నాన్న కోసం

11 Nov, 2019 00:46 IST|Sakshi

ఆదర్శం

ఇన్ఫోసిస్‌లో అతనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నెలకు రూ.లక్ష జీతం. భార్య మరో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆమెకూ నెలకు రూ.50 వేలకు పైగానే జీతం. ఆ ఉద్యోగాలు చేస్తుండగానే ఇద్దరికీ యూఎస్, దుబాయ్‌ కంపెనీల్లో రెట్టింపు జీతాలతో మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి! కెరీర్‌ కోసం కలలుకనే నేటి యువత ఏం చేస్తుంది? ఎగిరి గంతేస్తుంది! క్షణం కూడా ఆలోచించకుండా ఫ్లయిట్‌ ఎక్కి ఎగిరిపోతుంది.

ఇంకా ఇంకా వస్తున్న అవకాశాలను చకచకా అందుకుని కెరీర్‌ కోసం మరిన్ని కలలు కంటుంది. కానీ ఆ యువ సాప్ట్‌వేర్‌ దంపతులు ఏం చేశారో తెలుసుకుంటే ఎవరికైనా వెంటనే వెళ్లి వారిని అభినందించాలనిపిస్తుంది. అంతంత పెద్ద జీతాలకన్నా, సుదూర తీరాల్లోని విలాసవంతమైన జీవితాల కన్నా.. సొంత ఊళ్లో ఉన్న అమ్మా నాన్నే తన ఊపిరి అనుకున్నాడు అతడు.

తల్లిదండ్రుల చెంతనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న భర్తకు చేదోడుగా ఉండటం తన ధర్మం అనుకున్నారు ఆమె. కన్నవాళ్లను, జన్మభూమిని వదలి కెరీర్‌ కోసం విదేశాల వైపు పరుగులు తీసే నేటి యువత ఒక్క నిమిషమైనా ఆగి భానుప్రకాష్, జ్యోత్స నల గురించి తెలుసుకోవాల్సిందే.

కలంకారి పరిశ్రమకు పుట్టినిల్లు కృష్ణా జిల్లా పెడన. ఆ పట్టణంలో తాతముత్తాతల నాటి నుంచి ‘కాంతి టెక్స్‌టైల్స్‌’ పరిశ్రమను కాపాడుకుంటూ వస్తున్నారు భట్టా మోహనరావు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు వెంకట భానుప్రకాష్‌. టెన్త్‌లో జిల్లా ఫస్ట్‌. ఇంటర్‌లో స్టేట్‌ టాపర్‌. ఎంసెట్‌లోనూ మంచి ర్యాంక్‌ రావడంతో హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన సీబీఐటీలో ఫ్రీ సీట్‌ వచ్చింది. ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ చదువుతుండగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో టీసీఎస్‌లో అవకాశం వచ్చింది.2008 వరకు ముంబై టీసీఎస్‌లో యాభై వేల జీతంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసారు భాను ప్రకాష్‌. ఉద్యోగిగా పనిచేయడం కంటే పదిమందికి ఉపాధి కల్పించేలా భవిష్యత్‌లో ఏదైనా కంపెనీ పెట్టాలన్న తలంపుతో దుబాయ్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీలో ఎంబీఏ చదివారు.

శాప్‌లో నైపుణ్యతను అందిపుచ్చుకున్నారు. దాంతో హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో అవకాశం వచ్చింది. ఏడేళ్ల పాటు నెలకు లక్షకు పైగా జీతంతో అందులో పనిచేశారు. 2014లో చీరాల అమ్మాయి జ్యోత్స్నతో వివాహమైంది. ఆమె కూడా ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్‌ చేశారు.హైదరాబాద్‌లో జెన్‌సార్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం. యాభై వేలకు పైగా వేతనం. భార్యాభర్తకు కలిపి లక్షన్నరకు పైగా జీతం. పని చేస్తున్న కంపెనీల పరంగా ఎన్నో సౌకర్యాలు. మెట్రో నగరంలో సకల వసతుల అధునాతన జీవితం. అదే సమయంలో యూఎస్, దుబాయ్‌లలో కూడా రెట్టింపు వేతనాలతో ఆ దంపతులకు అవకాశాలు తలుపు తట్టాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అడుగు పెట్టిన వారెవరైనా ఇంతకంటే ఏం కోరుకుంటారు?!

