సినారే జయంతి

29 Jul, 2019 12:15 IST|Sakshi

మాత్రా సాహిత్యాన్ని స్పర్శించి, మానవ అభ్యుదయాన్ని కాంక్షించి, తెలుగు సాహితీ సుక్షేత్రం కావ్య కన్య స్వాభిమాన పరిరక్షణ కోసం ఏడు దశాబ్ధాల పాటు కలంమూయని కారణజన్ముడు. అఖిల ఆంధ్రావని కవి కోటి పారాయణరెడ్డి, ఆచార్య సి.నారాయణరెడ్డి. తన పాండిత్యం, సాహిత్యంతో పండిత పామరులందరికీ నిత్య స్మరణీయుడయ్యాడు. సమకాలీన సంఘటనలపై మానవీక స్పందనతో కవిత్వాన్ని అందించిన సినారె శబ్ధం మీద సాధికారతను సాధించి అర్థస్ఫూర్తితో నిరంతరం అభ్యుదయం, మానవీయ చింతన చేసిన మహాకవి సినారె. మహావక్తగా, మహాకవిగా సాహిత్యాభిమానుల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా..

సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్‌) : సినారెగా సుప్రసిద్ధుడైన డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డిది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని హనుమాజీపేట. బుచ్చమ్మ, మల్లారెడ్డి తల్లిదండ్రులు. 1931 జూలై 29న జన్మించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంతో పాటు సిరిసిల్ల,కరీంనగర్‌లో పూర్తి చేశారు. ఉన్నత విద్యాభ్యాసానికి హైదరాబాద్‌ వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. కళాశాల విద్యార్థిగా ఉన్నపుడే శోభ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. పసి వయసులో విన్న హరికథలు, జానపదాలు, జంగం కథల స్ఫూర్తితో ఉన్నత స్థాయి సాహితీవేత్తగా ప్రఖ్యాతి చెందారు. 1953లో నవ్వనిపువ్వుతో ప్రారంభమైన సినారె సాహిత్య ప్రస్థానం అలుపెరగక సాగిపోయింది. పద్య కవితలు, గేయకావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్ర కథలు, గజళ్లు, వ్యాసాలు విమర్శలు, అనువాదాలు వంటి అనేక సాహితీ ప్రక్రికయల్లో అనితర సాధ్యమైన ప్రతిభను చాటుకున్నారు.

నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, విశ్వంభర, మంటలు మానవుడు, మధ్య తరగతి మందహాసం, నడక నా తల్లి, తెలుగు గజళ్లు, భూమిక, ముఖాముఖి, ఆరోహణ, అక్షర గవాక్షాలు, ఇంటి పేరు చైతన్యం తదితర రచనలు చేశారు. సినారె రాసిని రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది. దీంతో పాటు ఆయన గ్రంథాలు ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ సంస్కృతం, మలయాళం, హిందీ, ఉర్దూ కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో సందర్శించారు. అంతర్జాతీయ కవి సమ్మేళనాల్లో భారతీయ ప్రతినిధిగా హాజరై తెలుగు సాహిత్య వైభవాన్ని విశ్వయవనికపై చాటారు. ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు పేరిట సినారె పరిశోధన ఆయను పీహెచ్‌డీ ప్రామాణిక విమర్శన గ్రంథంగా మిగిలింది.

అత్యున్నత పురస్కారాలు..
కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రు పురస్కారంతో పాటు విశ్వంభర  దీర్ఘ కావ్యానికి 1988లో  ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారం వరించింది.భారతీయ భాషా పరిషత్, రాజలక్ష్మి, అసాన్,  ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక వ్యవహారాలు సలహాదారునిగా, సాంస్కృతిక మండలి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట సాహిత్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్‌ బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం స్వీకరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించారు. భారత ప్రభుత్వం సినారె సేవలను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలిచ్చింది. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌తో గౌరవించాయి. 

 సినిమా పాటలు కైకట్టి..
వందలాది సినిమాలకు వేల సంఖ్యలో సినీ గీతాలు రాశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా విడుదలైన గులేబకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేసిన సినారె ఆపైన సుమారు మూడు వేలకు పైగా పాటలు రచించి సినిమా ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. చిలిపి కనుల తీయని చెలికాడా..అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు, జాతిని నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు. అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అద్దమున్నదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. ఓ ముత్యాల కొమ్మా...ఓ రాములమ్మా.. తదితర తెలుగు సినిమా పాటలు సినారె ప్రతిభకు తార్కాణాలు. సినిమా పాటల్లో సైతం సాహిత్య విలువలకు పట్టం కట్టి తెలుగు సినీ సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. రెండేళ్ల క్రితం జూన్‌ 17 హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్ను మూశారు.

సాహిత్యంపై సమాలోచన
సినారె జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఈ నెల 30న సాహిత్య సమాలోచన జరుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సినారె కేంద్ర గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి  గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, జూకంటి జగన్నాథం, కందేపి రాణీప్రసాద్, పెద్దింటి అశోక్‌ కుమార్, దూడం సంపత్‌ తదితరులు హాజరు అవుతున్నారు. సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని రచయితల సంఘం ప్రతినిదులు డాక్టర్‌ జనపాల శంకరయ్య, ఎలగొండ రవి తెలిపారు.

మరిన్ని వార్తలు