అనాసక్తి యోగము

10 Jun, 2019 03:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రతిధ్వనించే పుస్తకం

ఒక పర్యాయం గాంధీజీ జైలులో ఉన్నప్పుడు, మిత్రులు అడిగినమీదట భగవద్గీత వ్యాఖ్యానానికి పూనుకున్నారు. అది పుస్తకంగా 1929లో వెలువడింది. దాన్ని ‘అనాసక్తి యోగము’ పేరిట తెలుగులోకి ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య, పోతరాజు సీతారామారావు అనువదించారు. అందులో గీతను తాను ఎలా అర్థం చేసుకున్నాడో, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడో ముందుమాటలో వివరించారు మహాత్ముడు. అందులోంచి కొన్ని భాగాలు ఇక్కడ: పుస్తకం ఆర్కైవ్‌.ఆర్గ్‌లో ఉచితంగా చదవొచ్చు.

‘దేహమున్నచోట కర్మ యుండనే యుండును. దాని నుండి ముక్తి పొందినవారు లేరు. కర్మయున్నప్పు డందేదో యొక దోషముండక మానదు. ముక్తి నిర్దోషికే కదా లభించును. అట్లయినచో కర్మబంధనము నుండి లేక దోషస్పర్శము నుండి ముక్తి కలుగుట యెట్లు? సమస్త కర్మలను కృష్ణార్పణ మొనరించి అనగా మనో వాక్కాయ కర్మలను పరమేశ్వరునియందు హోమము చేసి అని నిశ్చయాత్మక శబ్దములతో గీత ప్రత్యుత్తరమిచ్చినది.’

‘జ్ఞానము కేవల శుష్క పాండిత్యముగ మారిపోవునేమోయని తలచి గీతాకారుడు జ్ఞానముతో భక్తిని చేర్చి దానికి ప్రథమ స్థాన మిచ్చియున్నాడు.’ ‘స్థితప్రజ్ఞుని లక్షణములే భక్తుని విషయమున వర్ణించియున్నాడు. తాత్పర్య మేమన, గీతాభక్తి బాహ్యాచారము కాదు. గ్రుడ్డితనముతో కూడిన శ్రద్ధ కాదు.’

‘ఎవ్వడితరులను ద్వేషింపడో, ఎవ్వడు కరుణకు నిధియో, ఎవ్వని కహంకార మమకారములు లేవో, ఎవ్వనికి సుఖదుఃఖములును, శీతోష్ణములను సమములైయున్నవో, ఎవ్వడు నిత్యసంతుష్టుడై యుండునో, ఎవ్వని నిశ్చయము మార్పునొందనిదై సదా యేకరీతి నుండునో, ఎవ్వనికి లోకము భయపడదో, లోకమున కెవ్వడు భయపడడో, ఎవ్వడు భూషణ వలన సంతోషమును దూషణము వలన దుఃఖము పొందకుండునో, ఎవ్వడేకాంతవాస మపేక్షించునో, ఎవ్వడు స్థిరబుద్ధి కలిగి యుండునో, వాడు భక్తుడు.’

‘ఒక వైపున కర్మ బంధనరూపమై యున్నది. ఇది నిర్వివాదాంశము. రెండవ వైపున దేహి ఇచ్ఛతోనే కాక అనిచ్ఛతో సైతము కర్మ చేయుచుండును. శారీరక మానసిక చేష్టలన్నియు కర్మలు. అట్లగుచో కర్మ చేయుచున్నను, మనుష్యుడు బంధవిముక్తు డెట్లగును? నేనెరిగినంత వరకు ఈ సమస్యను గీత పరిష్కరించిన విధముగా మరియే ధర్మగ్రంథమును పరిష్కరించి యుండలేదు. ‘‘ఫలాసక్తిని విడువుము. కర్మ చేయుము.’’ ‘‘ఆశారహితుడవై కర్మ చేయుము’’ అని గీత పల్కుచున్నది. కర్మ విడుచువాడు పతితుడగను. కర్మ చేయుచున్నను దాని ఫలము విడుచువాడు ఊర్ధ్వగతి కేగును.’

‘(గీతాకారుడు) మోక్షమునకును వ్యవహారమునకును మధ్య భేదముంచలేదు. వ్యవహారమున కుపయోగపడని ధర్మము ధర్మము కాదనుట గీతాభిప్రాయమని నా నమ్మిక. అనగా గీతామతానుసారము ఆసక్తి లేకుండ చేయ వీలులేని కర్మములన్నియు త్యాజ్యములు. ఇట్టి సువర్ణ నియమమనేక ధర్మసందేహముల నుండి మానవుని రక్షింపగలదు. ఈ మతానుసారము హత్య అసత్యము వ్యభిచారము మున్నగు కర్మలు వానియంతట అవియే త్యాజ్యములై పోవును. మానవ జీవితము సరళమగును. సరళత్వమందు శాంతి యుదయించును.’  

మరిన్ని వార్తలు