జిరాక్స్‌ రాయ్‌

8 Jun, 2020 00:05 IST|Sakshi

దేవుడికి నమూనాల అవసరం ఉంటుందా! ఆయన క్రియేటర్‌. అచ్చులు.. మూసలతో దేన్నీ రిపీట్‌ చెయ్యడు. ప్రతిదీ దేనికదే కొత్తది తయారవుతుందక్కడ. మరేమిటి.. ఐశ్వర్యారాయ్‌కి ఇక్కడిన్ని జిరాక్స్‌ కాపీలు?!
రాయ్‌కి, ‘దేవ్‌’కి మధ్య ఒప్పందం జరిగిందా! ఇరవై ఏళ్ల క్రితం ఐశ్వర్యారాయ్‌ ఎలా ఉండేవారు? ఇప్పుడున్నట్లే ఉండేవారు. పెద్దగా ఛేంజ్‌ లేదు ఆమెలో ఎందుకో మరి! కిందికి వచ్చే ముందే పైన దేవుడితో డీల్‌ కుదిరి ఉండాలి. ‘స్వామీ.. నన్నెప్పటికీ ఒకేలా ఉంచండి’ అని ఐష్‌ అడిగితే.. ‘అలా కుదరదు గానీ అమ్మాయీ.. ఎవ్రీ ఇయర్‌ ఎక్కడో ఒక చోట నీలాంటి అమ్మాయిలు ‘పాప్‌–అప్‌’ అయి (పైకి లేస్తూ) అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు’ అని దీవించి ఉంటాడు ఆ దైవమాత్రుడు.. ఈ మానవకన్యను.

‘మిస్‌వరల్డ్‌’ అయినప్పుడు ఐశ్వర్య వయసు 21. తొలి సినిమా ‘ఇరువుర్‌’లో 24. పెళ్లి నాటికి 34. ఇన్ని ఏజ్‌లలోనూ ఇప్పటికీ ఐశ్వర్య ఒకేలా కనిపించడానికి ఆమె రూపంలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఈ భువిపై మనకు సాక్షాత్కరిస్తూ ఉండటం ఒక కారణం అయి ఉండాలి. కొత్తగా అమ్యూజ్‌ అమృత అనే అమ్మాయి ఐశ్వర్యలా టిక్‌టాక్‌లో దర్శనం ఇస్తోంది. 2002 నాటి ‘కండుకొండైన్‌ కండుకొండైన్‌ (నేను కనుగొన్నాను. నేను కనుగొన్నాను) అనే తమిళ చిత్రంలో మమ్ముట్టికి, ఐశ్వర్యకు మధ్య చిన్న సంభాషణ ఉంది. ఆ సంభాషణను టిక్‌టాక్‌లో అమ్యూజ్‌ అమృత ఇమిటేట్‌ చేశారు. ఆ మాట్లాడ్డం, మాట్లాడుతూ పాజ్‌లు ఇవ్వడం, కళ్లు తిప్పడం, పెదవులు కదల్చడం.. సేమ్‌ జిరాక్స్‌ ప్రింటే ఐశ్వర్యకు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది. అందులో శుద్ధ సంప్రదాయ కర్ణాటక ఐశ్వర్యలా కనిపించే అమృత తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ‘మిలే సుర్‌ మేరా తుమ్హారా’ అన్నట్లు.. భారతదేశంలోని భిన్న సంస్కృతులలో ఐశ్వర్య హావభావాలతో కనిపిస్తుంది.

అమ్యూజ్‌ అమృతను చూస్తే ఐశ్వర్య ఎలా ఫీల్‌ అవుతారో కానీ.. స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు మాత్రం ‘అరె!!’ అనుకున్నారట. ఐశ్వర్య ఫస్ట్‌ కాపీ స్నేహా ఉల్లాల్‌. ‘లక్కీ : నో టైమ్‌ ఫర్‌ లవ్‌’ (2005) చిత్రంతో సడన్‌గా ఉల్లాల్‌ ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ‘ఎక్కడ వెతికి పట్టుకున్నాడు ఈ అమ్మాయిని సల్మాన్‌?’ అని అంతా అనుకున్నారు. అందులో హీరో సల్మానే. ఐశ్వర్య తన ప్రేమను కాదన్నందుకు ఆమెకు పోటీగా సల్మాన్‌ ఏడు లోకాలు వెతికి ఉల్లాల్‌ను పట్టుకొచ్చాడని ఆ సినిమాతో పాటే రూమర్‌లూ రిలీజ్‌ అయ్యాయి. మస్కాట్‌లో పుట్టిన ఈ మంగుళూరు అమ్మాయి మన తెలుగులో కూడా నటించింది. ‘ఉల్లాసంగా.. ఉత్సాహంగా’, ‘సింహా’లలో  లీడ్‌ రోల్స్‌ ఉల్లాల్‌వి. చక్కగా కుందనపు ఐశ్వర్యారాయ్‌లా ఉందనుకున్నారు ప్రేక్షకులు. ఆ మాట నచ్చినట్లు లేదు ఉల్లాల్‌కి. ‘‘మీరు అచ్చు ఐశ్వర్యలా ఉంటారని అంతా అంటుంటారు కదా..’’ అని ఒక ఇంటర్వూ్యలో అడిగిన ప్రశ్నకు.. ‘‘ఐశ్వర్యా! ఎవరూ?!’’ అని చికాకు పడ్డారు కూడా.

మరీ ఉల్లాల్‌లా అచ్చుగుద్దినట్లు ఐశ్వర్యలా లేకపోయినా.. ‘ఆనందం’ (2001) సినిమాలో హీరోయిన్‌ రేఖా వేదవ్యాస్, అదే ఏడాది విడుదలైన ‘ఇట్లు.. శ్రావణి, సుబ్రహ్మణ్యం’లో తనూరాయ్‌ కొన్ని యాంగిల్స్‌లో ఐశ్వర్యను గుర్తుకు తెచ్చారు. ఏళ్లు గడిచాయి. ఐశ్వర్యలా కనిపించిన ఉల్లాల్, రేఖ, తనూరాయ్‌ మారిపోయారు కానీ, ‘అసలు ప్రతి’ ఐశ్వర్య మాత్రం అలానే ఉండిపోయారు. మరాఠీ నటి మానసీ నాయక్, బెంగాలీ నటి మిష్టీ చక్రవర్తిలో కూడా ఐశ్వర్య పోలికలు ఉంటాయి. అమ్యూజ్‌ అమృతకు కాస్త సీనియర్‌లు మానసీ, మిష్టి. మామూలుగానే మనిషిని పోలిన మనిషి కనిపించినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇక ఐశ్వర్యలాంటి వాళ్లు ఏడాదికొకరు అన్నట్లు ప్రత్యక్షం అవుతుంటే ఐశ్వర్యకు వయసు పెరుగుతుందా? వన్నె తగ్గుతుందా? ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఎన్ని గ్యాపులతో ఎన్ని సినిమాల్లో నటించినా ఐశ్వర్యకు అది ఎంట్రీనే తప్ప రీ–ఎంట్రీ అవకపోవడానికి ఆమె కాలాతీత అభినయ సౌందర్యం కానీ, ఆమె సౌందర్యాభినయం గానీ ఆమెలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉండి ఉండొచ్చు.

మరిన్ని వార్తలు