త్వరలో... జెట్‌లాగ్‌కు చుక్కల మందు!

19 Apr, 2017 00:22 IST|Sakshi
త్వరలో... జెట్‌లాగ్‌కు చుక్కల మందు!

పరిపరిశోధన

జెట్‌లాగ్‌ను తగ్గించే చుక్కల మందును రూపొందించే పనిలో ఉన్నారు స్కాట్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడింబర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కళ్లలో కాస్త చుక్కల మందు వేయడం ద్వారా బయలాజికల్‌ క్లాక్‌ను సరిచేసి, జెట్‌లాగ్‌ అనర్థాలను తగ్గించవచ్చని వారు పేర్కొంటున్నారు. వెలుతురు రాగానే నిద్రలేవడం, చీకటి పడ్డ తర్వాత నిద్రకు ఉపక్రమించడం అన్నది మన జీవగడియారంలో మనం స్వాభావికంగా సెట్‌ అయి ఉండటం వల్ల సాధ్యపడుతోందన్న విషయం తెలిసిందే. ఇలా లయబద్ధంగా నిద్రలేవడం, నిద్రరావడాన్ని సర్కాడియన్‌ రిథమ్‌గా పేర్కొంటాం.

మనకు రాత్రీ, విదేశాల్లో పగలు ఉండే దేశాలకు వెళ్లినప్పుడు లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు జీవగడియారంలో సెట్‌ అయిన ప్రోగ్రామ్‌ అయిన సర్కాడియన్‌ రిథమ్‌కు విఘాతం కలుగుతుంది. ఫలితంగా రాత్రిళ్లు నిద్రలేకపోవడం లేదా పగటివేళ నిద్రముంచుకురావడం వంటి అనర్థాలు కలుగుతుంటాయి. దీన్నే జెట్‌లాగ్‌గా అభివర్ణిస్తారు. కళ్లలో వేసే ఈ మందు... మెదడులో జీవగడియారం ఉండే ప్రాంతంలోని కణాలతో అనుసంధానితమై జెట్‌లాగ్‌ నివారిస్తుందని పేర్కొంటున్నారు ఎడింబర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. అంతేకాదు... ఈ చుక్కల మందు పరిజ్ఞానాన్ని భవిష్యత్తులో రాత్రివేళల్లో పనిచేయాల్సి రావడం వల్ల పగలు ఇబ్బంది పడేవారికీ ఉపయోగించవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు.

 

మరిన్ని వార్తలు