ఆత్మ సాక్షాత్కారం

28 Jun, 2018 00:27 IST|Sakshi

రాధకు కృష్ణుడంటే అపరిమితమైన ప్రేమానురాగాలు. నిత్యం కృష్ణుడి ధ్యానంలోనే తలమునకలుగా ఉండేది. అది చూసిన ఓ పండితుడు రాధ వద్దకు వచ్చి ఆమెతో ఇలా అన్నాడు: ‘‘ఈ ప్రపంచమంతా మిధ్య. ఇది విషయానుభవాన్నిస్తుంది కాని ఆత్మానుభవాన్నివ్వలేదు. ఈ మాయామేయ ప్రపంచాన తిరుగుతున్న మహామాయగాడు ఆ కృష్ణుడు. ఆ మాయావిని ప్రేమించి, ధ్యానించి నీ జీవితాన్ని వృథా చేసుకుంటున్నావు. నా మాట విని దేహాభిమానాన్ని వీడి, ఇంద్రియాలను జయించి, అంతర్ముఖివై ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తరించు’’ అని ప్రబోధించాడు.

వారి మాటలకు బదులుగా రాధమ్మ ‘‘స్వామీ మీ పాండిత్య ప్రకర్షకు, శాస్త్ర పరిజ్ఞానానికి శతకోటి నమస్కారాలు. కాని నాదొక విన్నపం. ఈ పరమాత్మ ప్రకృతి కన్నా వేరుగా ఉన్నాడా?’’అంది. అందుకా పండితుడు... పరమాత్మ వేరుగా లేడన్నాడు. ‘‘మరి ఈ పంచభూతాత్మక ప్రపంచమంతా తానే అయినప్పుడు, పరమాత్మ దర్శనం కేవలం అంతర్ముఖత్వంలోనే కలుగుతుందనడం సమంజసమా? బాహ్యాంతరంగాలన్నీ అతని దివ్యరూప స్వరూపాలే.

అసంఖ్యాకమైన అణువులూ, ఈ తనువులు, ఈ ప్రపంచం... ఈ సాక్షాత్కరించినదంతా ఆత్మ సాక్షాత్కారమే. ఈ దేహం ప్రకృతిలోని భాగమే. దేహం ఆత్మదేవుని ఆనందమందిరం. దీనిలోని ప్రతిభాగం, ప్రతి ఇంద్రియం, సూక్ష్మాతి సూక్ష్మమైన కణసముదాయం... ఆత్మచైతన్యంతో నిండి మహాద్భుతంగా, మహిమాన్వితంగా అంతుచిక్కని ప్రజ్ఞతో పని చేస్తుంది.

హృదయాన భావోదయం, మన కనులముందు కాంతిమయ ఈ అనంత విశ్వోదయం... ఇదంతా ఆత్మావిష్కృతమైన జగచ్చిత్రమే. ఆత్మ తప్ప అన్యం లేదన్న ప్రజ్ఞ కలిగినప్పుడు ‘నేనే అనే అహంకార వికారానికి తావెక్కడుంటుంది?’’ అని ప్రశ్నించింది. అప్పటివరకు రాధకు హితబోధ చేద్దామని వచ్చిన ఆ పండితుడి నోరు రాధ మాటలతో మూతబడిపోయింది. రెండు చేతులూ ఎత్తి రాధకు, ఆ తర్వాత కృష్ణుడికీ మనసులోనే నమస్కరించి అక్కడినుంచి చల్లగా జారుకున్నాడు.

– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు