దుస్తులను ఇస్తున్నాం అనేది కూడా ముఖ్యం. చలికాలం కాబట్టి ఈ కాలం వాడుకోదగిన దుస్తులనే దానంగా ఇస్తే అవి వారికి ఉపయోగపడతాయి. అలాకాకుండా ఇంట్లోని చెత్త తీసేస్తున్నాం అనుకుంటే వేసవి కాలానికి అనువైన డ్రెస్సులు కూడా ఆ జాబితాలో ఉంటాయి. అవి, చివరకు ఎవరికీ ఉపయోగం లేని విధంగా ఉండిపోతాయి.

ఎవరికి అవసరమో వారికే!
సేకరించిన, బాగు చేసిన బట్టలన్నీ ఒక దగ్గరగా ఉంచాక ఎవరికి ఇవ్వాలో కూడా సరిచూసుకోవాలి. అందుకు స్వచ్ఛంద సంస్థలు గానీ దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు గాని వెళ్లి వాటిని ఇవ్వచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌ సమాచారం కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు