నిషేధం వద్దన్నందుకు నిర్బంధం

4 Jun, 2018 00:45 IST|Sakshi

సౌదీ అరేబియాలో స్త్రీవాద కార్యక్రమాలపై ప్రభుత్వం విరుచుకుపడడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫెమినిస్టు కార్యకర్తల్ని నిర్బంధించి, వేధింపులతో వారిని దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్యకర్తల ఒత్తిడిపై ఇటీవల సౌదీ అరేబియా.. మహిళలు డ్రైవింగ్‌ చెయ్యడంపై ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని తొలగించింది.

అయితే ఆ తొలగింపుకు కొద్ది వారాల ముందు ముగ్గురు కీలకమై మహిళా కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా బయట పడింది. ఇక గతవారం అయితే మరో ఏడుగురు మహిళల్ని అరెస్టు చేసి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు హక్కుల సంఘాలు తాజాగా వెల్లడించారు. అరెస్ట్‌ అయినవారంతా.. మహిళల డ్రైవింగ్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పనిచేసినవారేనని, వారికి విడుదల కోసం ప్రగతివాదులంతా ఏకం కావాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పిలుపునిచ్చింది.


ట్రంపు చెవుల్లోకి డప్పులు
జూలై 13న ట్రంప్‌ య.కె. వస్తున్నారు. అయితే ఆయన్ని బ్రిటన్‌ లోపలకి అడుగు పెట్టనిచ్చేది లేదని ‘ఉమెన్స్‌ మార్చ్‌’ నిర్వాహకులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు అయ్యాక ట్రంప్‌ తొలిసారిగా బ్రిటన్‌ వస్తున్న సందర్భం అది. ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటనకింకా నెలకు పైగా సమయం ఉండగనే ఇప్పట్నుంచే ‘ఉమెన్స్‌ మార్చ్‌’ దేశవ్యాప్తంగా మహిళల్ని సమీకరించి ఆ రోజున ట్రంప్‌ రాకపై తన నిరసనను ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది.

ఈ నిరసన ఉద్యమానికి ‘బ్రింగ్‌ ద నాయిస్‌’ అనే పేరు పెట్టింది. ఇంట్లో గిన్నెల్ని, తపేళాల్ని వీధుల్లోకి తెచ్చి వాటిపై డబ్బు మోగించి, ట్రంప్‌ చెవుల్ని అదరగొడతారు. దక్షిణమెరికా దేశాలో మొదలైన ఈ తరహా ‘క్యాజరోల్‌ ప్రొటెస్ట్‌’ ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలన్నిటికీ పాకుతోంది. ట్రంప్‌ అనుసరిస్తున్న వలస విధానాలపై లండన్‌ మహిళల ప్రతిధ్వనే జూలై 13న జరగబోయే ‘బ్రింగ్‌ ద నాయిస్‌’ ప్రదర్శన.


బధిరులైపోతారు జాగ్రత్త!
స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక, చెవులకు ఇయర్‌ఫోన్స్‌ తగిలించుకుని గంటల తరబడి పాటలు వినడం చాలా మందికి అలవాటుగా మారింది. ముఖ్యం గా ముప్పయ్యేళ్ల లోపు వయసు వారిలో ఈ అలవాటు మరీ మితిమీరుతోంది. ఈ అలవాటును మానుకోకపోతే బధిరులైపోతారు జాగ్రత్త అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం వినే శబ్దాలు ఏవైనా సరే, వాటి తీవ్రత 85 డెసిబల్స్‌ వరకు పర్వాలేదని, అంతకు మించితే వినికిడి సామర్థ్యం క్రమంగా దెబ్బతింటుందని వారు చెబుతున్నారు.

ఇయర్‌ ఫోన్స్‌ ద్వారా పూర్తి వాల్యూమ్‌తో మ్యూజిక్‌ వింటున్నట్లయితే, ఆ శబ్ద తీవ్రత 110 డెసిబల్స్‌ వరకు ఉంటుందని, ఇది జెట్‌ విమానం టేకాఫ్‌ అయ్యేటప్పుడు వెలువడే శబ్ద తీవ్రతకు సమానమని బ్రిటన్‌లోని సెంట్రల్‌ మిడిలెసెక్స్‌ హాస్పిటల్‌కు చెందిన పీడియాట్రిక్‌ ఆడియాలజిస్ట్‌ డాక్టర్‌ రాస్బిన్‌ సయ్యద్‌ వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మ్యూజిక్‌ వినే అలవాటు ఉన్నవారిలో వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, యువతరంలో ఇదే ధోరణి కొనసాగితే ఒక తరానికి తరమే బధిరులుగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు