అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...

23 Nov, 2013 05:03 IST|Sakshi

 స్కూల్లో చదువుకునే రోజుల్లో రేడియో పుణ్యమా అని ‘‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...’’ పాట చెవిన పడింది. తెగ నచ్చింది. కారణం... బరువైన భావాలు ఏమీ లేకుండా మామూలు మాటల్లో సంభాషణగా సాగడం. రాసింది కొసరాజుగారు. ఆ పాట నాకు బాగా నచ్చిందన్న విషయం గ్రహించి మా అమ్మగారు ఒక క్యాసెట్‌లో రికార్‌‌డ చేయించి ఇంట్లో పెట్టారు. అప్పటినుంచి టేప్ రికార్డర్లో పెట్టుకుని చాలాసార్లు వినేవాడిని. వినేకొద్దీ కొత్త కొత్త అర్థాలు తెలిసేవి. తర్వాత చాలాకాలానికి ‘కులగోత్రాలు (1962)’ టీవీలో వస్తే ఆ పాట కోసమే చూశాను. ఇంకా నచ్చింది.


 పేకాటలో డబ్బు పోగొట్టుకున్న రమణారెడ్డిని రేలంగి ఓదారుస్తూ, ధైర్యం చెబుతూ మళ్లీ ముగ్గులోకి దింపే క్రమం ఈ పాటలోని సారాంశం.

అయ్యయ్యో చేతిలో డబ్బులుపోయెనే/ అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే/ఉన్నది కాస్తా ఊడింది... సర్వమంగళం పాడింది. పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది... అని నెత్తిమీద చెంగేసుకుని ఏడుస్తూ కూర్చుంటాడు రమణారెడ్డి.
 
రేలంగి ప్రవేశించి ‘ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ/ ఓటమి తప్పలేదు భాయీ...’ అంటాడు.


 సాధారణంగా జూదం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పాండవులు, శకుని. ‘ఆ మహామహా మన ధర్మరాజుకే తప్పలేదు భాయీ...’ అని రాయొచ్చు. కానీ కొసరాజుగారు నలమహారాజును ఉపమానంగా చెప్పారు. ఎందుకు చెప్పారో చాలాకాలం తెలియలేదు. ఆలోచించగా, ఆలోచించగా ఒక ఔచిత్యం ఉందనిపించింది. నలమహారాజు గుణగణాల్లో పాండవులందరూ కనిపిస్తారు. ధర్మరాజులాగ జూదమాడడం, భీముడిలాగ వంటచేయగలగడం, అర్జునుడి మాదిరిగా వివాహానికి స్వయంవరం కావడం, నకులుడిలాగ అశ్వాలను వేగంగా పరుగెత్తించగలగడం, సహదేవుడిలాగ కత్తియుద్ధంలో నిపుణుడు కావడం... వెరసి పాండవులంతా నలుడిలో కనిపిస్తారు. జూదం ఆడింది ధర్మరాజు అయినా నష్టపోయి కష్టాల పాలైంది మాత్రం పాండవులు ఐదుగురూనూ... అందుకే నలమహారాజును పంచపాండవుల ప్రతీకగా కొసరాజుగారు ప్రయోగించారేమో అనిపిస్తుంటుంది నాకు. అడగడానికి ఆయనలేరు, అనుకోవడమే తప్ప!
 సరే, ‘నలమహారాజుకే ఓటమి తప్పలేదు, నువ్వెంత?’ అనే అర్థంలో రేలంగి అనగానే... రమణారెడ్డి ‘మరి నువు చెప్పలేదు భాయీ’ అంటాడు.
 వెంటనే రేలంగి అది నా తప్పుగాదు భాయీ/ తెలివితక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ/ బాబూ నిబ్బరించవోయీ... అంటాడు.
 నిజమే! జూదమాడే వాడిని ప్రత్యర్థి ఎందుకు హెచ్చరిస్తాడు? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే... అనే సామెత కూడా అలా వచ్చిందే. ఇక డబ్బు పోయాక చేసేదేమీ లేకపోతే పుట్టేది వేదాంతమే.
 ‘నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది/ ఎంతో పుణ్యం దక్కేది’
 అంటూ నిట్టూరుస్తున్న రమణారెడ్డికి వంతపాడుతూ ‘చక్కెర పొంగలి చిక్కేది’ అంటాడు పక్కనున్నతను. ఇది కొసరాజు గారి మార్కు. చిన్న కౌంటరుతో వినేవాళ్లకి నవ్వులు తెప్పించడం వీరి పాటల్లో సర్వసాధారణం.
 జూదంలో డబ్బు పోగొట్టుకున్నవాళ్ళు ‘మా ఆవిడకి ఇచ్చినా బాగుండేది. నెక్లెస్ కొనుక్కునేది’, ‘తిరుపతి హుండీలో వేసినా బాగుండేది పుణ్యం దక్కేది’ అనుకోవడం సర్వసాధారాణం. కొంతమంది బాధలో ఇంకాస్త అతిశయోక్తికి పోతారు.
 అందుకే కొసరాజుగారు ఇలా అనిపించారు. ‘ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఏ. దక్కేది’ అనగానే, రేలంగి ‘మనకు అంతటి లక్కేది’ అని రమణారెడ్డిని వాస్తవికలోకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు.


 ఏడుపుల పర్వం అవగానే జూదరులు జూదం మానేస్తారనుకోవడం పొరపాటు. పోగొట్టుకున్నచోటే ఏరుకోవాలి అనేది వీళ్ళ ఫార్ములా. అందుకే రేలంగి, రమణారెడ్డిల మధ్య సంభాషణ ఇలా రాశారు కొసరాజు గారు. ఈ చరణంలో రమణారెడ్డికి బ్రెయిన్‌వాష్ చేయడానికి రేలంగి మిత్రులు కూడా చేరతారు.
 రేలంగి: గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు
 రేలంగి మిత్రులు: మళ్ళీ ఆడి గెల్వవచ్చు
 రేలంగి: ఇంకా పెట్టుబడెవడిచ్చు
 రేలంగి మిత్రులు: ఇల్లు కుదవ చేర్చవచ్చు
 రేలంగి: ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు
 రమణారెడ్డి: పోతే...
 రేలంగి: అనుభవమ్ము వచ్చు
 రమణారెడ్డి: చివరకు జోలె కట్టవచ్చు
 అంటూ మళ్ళీ తనదైన క్లోజింగ్ పంచ్‌తో ముగించారు కవిగారు. ఎంతపోయినా అనుభవం వస్తుందిలే అనుకుని సరిపెట్టుకోవడం జూదవ్యామోహానికి పరాకాష్ఠ. అలా సరిపెట్టుకునేవాడికి ఎవడు మాత్రం ఏం చెప్పగలడు?!


 నలమహారాజు నుంచి నేటి తాజా జూదరుల వరకు ఎటువంటి మార్పూ రాలేదు. నా మిత్రులు కొందరు క్యాసినోలాడుతూ ఉంటారు. వారిది ఇదే వరుస. పోయిందన్న బాధ పూట కూడా ఉండదు. అప్పు చేసైనా, క్రెడిట్ కార్డు గీకి అయినా రెడీ అయిపోతారు. ఎంత పోగొట్టుకుంటే అంత కసి పెరిగిపోతుందన్నమాట. కొందరైతే ‘‘దేవుడా! ‘కష్టపడి...’ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు ఎంతిస్తావో 10 శాతం నీ హుండీలో వేస్తాను’’ అని ఇష్టదైవంతో బేరాలు చేస్తుంటారు కూడా. వాళ్ళ ‘కష్టాన్ని...’ భగవంతుడు గుర్తించుగాక!


 జూదరుల మనస్తత్వానికి అద్దం పట్టే ఈ పాట ఎవర్‌గ్రీన్. పిఠాపురం, మాధవపెద్ది, రాఘవుల గళాలు, సాలూరి రాజేశ్వరరావుగారి స్వరాలు ఈ పాటకు వరాలు.
 
 - సంభాషణ: నాగేశ్

 

మరిన్ని వార్తలు