పచ్చ పుట్ట

19 Jun, 2018 00:09 IST|Sakshi

అడిక్షన్‌

అంబర్‌ లూక్‌కు ఇప్పుడు 23 సంవత్సరాలు.కాని యాభై ఏళ్లకు సరిపడా శరీరాన్నికష్టానికి గురి చేసింది. మార్పు చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది. అంబర్‌ లూక్‌ను స్నేహితులు ‘బ్లూ ఐస్‌ వైట్‌ డ్రాగన్‌’ అని పిలుస్తారు. కారణం ఏమిటో తెలుసా? అందరూ వంటి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు. కాని అంబర్‌ కంటిగుడ్లలో పచ్చబొట్టు పొడిపించుకుంది. అదీ నీలిరంగులో. నీలి రంగు కళ్లతోటి ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి మాత్రమే ఉంది.

16వ ఏట నుంచి
అంబర్‌ లూక్‌ది ఆస్ట్రేలియాలోని తీరప్రాంతం. అందరిలాంటి సాదాసీదా అమ్మాయే (ఫొటో చూడండి). కాని అందరిలా ఉండటం నాకు బోర్‌ అంటుంది అంబర్‌ లూక్‌. నలుగురినీ ఆకర్షించాలి అనుకుంది. దానికి మార్గం పచ్చబొట్టు. 16వ ఏట మొదటిసారి పచ్చబొట్టు వేయించుకుంది. ‘అప్పటి నుంచి ఆ ఇంక్‌కు నేను అడిక్ట్‌ అయ్యాను’ అని ఆమె అంటోంది. అప్పటి నుంచి అంబర్‌ ఆగలేదు. శరీరంలోని ఏ భాగాన్ని ఖాళీగా వదల్లేదు. నుదురు, భుజాలు, బాహు మూలాలు, తొడలు, మడమలు, కటి ప్రాంతం... ఇలా ఇప్పటికి యాభై పచ్చబొట్లు పొడిపించుకుంది. అన్నింటి కంటే కష్టమైన పచ్చబొట్టు కంటిలో పొడిపించుకున్నదే. ‘నా టాటూ ఆర్టిస్ట్‌ నీ కళ్లను నీలి రంగులో మార్చుకో అని చెప్పాడు. ఆ పచ్చబొట్టు వేయడానికి 40 నిమిషాలే పట్టింది. కాని దాని వల్ల నరకం చూశాను. ఆరుసార్లు కంట్లో నీడిల్‌ని పొడిచారు. పచ్చబొట్టు వేశాక మూడు వారాలు ఏమీ చూడలేకపోయాను. కాని ఇప్పుడు నీలి రంగులో ఉన్న నా కళ్లను చూసుకుంటే నాకు గర్వంగానే ఉంటుంది’ అందామె. అంబర్‌ లూక్‌ ఇప్పటికే నాలుకను డ్రాగన్‌ నాలుకలా మధ్యలో చీలిక తెచ్చుకుంది. ‘ఇక నా పళ్లను డ్రాకులా పళ్లలా మార్చుకోవడమే మిగిలింది’ అంది.

అయిదు లక్షల ఖర్చు
అంబర్‌ లూక్‌ ఇప్పటికి తన పచ్చబొట్ల కోసం అయిదు లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకా ఖర్చు చేయాలనుకుంటోంది. ఆమెకంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ముప్పై వేల మంది ఫాలోయర్స్‌ తయారయ్యారు. వారంతా ఆమెను అభిమానిస్తున్నారు. కాని అంబర్‌ లూక్‌ వెర్రి చేష్టలకు విసుక్కుంటున్న నెటిజన్స్‌ కూడా చాలామంది ఉన్నారు. ‘నన్ను చూసి చాలామంది చిరాకు పడుతున్నారు. ఏం చేయను? పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల నాకు డిప్రెషన్‌ దూరమైన భావన కలుగుతోంది’ అంటోంది లూక్‌.డిప్రెషన్‌ను అతిగా తినేవాళ్లు ఉన్నారు. అతిగా నిద్రపోయేవారు అస్సలు నిద్రపోని వారు కూడా ఉన్నారు. కాని ఇలా అతిగా పచ్చబొట్లు వేసుకునేవారు కూడా ఉండటం వింత. అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉండాలి అనడానికి లూక్‌ ఉదంతం ఒక ఉదాహరణ. 

మరిన్ని వార్తలు