చిరస్మరణీయ చిత్రరచయిత...

27 Oct, 2013 23:33 IST|Sakshi

ఆరోజుల్లో ఒక కోట ఉండేది... ఎంత అందంగా ఉండేదంటే... ఎంత?  మాటలకు అందనంత... నిరాశపడాల్సిన పనేమీ లేదు. మాటలకు అందని అందాలు కూడా సోరెల్ కుంచెకు అవలీలగా అందాయి. పురాతనకట్టడాల నిర్మాణపరమైన అందాలను చిత్రాల్లోకి అనువదించడంలో గొప్ప పేరు గడించారు ఆయన....
 
 నగల వర్తకుడి కుమారుడైన సోరెల్‌కు నగల కంటే విలువైనవి ‘చిత్రాలు’ ఎక్కడ ఆకట్టుకునే చిత్రం కనిపించినా గంటల తరబడి ఆ చిత్రాన్ని చూస్తూ గడిపేవాడు. లండన్‌లోని టుటింగ్ ప్రాంతంలో జన్మించిన సోరెల్ చిన్నప్పుడు ఎప్పుడూ అనారోగ్యంతో బాధ పడుతుండేవాడు. దీనికితోడు నత్తి. దీంతో ఎవరినీ కలవాలనిపించేది కాదు. కలిసినా మాట్లాడలనిపించేది కాదు. బడికి వెళ్లాలనిపించేది కాదు. దీనికి తోడు అమ్మ అకాల మరణం.
 

అలా... ఒంటరితనం దరి చేరింది. తనదైన ఏకాంతసౌధం వెలిసింది. అది చిత్రశాలగా మారడానికి అట్టే కాలం పట్టలేదు. చిత్రసాధనలో ఎప్పుడూ తలమునకలై కనిపించే సోరెల్, కాకలు తీరిన చిత్రకారుడు కావడానికి అట్టే కాలం పట్టలేదు. వంక పెట్టలేని ప్రతిభాసంపన్నుడిగా సోరెల్ పేరు గడించాడు. మ్యూరల్ పెయింటర్, వార్ ఆర్టిస్ట్, కమర్షియల్ ఇలస్ట్రేటర్‌గా తగిన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆర్కియాలజికల్ ఇలస్ట్రేషన్లలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు సోరెల్. ఇదే ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆర్కియాలజీ రచయితలు తాము రాసిన వ్యాసాలకు సోరెల్‌తో బొమ్మలు గీయించుకోవడానికి ఇష్టపడేవారు.
 
చిన్నప్పుడు నాన్నతో కలిసి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం సోరెల్‌కు ఇష్టంగా ఉండేది. అక్కడి అందమైన దృశ్యాలను చిత్రాలుగా గీసేవాడు.
 లండన్‌లోని ‘ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్’లో డ్రాయింగ్ టీచర్‌గా  పనిచేశాడు సోరెల్. ‘రాయల్ వాటర్ కలర్ సొసైటీ’లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. కళ తప్పిన, కనుమరుగైన ఎన్నో పురాతన కట్టడాలను తన కుంచెతో పునర్నిర్మాణం చేశాడు సోరెల్. చిత్రకళకు సంబంధించిన విద్యార్థులకు మాత్రమే కాక  చరిత్ర, పురాతత్వశాఖ విద్యార్థులకు కూడా ఆయన చిత్రాలు అధ్యయనం చేయదగిన చిత్రాలుగా ఉండేవి. ఆర్కియాలజికల్ ఇలస్ట్రేటర్ కావాలనుకునేఎందరో విద్యార్థులకు సోరెల్ చిత్రాలను అధ్యయనం చేయడం అనేది తప్పనిసరి అవసరంగా ఉండేది.

ఎలెన్ సోరెల్ చిత్రకారుడు మాత్రమే కాదు రచయిత కూడా. ‘రోమన్ లండన్’ ‘ఇంపీరియల్ రోమ్’ ‘బ్రిటిష్ కాజిల్స్’ ‘రికన్‌స్ట్రక్టింగ్ ది పాస్ట్’ మొదలైన పుస్తకాలు రాశాడు. ఆయన 1974లో మరణించాడు. ‘ఎ లైఫ్ రీ కన్‌స్ట్రక్టెడ్’ పేరుతో లండన్‌లోని సర్ జాన్ సౌన్ మ్యూజియంలో మూడు రోజుల క్రితం సోరెల్ చిత్రప్రదర్శన ప్రారంభమైంది. విశేషమేమిటంటే గతంలో ఎప్పుడూ ప్రదర్శితం కాని చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ‘‘నేటితరానికి చెందిన చాలామందికి సోరెల్ పేరు తెలియకపోవచ్చు. కాని ప్రతితరం గుర్తు పెట్టుకోవల్సిన చిత్రకారుడు ఆయన’’ అన్నాడు మ్యూజియం క్యూరేటర్‌లెన్‌స్కి.
 

మరిన్ని వార్తలు