నిమిషంలో చదివే కథ.. 

9 Dec, 2019 00:20 IST|Sakshi

కథాసారం

ఇప్పుడు చెప్పబోయే కథ నిజం కాకపోవచ్చు, కానీ నిజం కాని కథల పట్ల కూడా మనం గొప్ప ఆసక్తిని కలిగుండాలి. ఎందుకంటే ఆ కథలు చెప్పే విధానం వల్ల ఒక గొప్ప వెలుగు మనలోకి ప్రసరించవచ్చు. ఎవరైనా ఇదే కథను ఒక ఐదేళ్ల కింద గనక చెప్పివుంటే దాన్ని ఈ విధంగా చెప్పేవాళ్లు:

కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ఒక ముసలాయన బాలటాన్‌(హంగరీలోని ప్రసిద్ధ సరస్సు) నుంచి రోడ్డు మీద నడుస్తున్నాడు. కాసేపైన తర్వాత ఉన్నట్టుండి అతడు తన చేయిని ఆపమన్నట్టుగా ఊపడం మొదలుపెట్టాడు. అదే తోవలో దూరంగా ఒక భారీ వాహనమేదో వస్తూ కనబడింది. దగ్గరికి వస్తూనే ఆ భారీ వాహనం ఆగుతుంది, డ్రైవరు డోర్‌ తీస్తాడు.
‘‘కామ్రేడ్‌(మిత్రుడు/సహచరుడు), ఎందుకు బండిని ఆపావు?’’ అడిగాడు అతను.
‘‘ఎందాకా మీ ప్రయాణం?’’ ముసలాయన వాకబు చేశాడు.
‘‘మేము దగ్గర దగ్గర బుడాపెస్ట్‌ దాకా వెళ్లాలి, కామ్రేడ్‌.’’
‘‘దయచేసి నన్ను అందులో కొంచెం ఎక్కించుకుంటారా?’’ అడిగాడు ముసలాయన.
‘‘కానీ లోపల జాగా లేదు, కామ్రేడ్,’’ డ్రైవర్‌ జవాబిచ్చి, డోర్‌ మూసి, గేరు మార్చాడు.
ఈపాటికల్లా కొంత ఎండ వచ్చింది, ఆ ఎండలో నీలిరంగు సరస్సు తళుకులీనుతోంది. పొద్దుపోవడానికి మనకు మనం ఎన్నో గొప్ప కథలు చెప్పుకుంటున్నాం. ఈ కథ కూడా మళ్లీ మన మధ్యకు వచ్చింది, కాకపోతే

కొత్త రూపంలో:
కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ఒక ముసలాయన బాలటాన్‌ నుంచి రోడ్డు మీద నడుస్తుండగా, అదే తోవలో ఒక భారీ వాహనమేదో వస్తూ కనబడింది. వృద్ధుడిని సమీపించగానే ఆ భారీ వాహనం ఆగుతుంది, డ్రైవర్‌ డోర్‌ తెరుస్తాడు.
‘‘ఓ పెద్దాయనా, బుడాపెస్ట్‌ దిక్కేనా నువ్వు పోవడం?’’ అడిగాడు అతను.
‘‘ఔను,’’ జవాబిచ్చాడు వృద్ధుడు.
‘‘దా, ఎక్కు, నిన్ను అక్కడ దిగబెడతాం,’’ స్నేహపూర్వకమైన నవ్వుతో అన్నాడు డ్రైవర్‌. ముసలాయన లోపలికి ఎక్కి, కిటికీకి తల ఆనించి, నిదానంగా అడుగుతాడు:
‘‘లోపల రేడియో ఏమీ లేదా?’’
రెండు కథలూ బానేవున్నాయి, కానీ రెండూ నిజం కాదు. నిజం ఎంతవరకూ అంటే, ఆ కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ముసలాయన రోడ్డు మీద నడుస్తుండగా అదే తోవన ఒక భారీ వాహనం ఏదో వస్తూ కనిపించడం. కానీ దానివైపు చెయ్యెత్తి ఆపాలని ఎప్పటికీ ఆ ముసలాయనకు తోచదు, ఆ పెద్దాయన్ని చూడగానే ఆపాలని ఆ డ్రైవరుకు ఏనాటికీ  అనిపించదు.
ఇదీ నిజమైన కథ. కానీ మనలో మన మాట, ఈ కథ ఆ రెండింటికంటే పెద్ద గొప్పగా ఏం లేదు. 

మరిన్ని వార్తలు