మాస్క్‌తో వ్యాయామం మంచిదేనా?

26 May, 2020 00:12 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్‌లు తొడగడం నిత్యకృత్యమైపోయింది. అయితే కొందరు మాస్క్‌లు తొడిగే వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేస్తున్నారు. అయితే మాస్క్‌ పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిదేనా? ఎక్సర్‌సైజ్‌ చేసే సమయంలో మాస్క్‌ తొడగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వ్యాయామం చేయడం సరైన పద్ధతి అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే మాస్క్‌ తొడిగి వ్యాయామం చేయాల్సి వస్తే... కొన్ని అంశాలను గమనించడమూ ఎంతో అవసరం.  మాస్క్‌తో వ్యాయామం ఎంతవరకు మంచిదో చూద్దాం.

మామూలుగానైతే మాస్క్‌లు మంచివే. వైరస్‌లనూ, వ్యాధి కారక క్రిములనూ చాలావరకు నిరోధిస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తాయి. అయితే మీరు వాకింగ్‌గానీ, జాగింగ్‌ గానీ లేదా ఇతర  వ్యాయామాలు చేసే సమయంలో మాస్క్‌  తొడిగితే ... ఆ తేడాను మీరే పసిగట్టగలరు. మామూలుగా వ్యాయామం చేసే సమయంలో అధిక శ్రమ కారణంగా మనకు కాస్తంత ఆయాసం రావడం మామూలే. అయితే ముక్కుకు అడ్డుగా ఏదీ లేనప్పుడు మామూలు కంటే మరింత ఎక్కువగా, ధారాళంగా గాలి పీలుస్తూ ఉంటాం.

కానీ మాస్క్‌ అడ్డుగా ఉన్న సమయంలో మనం కాస్తంత తల బాగా తేలికైన ఫీలింగ్‌ (లైట్‌హెడెడ్‌నెస్‌) గానీ, కళ్లు తిరగడం గానీ, మగత గా అనిపించడం లేదా తగినంత చురుగ్గా లేకపోవడం, ఊపిరి అందకుండా ఉన్న ఫీలింగ్‌గానీ ఉంటే మాస్క్‌ వల్ల మీకు అందాల్సినంత ఆక్సిజన్‌ అందకుండా ఉందని అర్థం. అలాంటి సమయాల్లో మాస్క్‌ తొలగించి... జనసామాన్యానికి దూరంగా ఉంటూ వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం ముగించాక మళ్లీ మాస్క్‌ తొడుక్కోవచ్చు. తేలికపాటి నడక సాగించే వారు విడిగా ఇంట్లోనే మాస్క్‌ లేకుండా నడిచి... నడక ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ మాస్క్‌ ధరించడం మేలు.

వ్యాయామం అప్పుడు అస్సలు మాస్క్‌ తొడగకుండానే ఉండాల్సిన వారు... 
మీరు గుండెజబ్బులతో బాధపడుతున్నవారా? లేదంటే... మీకు ఏవైనా శ్వాససంబంధమైన వ్యాధులున్నాయా? అలాగైతే వ్యాయామం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాధుల కారణంగా మీకు శ్వాసలో తగినంత ఆక్సిజన్‌ అందకపోతే ఇబ్బందులు ఖాయం. అందుకే  వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్‌ వంటివి చేస్తున్నప్పుడు మాస్క్‌ తొడగకుండా చేయడం అవసరం. అయితే బయట ఇప్పుడున్న వాతావరణంలో మాస్క్‌ తొడగకపోవడం అంత మంచిది కాదు కాబట్టి... మీరు ఇంటి ఆవరణలోనో, మేడపై ఖాళీస్థలంలోనో మాస్క్‌ లేకుండానే నడక కొనసాగించడం మంచిది. ఒకవేళ ఫేస్‌మాస్క్‌ ధరించక తప్పదని మీ డాక్టర్‌ చెబితే... మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందర ఒకసారి మీ డాక్టర్‌ సలహా తప్పక తీసుకునే ఎక్సర్‌సైజ్‌ ప్రారంభించాలి. డాక్టర్‌ను నేరుగా కలవడం కుదరకపోతే ఫోన్‌లో సంప్రదించాలి. పేషెంట్‌ స్వయానా కనిపిస్తుండే టెలిమెడిసిన్‌ పద్ధతైతే ఇంకా మంచిది.

చాలా కాలంగా వ్యాయామం చేయకుండా ఇప్పుడే మొదలుపెడుతున్నారా? 
చాలాకాలం నుంచి వ్యాయామం చేయకుండా ఉన్నవారు... వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నవారూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మాస్క్‌ తొడిగే నేరుగా వ్యాయామం మొదలుపెట్టడం అస్సలు మంచిది కాదు. తొలుత తేలికపాటి వ్యాయామాలు/వార్మింగ్‌ అప్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ... క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవడం అవసరం. చాలాకాలం వ్యాయామం చేయకుండా ఇప్పుడు వ్యాయామం మొదలుపెట్టగానే... మగతగా, కళ్లుతిరుగుతున్నట్లుగా, స్పృహతప్పుతున్నట్లుగానూ అనిపిస్తే వ్యాయామాలు  ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి.

మాస్క్‌తో వ్యాయామం చేస్తే ఏమవుతుంది? 
మామూలుగా మనం శ్వాసించేటప్పుడు గాలి చాలా ఫ్రీగా ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అయితే ఫేస్‌కు మాస్క్‌ ఉన్నప్పుడు అది గాలిని నిరోధిస్తూ, దాని కదలికలకు అడ్డుపడుతుంది. దాంతో అందాల్సిన మోతాదులో ఆక్సిజన్‌ అందదు. మాస్క్‌ ఉన్నప్పుడు మన ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌లో ఎంతో కొంత కొరత ఉంటుంది. అలాగే మనం వదిలే గాలిలో ఉండే కార్బన్‌ డై యాక్సైడ్‌ మునపటిలా మొత్తం బయటి గాలిలోకే వెళ్లకుండా... ముక్కుకు ఆని ఉన్న మాస్క్‌ ప్రాంతంలోనే ఎక్కువ మోతాదు ఉండిపోతుంది.

దాంతో మళ్లీ మరోసారి గాలి పీల్చినప్పుడు మొదటికంటే ఆక్సిజన్‌ తక్కువ అందడంతో పాటు, ముక్కుకు దగ్గరగానే ఉన్న కార్బన్‌ డైయాక్సైడ్‌ మళ్లీ లోపలికి ప్రవేశించడంతో అందాల్సిన ఆక్సిజన్‌ పాళ్లు మరింత తగ్గుతాయి. ఇలా ఆక్సిజన్‌ అందాల్సినంత మోతాదులో అందకపోవడంతో ఇటు గుండెకూ, అటు మెదడుకూ తగినంత ఆక్సిజన్‌ అందకనే ఇలా తల దిమ్ముగా ఉండటం, తల తేలికైపోయినట్లుగా ఉండటం, ఊపిరి అందకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి.

మాస్క్‌ విషయంలో జాగ్రత్తలివి... 
► ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులే ఉంటారు కాబట్టి... కుటుంబసభ్యుల్లో ఎవ్వరికీ ఫ్లూ, జలుబు వంటి లక్షణాలేవీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌ తొడగకండి. అయితే కుటుంబసభ్యులైనా అందరూ తగినంత భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. 
► ఇంటి ఆవరణలో లేదా మేడపైన విడిగా వ్యాయామం చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు వ్యాయామం చేస్తూన్నా కలివిడిగా కాకుండా విడివిడిగానే చేయాలి. 
► బయటకు వెళ్లినప్పుడు తప్పక మాస్క్‌ ధరించే వెళ్లాలి. గుంపులు గుంపులుగా జనాలు ఉన్నచోటికి మీకు మాస్క్‌ ఉన్నా వెళ్లకండి. అక్కడ రద్దీ తగ్గాకే వెళ్లండి.

తీవ్రమైన (హెవీ) వ్యాయామాలు చేసేవారు...

ఇప్పుడు జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ ఎలాగూ పనిచేయడం లేదు. అయితే పర్సనల్‌ జిమ్‌లలో లేదా తమకు అందుబాటులో ఉండే వస్తువులతో చాలా తీవ్రంగా వ్యాయామాలు (ఇంటెన్స్‌ ఎక్సర్‌సైజ్‌) చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ  వెయిట్‌లిఫ్టింగ్స్, స్ప్రింట్స్, ప్లయోమెట్రిక్స్, క్రాస్‌ఫిట్‌ సై్టల్‌ వర్కవుట్స్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్స్‌ (హిట్స్‌–హెచ్‌ఐఐటీ) వంటి వ్యాయామాలు చేసేవారు మాస్క్‌ తొడుక్కోకుండా చేయడం అవసరం. కార్డియో వ్యాయామాలు చేసేవారు కూడా ఇవే పద్ధతులు అవలంబించాలి.

మీకు తగినంత ఆక్సిజన్‌ అందుతుందో లేదో గుర్తించడం ఎలా? 

ఆక్సిజన్‌ తగినంతగా అందుతుందా లేదా అన్నది తెలుసుకోడానికి ఉత్తమమైన మార్గం పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఉపయోగించడం. దానిద్వారా మన రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదు ఎంత ఉందో తక్షణం తెలిసిపోతుంది. అయితే ఇలాంటి ఉపకరణాలు ఆసుపత్రుల్లో మాత్రమే ఉంటాయి కాబట్టి... మన దేహస్పందనలను జాగ్రత్తగా గమనించడం ద్వారా  మనకు మనంగా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వ్యాయామం చేస్తున్న సమయంలో భరించలేనంత శ్రమ...ఊపిరందకపోవడం, (వ్యాయామంలో ఎంతో కొంత ఆయాసం ఉంటుందిగానీ... అది పూర్తిగా గాలి ఆడనంత తీవ్రంగా ఉంటే)... తల బాగా తేలికయిపోయినట్లు ఉండటం, అవయవాలు మొద్దుబారినట్లు అనిపించడం, తిమ్మిర్లుగా అనిపించడం, నిస్సత్తువగానూ, నీరసంగానూ, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం వ్యాయామం ఆపేయాలి. పైన పేర్కొన్నవన్నీ మన ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్‌ లభ్యం కావడం లేదనడానికి సూచనలు. అలాంటప్పుడు అన్ని రకాల వ్యాయామాలు ఆపేసి, డాక్టర్‌ సంప్రదించి, మళ్లీ మీ డాక్టర్‌ వ్యాయామాలు చేయడానికి అనుమతించాకే మొదలుపెట్టాలి.

మరిన్ని వార్తలు