సరిగ్గా ఆ సమయంలో..!
తండ్రి మోహనరావుకు గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. తల్లి ఆరోగ్యమూ అంతంత మాత్రం. ముగ్గురు అక్కచెల్లెళ్లకు పెళ్లిళ్లయి మెట్టినింటికి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిలో ఒక వైపు ఉజ్వలమైన భవిష్యత్తు. మరోవైపు అమ్మానాన్నకు సంరక్షణగా వేరెవరినో ఉంచి వెళ్లేందుకు ఒప్పుకోని మనస్సాక్షి.. తీవ్ర సంఘర్షణకు లోనయ్యారు భానుప్రకాశ్‌ దంపతులు. కన్నవారి కంటే కెరీర్‌ ఎక్కువేం కాదని భానుప్రకాశ్, అతడి జీవన సహచరిగా జ్యోత్స ్న ఇద్దరూ కలిసి స్థిర నిశ్చయానికి వచ్చారు. జీవిత చరమాంకంలో ఆ పెద్దవాళ్లకు బాసటగా నిలవాలని సంకల్పించారు. వారసత్వంగా తన తండ్రి నడుపుతున్న కలంకారీ పరిశ్రమ పగ్గాలు చేతపట్టారు భానుప్రకాశ్‌. భర్తకు చేదోడుగా ఉండిపోయారు జ్యోత్స్న. పరిశ్రమ పురోభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి.

భౌగోళిక గుర్తింపు కలిగిన కలంకారి పరిశ్రమను పెడనలో మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో భార్యాభర్తలు శ్రమిస్తున్నారు. సాంప్రదాయ బ్లాక్‌  ప్రింటింగ్‌ పద్ధతులను వీడకుండా కొత్తకొత్త వెరైటీ డిజైన్స్‌తో కర్చీఫ్‌ నుంచి 6/9 కార్పెట్స్, అత్యంత ఖరీదైన చీరల వరకు తయారు చేçస్తున్నారు. కలంకారీలో ఎన్ని రకాల వస్త్రాలు తయారు చేయొచ్చో అన్నింటినీ తయారు చేస్తూ దేశంలోనే కాక అమెరికా, యూరప్‌ దేశాలకు కూడా ఎగుమతి చేçస్తున్నారు. సుమారు నలభై మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు.‘‘ఇవన్నీ కాదు.. మేము మా నాన్నగారి దగ్గర ఉన్నాం’’ అంటారు భానుప్రకాశ్, మామయ్యను సొంత తండ్రిలా చూసుకుంటున్న కోడలు జ్యోత్స .
– పంపాన వరప్రసాదరావు,
సాక్షి, మచిలీపట్నం, ఫొటోలు: అజీజ్‌

వద్దని వారించినా ఇద్దరూ వినలేదు!
కొడుకు, కోడలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. ఆమెరికా, దుబాయ్‌ వంటి దేశాల్లో అవకాశాలు వచ్చాయి. అయినా సరే వాటిని వదులు కొని నా కోసం ఇక్కడకు వచ్చేశారు. నేను వద్దన్నాను.. వారించాను. అయినా వినలేదు. మీకంటే మాకు ఈ ఉద్యోగాలు ఎక్కువేం కాదని వచ్చేశారు. నాకోసం వారు పడుతున్న తపన మాటల్లో చెప్పలేను. కన్న బిడ్డలా నన్ను చూసుకుంటున్నారు.
– భట్టా మోహనరావు

జ్యోత్స్న కాన్ఫిడెన్స్‌ని ఇచ్చింది
మాకు జీవితాన్నిచ్చిన నాన్నగారి కంటే విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు ఎక్కువేం కాదనిపించింది. ఇలా అని నా భార్యతో అనగానే  మరోమాట లేకుండా వెంటనే ‘మీ వెంటే నేను’ అనేయడం నాకు మరింత కాన్ఫిడెన్స్‌ని ఇచ్చింది. స్క్రీన్‌ ప్రింటింగ్‌ వల్ల ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న కలంకారీ పరిశ్రమను భవిష్యత్‌ తరాల కోసం ముందుకు తీసుకెళ్లాలన్నదే మా తపన. మా ఆలోచన.

– భట్టా వెంకట భానుప్రకాశ్‌

భావోద్వేగానికి గురయ్యాను
అనారోగ్యంతో ఉన్న తన తండ్రి కోసం నా భర్త ఎంతగా తపన పడ్డారో నాకు బాగా తెలుసు. ఉద్యోగాలు వదిలేసి నాన్న దగ్గరకు వెళ్లిపోవాలని ఉందని ఆయన అన్నప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. తనతో పాటు నేనూ ఉద్యోగానికి రాజీనామా చేసి పెడన వచ్చేశాం. నా భర్తతో కలిసి కలంకారీ పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది.
– భట్టా జ్యోత్స్న

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా