మొబైల్‌ ఫోన్లతో  కొందరిపై దుష్ప్రభావం

21 Jul, 2018 00:24 IST|Sakshi

మొబైల్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియో ధార్మికత కౌమార వయస్కుల జ్ఞాపకశక్తిపై దుష్ప్రభావం చూపుతుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాపికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ దేశంలో దాదాపు 700 మంది కౌమార వయస్కులపై జరిగిన ఒక అధ్యయనం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్‌ ఆర్‌ స్లీ తెలిపారు. రేడియో తరంగాల ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత క్షేత్రం మెదడుకు దగ్గరగా ఉంచుకోవడం వల్ల ఇలా జరుగుతోందని ఆయన అన్నారు.

కౌమార వయస్కులపై రేడియో ధార్మికత ప్రభావంపై ఇలాంటి శాస్త్రీయ పరిశోధన జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌తో చేసే ఇతర పనులు అంటే.. మెసేజ్‌లు పంపడం, ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడం వంటివాటితో పెద్దగా ఇబ్బంది లేదని.. కుడి చెవికి దగ్గరగా ఫోన్‌ పెట్టుకుని మాట్లాడటం మాత్రం వారిలో ఒకరకమైన జ్ఞాపకశక్తి (ఫిగరల్‌ మెమరీ) తగ్గేందుకు కారణమవుతోందని చెప్పారు. ఏవైనా ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతోందా? అన్నది తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఒక అధ్యయనం కూడా మొబైల్‌ఫోన్ల వాడకం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. 
 

మరిన్ని వార్తలు