బామ్మగారి బొమ్మలు

9 Oct, 2013 00:23 IST|Sakshi
బామ్మగారి బొమ్మలు

డెబ్బైరెండేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? రొటీన్ డైలాగ్... మనవళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారని చెబుతాం. సౌశీల్య శామ్యూల్ మాత్రం మనవళ్లతో ఆడుకుంటూనే వారితో పాటు పెయింటింగ్ నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. డెబ్బైరెండేళ్ల వయసులో కూడా కుంచెని ఎంతో కళగా తిప్పుతూ తన ఆయిల్ పెయింటింగ్ చిత్రాలతో మనవళ్లతోనే కాదు తన తోటివారితో కూడా శభాష్ అనిపించుకుంటున్న ఈ కళాకారిణి గురించి....
 సికింద్రాబాద్‌లో నివాసముంటున్న సౌశీల్య విజయనగరం మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత మనవళ్లతో కాలక్షేపంతో పాటు తనలో దాగి ఉన్న కళలను బయటికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. టీచర్‌గా పనిచేస్తున్న సమయంలోనే వాటర్‌కలర్స్ గురించి కొంచెం అవగాహన తెచ్చుకున్నాను. మా మనవళ్లకు పెయింటింగ్ నేర్పడానికి మాస్టారు వచ్చినప్పుడు నేను కూడా వాళ్ల పక్కన కూర్చుని శ్రద్ధగా గమనించే దాన్ని. నాక్కూడా ఆసక్తి కలగడంతో దాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. దాంతో మాస్టారినడిగి ఓ పదిక్లాసులు చెప్పించుకున్నాను. పెయింటింగ్‌లో 108 సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో నేను పోర్ట్రయిట్, లాండ్‌స్కేప్స్ లాంటి సబ్జెక్టులు... నేర్చుకున్నాను’’ అని చెప్పారు సౌశీల్య.
 
 తక్కువ సమయంలో....
 అతి తక్కువ సమయంలోనే ఆయిల్ పెయింటింగ్‌‌స వేయడంపై పట్టు సాధించిన ఈ బామ్మగారు అంతటితో ఊరుకోలేదు. సికింద్రాబాద్ సెంట్‌మేరీ చర్చ్‌లో ఎగ్జిబిషన్ పెట్టి అందరినీ అబ్బురపరిచారు. ‘‘జీసస్ బొమ్మలతో పాటు రకరకాల సీనరీస్, పక్షులు, జంతువులు, పూలతోటలు....నా మనసులో ఉన్న ప్రతి ఒక్క ఫీలింగ్‌కి రూపం ఇచ్చాను. ఆ ఎగ్జిబిషన్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. నా పెయింటింగ్‌ల గురించి తెలిసిన చాలామంది నాతో బొమ్మలు గీయించుకోడానికి ముందుకొస్తున్నారు. ఈ వయసులో ఏదో సరదాగా నేర్చుకున్న కళ నన్నింత బిజీ చేస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ సంతృప్తితో ముగించారు సౌశీల్య.
 - భువనేశ్వరి

మరిన్ని వార్తలు