ముఖ్యమైన వాళ్లు

3 Jan, 2018 23:39 IST|Sakshi

చెట్టు నీడ

మీకు తెలిసిన కథే. ఒక వైద్యుడు, ఒక న్యాయవాది, ఒక మతబోధకుడు, ఒక చిన్నపిల్లవాడు ఓ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు. అనూహ్యంగా విమానంలో ఏదో లోపం తలెత్తింది. లోపల ఉండే నిపుణులు ప్రయత్నించారు కానీ మరమ్మతు చేయలేకపోయారు. చివరికి పైలట్‌ నుంచి ప్రకటన వెలువడింది. ‘‘నన్ను క్షమించండి. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది’’ అని చెప్తూనే ప్యారాచ్యూట్‌ నుంచి కిందికి దూకేశాడు. దురదృష్టవశాత్తూ  విమానంలో ఇంకా మూడు మాత్రమే ప్యారాచ్యూట్‌లు మిగిలి ఉన్నాయి. వెంటనే వైద్యుడు ఒక ప్యారాచ్యూట్‌ అందుకున్నాడు. ‘‘నా జీవితం చాలా ముఖ్యమైనది. నేను బతికి ఉండడం చాలా ముఖ్యం. నేను బతికి ఉంటే నా జీవితకాలంలో అనేకమందిని నా వైద్యంతో బతికించవచ్చు’’ అని చెప్పి విమానం నుంచి కింది దూకేశాడు.   రెండో ప్యారాచ్యూట్‌ను న్యాయవాది లాగేసుకున్నాడు. ‘‘నేను తెలివైన వాడిని. నా వంటి తెలివైన వాడు లోకానికి అవసరం’’ అని నిముషం కూడా ఆలస్యం చేయకుండా దడేల్మని కింది దూకేశాడు.  ఇక మిగిలింది ఒకటే ప్యారాచ్యూట్‌. మిగిలినవారు ఆ పిల్లవాడు, ఆ మత బోధకుడు. ‘‘త్వరగా ఆ ప్యారాచ్యూట్‌ తీసుకుని కిందికి దూకెయ్‌. నేను ఎంతో జీవితాన్ని గడిపాను. నువ్వు చిన్నపిల్లవాడివి నీకింకా చాలా జీవితం ఉంది. నువ్వు బతకాలి, దూకెయ్‌’’ అని తొందరపెట్టాడు మతబోధకుడు. 

ఆ బాలుడు మత బోధకునికి ప్యారాచ్యూట్‌ ఇచ్చి, ‘‘మీరూ దూకేయొచ్చు ఫాదర్‌. ఇంతక్రితం ఆ న్యాయవాది తీసుకెళ్లింది ప్యారాచ్యూట్‌ కాదు, నా లెదర్‌ బ్యాగ్‌’’ అని చెప్పాడు.  తెలివైనవాళ్లమని, ప్రపంచానికి ముఖ్యులం అని అనుకుంటూ తిరిగేవాళ్లు చాలాసార్లు తమను తాము తెలుసుకోవడంలో తప్పటడుగు వేస్తారు. (కథ కోసం ఇందులో కొన్ని వృత్తులను పేర్కొడం జరిగింది తప్ప, ఎవరినీ వేలెత్తి చూపాలన్న ఉద్దేశం లేదు)                   

మరిన్ని వార్తలు