వేర్వేరు అవయవాలపై ఒత్తిడి ప్రభావం అధిమించండి

26 Dec, 2019 00:07 IST|Sakshi

మీరు బాగా ఒత్తిడిలో ఉన్నారా? ఆ విషయం మీ శరీరం ద్వారానూ మీకు స్పష్టంగా తెలుస్తోందా? ఎందుకంటే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు కొందరిలో తలనొప్పి రావచ్చు. మరికొందరిలో ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇలా తల మొదలుకొని, పాదాల వరకు రకరకాల అవయవాల్లోని ఇబ్బందులు రకరకాల రూపాల్లో వ్యక్తమవుతాయి. మానసిక ఒత్తిడి మీలోని ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేసి, ఏయే లక్షణాలను కనబరుస్తోందో... దాన్ని బట్టి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. ఇవి చాలా తేలికైనవి. అనుసరించి చూడండి. రిలాక్స్‌ అవ్వండి.

తల, మెడ భాగాల్లో
కొందరిలో ఒత్తిడి వల్ల తల గట్టిగా పట్టేసినట్లుగా అనిపిస్తుంది.  నుదురు ముడుచుకుపోతుంది. ఆ తర్వాత సన్నగా తలనొప్పి మొదలై తీవ్రం కావచ్చు.  మరికొందరిలో తెలియని భారమంతా తమ భుజాలపైన ఉన్నట్లుగానూ, ఆ బరువు తమను కుంగదీస్తున్నట్లుగానూ ఉండవచ్చు. మెడ, భుజాల కండరాలు గట్టిగా పట్టేసినట్టు అనిపించవచ్చు. ఇది తగ్గాలంటే కొన్ని చిట్కాలివి...
►మొదట కుర్చీలో హాయిగా, సౌకర్యంగా కూర్చుని రిలాక్స్‌ అవ్వండి. చేతులు, కాళ్లు రిలాక్స్‌డ్‌గా ఉంచాలి.
►మీ ముఖాన్ని కుడి భుజం వైపుకు, మళ్ళీ ఎడమ భుజం వైపు తిప్పాలి. ఆ తర్వాత పైకీ, ఆ వెంటనే కిందకు వంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి.
►మీ తలను మొదట ఎడమ భుజం వైపు తర్వాత ఛాతీ వైపుకు, అక్కడి నుంచి కుడి భుజం వైపుకు ఇలా గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా
ఐదు సార్లు చేయాలి.
►నోటిని పెద్దగా తెరవాలి, కళ్ళను రెప్పలతో గట్టిగా నొక్కిపెట్టాలి. నోటితో గట్టిగా అరుస్తున్నట్టుగా నోరు తెరవాలి. కానీ ఎలాంటి శబ్దం చేయకూడదు. అలా విశాలంగా నోరు తెరచి గాలిని బాగా పీల్చాలి. మీకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

ఛాతి: ఒత్తిడి కారణంగా ఛాతీ చాలా బరువుగా ఉన్నట్లు అనిపించడం, శ్వాస గుండెల నిండా పూర్తిగా తీసుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ కింది విధంగా చేయండి.
►రిలాక్స్‌డ్‌గా కూర్చోవాలి. ఆ సమయంలో నడుమును నిటారుగా ఉంచాలి.  
►కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
►ఐదు వరకు అంకెలు లెక్కపెడుతూ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అలాగే మళ్లీ ఐదు అంకెలు లెక్కపెడుతూ శ్వాసను నెమ్మదిగా బయటకు వదిలేయాలి.
►వీలైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఉదరాన్ని బయటకు పెట్టాలి. అలాగే శ్వాసను వదలుతున్నప్పడు ఉదరాన్ని లాగినట్టుగా లోపలికి తీసుకోవాలి.
►ఇప్పుడు మీ ఉచ్ఛాస్వ–నిశ్శాస్వలను లెక్కించండి. ఈ లెక్కపెట్టడం రివర్స్‌లో జరగాలి. మీకు సమయం ఉంటే 60 నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ, సమయం లేకపోతే కనీసం 20 సంఖ్య నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ లెక్కించాలి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఒక అంకె, శ్వాస వదిలినప్పుడు తర్వాత అంకె... ఇలా సున్న వరకు లెక్కించి, సున్న తర్వాత కళ్ళు తెరవాలి.

ఛాతీ, మొండెం భాగాల్లో
మీరు ఒత్తిడికి గురయ్యినప్పుడల్లా మీరు ఎలా నుంచున్నారో లేదా కూర్చొని ఉన్నారో మీ పోశ్చర్‌ను ఒకసారి గమనించుకోండి. సాధారణంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలామంది ఒంగిపోయి, తల ఒంచుకుని ఉంటారు. ఇది మీ వెన్ను మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ కింది చిట్కాలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
►మొదటగా మీకు తెలిసిందే... తలవంచుకుని లేదా తలవాల్చి ఉండవద్దు. నిటారుగా కూర్చోండి.
►ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉండేవారు ప్రతి అరగంటకి ఒకసారి లేచి నిలబడి అక్కడికక్కడే ఒకటిరెండు నిమిషాలు నడవండి.
►నడుం నొప్పి వచ్చేవారికి భుజంగానసం చాలా బాగా పనిచేస్తుంది.

కాళ్లు... పాదాలపై
చాలామందిలో ఒత్తిడి తమ పాదాలపై ప్రభావం చూపుతుంది. మరీ ఒత్తిడికి గురైన చాలామందిలో పిక్కలు పట్టేయడం, కాళ్ల కండరాలు పట్టేయడం (మజిల్‌ క్రాంప్స్‌) కనిపిస్తాయి. ఒత్తిడి వల్ల కాళ్లు, పాదాలు ప్రభావితమయ్యేవారు ఈ కింది టిప్స్‌ పాటించాలి...
►కాళ్ళను కాస్తంత ఎత్తు మీద పీటలాంటిదానిపై పెట్టి ఉంచండి.
►మీ కాళ్ళను స్ట్రెచ్‌ చేసి మీ పాదాలను మీ వైపు తీసుకురావడానికి ప్రయత్నించండి, అలాగే దానికి వ్యతిరేక దిశలో మళ్లీ స్ట్రెచ్‌ చేయండి.
►నిలబడి గాని, కూర్చునిగాని ఒక కాలిని పైకి లేపి మడమను గుడ్రంగా రొటేట్‌ చేస్తున్నట్లుగా తిప్పాలి. మొదట కుడివైపుకు, తర్వాత ఎడమవైపుకు తిప్పాలి. రెండుకాళ్లతో ఇలా ఐదుసార్లు చేయాలి.
►పెడిక్యూర్‌ చేయడం /పాదాల మసాజ్‌ వల్ల కూడా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది.

అదనంగా...
►పైన పేర్కొన్న వాటన్నింటితో పాటు టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్, హాకీ లేదా క్రికెట్‌ వంటి ఆటలు కూడా ఆడుతుండటం మంచిది.
►ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్‌ చేయడం మంచిది. టీవీ చూస్తూ డ్యాన్స్‌ కూడా చేయవచ్చు.
►వాకింగ్, జాగింగ్, స్విమింగ్‌ వీటిలో ఏదో ఒకటి రోజుకు గంట పాటు చేయాలి. వీటన్నింటి వల్ల మన గుండె , ఊపిరితిత్తులు, రక్తకణాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. దేహమంతా
ఆరోగ్యంగా ఉంటుంది. ఎండార్ఫిన్స్‌ వంటి మంచి హార్మోన్లు విడుదలయ్యి అవి ఒత్తిడిని కలిగించే రసాయనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

కళ్లు  
ఒత్తిడి బాగా ఉన్నప్పుడు కొందరిలో కళ్లు నొప్పిగా ఉండటం, కళ్లు లాగినట్లు అనిపించడం, కళ్ల వెంట నీరుకారడం జరుగుతుంది. టీవీ, మొబైల్స్‌ ఎక్కువగా వాడటం, కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కింది సూచనలు పాటించండి.

►ప్రతి గంటకోసారి కళ్లను గట్టిగా కాకుండా, మృదువుగా మూసుకొని... కళ్లపై మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది గుండ్రంగా చేయాలి. తొలుత క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు, ఆ తర్వాత యాంటీక్లాక్‌వైజ్‌గా మరో ఐదుసార్లు చేయాలి.
►కళ్లకు ఆహ్లాదంగా ఉండే రంగు (సూదింగ్‌ కలర్‌) లైట్‌ గ్రీన్‌. కాబట్టి కిటికీలోంచి పచ్చటి చెట్లను చూడవచ్చు. లేదా కంప్యూటర్‌
మానిటర్‌ పక్కన ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌ పెట్టుకొని చూస్తుండటం కూడా మంచి పద్ధతి.
►కంప్యూటర్‌ / మొబైల్‌ ఫోన్స్‌లో రీడింగ్‌ మోడ్‌లో ఉంచి చదవడం మంచిది.
►రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లమీద తాజానీటిలో ముంచిన తడిగుడ్డ కాసేపు ఉంచుకోవడంమంచిది. వీటన్నింటివల్ల ప్రయోజనం కనిపించినప్పుడు ఒకసారి కంటి డాక్టర్‌ను సంప్రదించి తమ ఐ–సైట్‌ చెక్‌ చేయించుకోవాలి.
డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు